నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత వంటి ఎన్నెన్నో సమాచార శకలాలు అవసరమవుతాయి. ఆ సమాచారంలో అత్యధికభాగం, ఒక్కోసారి సమాచారం మొత్తంగానే గణాంకాల మీద ఆధారపడుతుంది. సమాజ స్థితిని కచ్చితంగా, నిర్దిష్టంగా ప్రకటించే ఆ గణాంకాలు ఎవరూ ఊహించి కనిపెట్టజాలనివి. అందువల్ల తప్పనిసరిగా సమాజంలో ఆయా వ్యక్తుల, సమూహాల దగ్గరికి వెళ్లి వారి వాస్తవ సమాచారం సేకరించి క్రోడీకరించవలసి ఉంటుంది. భారత సమాజం, లేదా తెలుగు సమాజం ఎంత విస్తారమైనదీ సంక్లిష్టమైనదీ అంటే, ఎంత సమాచారం సేకరించినా, ఎన్ని రంగాల, ఎన్ని తలాల సమాచారం సేకరించినా, ఇంకా అర్థం చేసుకోలేని, అర్థం కాని సమాజ భాగం ఎంతో కొంత మిగిలే ఉంటుంది.
అటువంటి సమాచార సేకరణ కష్టమూ క్లిష్టమూ అయిన రంగాలలో కులం ఒకటి. కులం మన సమాజంలో ఎంత ప్రధానమైనదో, దానికి ఉన్న ప్రభావం ఎంతటిదో అన్ని కోణాల నుంచీ వివరంగా అర్థం చేసుకోకుండా మన సామాజిక వ్యవస్థను సమగ్రంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రాథమికంగా మన సమాజంలో ఏ కులానికి చెందినవారు ఎంతమంది ఉన్నారు, వారు మొత్తం రాష్ట్ర జనాభాలో ఎంత శాతం, వారికి వారి జనాభా నిష్పత్తిలో విద్య, ఉద్యోగ, సంపద అవకాశాలు దక్కుతున్నాయా అనే మౌలికమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నప్పుడే సామాజిక న్యాయం అనే భావన సార్థకం అవుతుంది.
కులం మన సమాజంలో ఒక సార్వత్రిక అంశం గనుక, ప్రతి ఒక్కరూ ఏదో ఒక కులం లోనే పుడతారు గనుక, కులం వంశ పారంపర్యం గనుక, కులం నుంచి మారడానికి అవకాశం లేదు గనుక, సహపంక్తి భోజన, వివాహ సంబంధాల మీద కుల ఆంక్షలు ఉన్నాయి గనుక, కులం గురించి ప్రస్తావన లేకుండా వ్యక్తి జీవితాన్ని గాని, సమాజ జీవితాన్ని గాని పరిశీలించడం అసాధ్యం. రెండు వేల ఏళ్ల కింద రాసిన మనుస్మృతి, అంతకు ముందు నుంచే వస్తున్న కుల అంతరాల వ్యవస్థను అక్షరబద్ధం చేసింది. ఆ తర్వాత కాలంలో కుల అంతరాలను, కుల వివక్షను ఛేదించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా దాదాపు అన్నీ అరకొరగానే మిగిలిపోయాయి. కుల సంస్కరణల కోసం ప్రయత్నించిన మహానుభావుల అనుచర బృందాలతో కొత్త కులాలు తయారయ్యాయి. ఇటువంటి స్థితిలో మన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అత్యవసరమైన సమాచారాలలో ఒకటి కులం గురించిన సమాచారం.
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1872లో ప్రారంభించి, 1881 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నియతంగా, కచ్చితంగా చేస్తూ వచ్చిన జనగణనలో సహజంగానే కులగణన, కుల సమాచార సేకరణ కూడా 1931 జనగణన వరకూ క్రమబద్ధంగా కొనసాగింది. 1941 జనగణనలో కూడా కుల సమాచార సేకరణ జరిగింది గాని రెండో ప్రపంచ యుద్ధపు సంక్షుభిత పరిస్థితులలో ఆ గణాంకాల నివేదికలు బయటపడ లేదు. ఆ తర్వాతి 1951 జనగణన నాటికి అధికారంలోకి వచ్చిన వలసానంతర “స్వతంత్ర” పాలకులు ఎందువల్లనో గాని కులగణనకు అవసరమైన కాలమ్ ను జనగణన నుంచి తప్పించారు. ఆ తర్వాత 2011 వరకు ఆరు సార్లు జరిగిన జనగణనలలో కూడా కులం గురించి సమాచారం లేకుండా పోయింది. 2021లో జరగవలసిన జనగణన కోవిడ్ వల్ల జరగకపోగా, మూడు సంవత్సరాలు గడిచిపోయినా ప్రభుత్వం ఆ మాటే ఎత్తడం లేదు.
కులం మన సమాజంలో ఎంత ప్రధానమైనదో, దానికి ఉన్న ప్రభావం ఎంతటిదో అన్ని కోణాల నుంచీ వివరంగా అర్థం చేసుకోకుండా మన సామాజిక వ్యవస్థను సమగ్రంగా తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రాథమికంగా మన సమాజంలో ఏ కులానికి చెందినవారు ఎంతమంది ఉన్నారు, వారు మొత్తం రాష్ట్ర జనాభాలో ఎంత శాతం, వారికి వారి జనాభా నిష్పత్తిలో విద్య, ఉద్యోగ, సంపద అవకాశాలు దక్కుతున్నాయా అనే మౌలికమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నప్పుడే సామాజిక న్యాయం అనే భావన సార్థకం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం 1950ల తొలినాళ్లలో ఏర్పాటు చేసిన కాకా కాలేల్కర్ కమిషన్ ఎన్ని కులాలు ఉన్నాయో లెక్క చెప్పింది గాని, ఆయా కులాలలో ఎంతమంది ఉన్నారో, మొత్తంగా ఈ వర్గీకరణ కిందికి ఎంతమంది వస్తారో చెప్పలేదు. తర్వాత మూడు దశాబ్దాలకు వచ్చిన మండల్ కమిషన్, 1931 గణాంకాలను ప్రాతిపదికగా పెట్టుకుని, స్థూల జనాభా పెరుగుదల రేటును బట్టి, వెనుకబడిన కులాల జనాభా 55 శాతం ఉండవచ్చునని ఉజ్జాయింపుగా చెప్పింది. కాని రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు జనాభాకు తగినట్టుగా అందుతున్న రిజర్వేషన్ సౌకర్యాలు, వెనుకబడిన కులాల జనాభాకు తగినట్టుగా అందలేదు. ఒక అన్యాయమైన, అనవసరమైన సుప్రీంకోర్టు తీర్పు వల్ల వెనుకబడిన కులాల రిజర్వేషన్ 27 శాతానికి మించగూడదనే అభిప్రాయం స్థిరపడింది.
ఈ నేపథ్యంలో వెనుకబడిన కులాల వారు కచ్చితంగా జనాభాలో ఎంత శాతం ఉన్నారో, వారికి ఎంత వాటా దక్కుతున్నదో తేల్చడానికి జనగణనలో కులగణనను చేర్చాలనే ఆకాంక్ష బలపడుతూ వచ్చింది. దాదాపు అన్ని రాజకీయ పక్షాలూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బలపరిచిన ఈ ఆకాంక్ష, వారే అధికారంలోకి వచ్చినప్పుడు మాట మార్చడంతో అమలులోకి రాకుండా పోయింది. 2021 జనగణనలో కులగణనను భాగం చెయ్యాలనే ఒత్తిడి పెరుగుతుండగా కోవిడ్ వల్ల అసలు జనగణనే జరగలేదు గాని కులగణన డిమాండ్ మాత్రం ప్రభావశీలంగా ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమ ప్రారంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగతులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్ చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల ప్రస్తుత ప్రయత్నం సఫలమవుతుందా, అవసరమైన ఫలితాలు సాధిస్తుందా, ఈ కులగణన గణాంకాలతో నిజంగా వెనుకబడిన కులాలకు ఏమైనా మేలు జరుగుతుందా అని అనుమానించవలసి వస్తున్నది. ప్రస్తుతం జరుపుతున్న కులగణనను దాని తార్కిక ముగింపుకు తీసుకుపోవడం, అంటే ఆ గణాంకాల మీద ఆధారపడిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రకటించడం ఈ ప్రభుత్వం చేస్తుందా? అలా చేసే చిత్తశుద్ధి ఉందా? లేక ఒక కుల సమూహాన్నో, కొన్ని కుల సమూహాలనో ఆకర్షించడానికి, భ్రమల్లో ముంచడానికి ఒక ఎత్తుగడగా మాత్రమే ఈ ఆర్భాట ప్రయత్నం చేస్తున్నారా? ఈ అనుమానాలకు కారణాలున్నాయి.
కులగణన విషయంలో కాంగ్రెస్ చరిత్ర చూస్తే దాదాపు పది సంవత్సరాల కింద సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) మిశ్రమ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన ప్రయత్నాలు ప్రారంభించింది. సామాజిక-ఆర్థిక-విద్యా జనగణన అనే పేరుతో ఈ ప్రయత్నాన్ని 2013-18 కర్ణాటక వెనుకబడిన వర్గాల కమిషన్ నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇంటింటి సర్వే చేసిన కమిషన్ ఆ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనే లేదు. ఆ తర్వాత అధికారానికి వచ్చిన జెడి (ఎస్) ముఖ్యమంత్రి కుమారస్వామి కమిషన్ నివేదికను స్వీకరించడానికి నిరాకరించారు. తర్వాత ఎన్నికల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా నివేదికను పట్టించుకోలేదు.
మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సిద్దరామయ్యే ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి పాత కమిషన్ పదవీ కాలం ముగిసిపోయింది. కొత్త కమిషన్ వేసి మూడు నెలల్లో నివేదిక ఇమ్మని కొత్త ప్రభుత్వం ఆదేశించింది. అలా ప్రభుత్వానికి నివేదిక అంది ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచాయి గాని నివేదికను బైటపెట్టలేదు. ఆ నివేదికను బైటపెట్టవద్దని, దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ప్రతిపక్ష బిజెపి, జెడి (ఎస్) లతో పాటు అధికార పక్షానికే చెందిన కొన్ని కులాల నాయకులు అడ్డుపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరొక రాష్ట్రంలో కులగణన జరపడానికి ఎంతో ఉత్సాహపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం పది సంవత్సరాలుగా, కనీసం పది నెలలుగా దుమ్ము పేరుకుంటున్న కర్ణాటక జనగణన నివేదిక గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. అసలు భూ కుంభకోణాలలో ఇరుక్కున్న ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికే కులగణన నివేదిక విడుదల గురించి మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతకాలంగా కులగణన విషయంలో జరుగుతున్న ప్రహసనమంతా తెలంగాణలో కూడా పునరావృతం కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. వెనుకబడిన కులాలను ఆకర్షించడానికి ఈ ఆర్భాటమంతా చేసి కర్ణాటకలో లాగానే పది సంవత్సరాల పాటు కులగణన నివేదికను తొక్కిపట్టినా ఆశ్చర్యం లేదు.
తెలంగాణకే వస్తే, రాష్ట్రం ఏర్పడిన రెండు నెలల్లోనే, 2014 ఆగస్ట్ 19న అప్పటికి కె చంద్రశేఖర రావు ప్రభుత్వం, ప్రస్తుత కులగణన కన్నా ఎక్కువ ఆర్భాటంతో సమగ్ర కుటుంబ సర్వే అనే ప్రహసనాన్ని ఒకే ఒక్క రోజులో జరిపింది. నాలుగు లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 98 ప్రశ్నల ప్రశ్నపత్రంతో రాష్ట్ర జనాభాలో ప్రతి ఒక్కరి సమాచారాన్నీ సేకరించారు. అత్యంత నిశితమైన సామాజిక ఆర్థిక సర్వేగా ప్రగల్భాలు పలికిన ఆ సర్వే కులాన్ని కూడా తన పరిశీలనాంశాలలో చేర్చింది. కాని తర్వాత ఐదు సంవత్సరాలలోనూ, మళ్లీ గెలిచాక మరొక ఐదు సంవత్సరాలలోనూ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఊసెత్తిన వారే లేకపోయారు. ఆ గణాంకాలు ఏమయ్యాయో, అప్పటి ప్రభుత్వం ఆ గణాంకాలను బైటపెట్టడానికి, వాటి ఆధారంగా ఏవైనా చర్యలు తీసుకోవడానికి ఎందుకు సంకోచించిందో ఎవరికీ తెలియదు.
మరొక ఉదాహరణ చూస్తే, నితిశ్ కుమార్ నాయకత్వంలో బిహార్ ప్రభుత్వం కులగణన జరిపి గత అక్టోబర్ 2న నివేదిక బైటపెట్టింది. అది ఒక ముందడుగే అయినప్పటికీ, ఆ నివేదిక ఆధారంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు వివాదంలో చిక్కుకుని ఉన్నాయి. భాజపాతో పొత్తు లేకముందు కులగణన జరిపిన నితీశ్ ఇప్పుడు పొత్తు కుదిరినాక కులగణన మీద ఆసక్తి కోల్పోయాడు. ఆ కులగణన నివేదిక మొత్తం రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనాభా 63 శాతం వంటి కొన్ని ముఖ్యమైన అంశాలు లేవదీసినప్పటికీ, అందులో కూడా పొరపాట్లు, హస్తలాఘవాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 209 కులాలలో ఏ ఒక్క కులపు జనాభా ఐదు శాతానికి మించి లేకపోగా, గ్వాలా, అహిర్, గోరా, ఘాసీ, మెహర్, సదగోప్, లక్ష్మినారాయణ్ గోలా అనే ఏడు కులాలను యాదవ్ కులంలో కలిపేసి, ఒక్క యాదవ్ కులం జనాభా మాత్రమే రెండు అంకెల కన్న ఎక్కువ ఉన్నట్టుగా చూపారు. తెలంగాణలో ప్రస్తుత జనగణనలో కూడా ఇటువంటి జిమ్మిక్కులు, ఆశ్రిత పక్షపాతాలు జరగబోవనే హామీ ఏమీ లేదు.
తెలంగాణకే వస్తే, రాష్ట్రం ఏర్పడిన రెండు నెలల్లోనే, 2014 ఆగస్ట్ 19న అప్పటికి కె చంద్రశేఖర రావు ప్రభుత్వం, ప్రస్తుత కులగణన కన్నా ఎక్కువ ఆర్భాటంతో సమగ్ర కుటుంబ సర్వే అనే ప్రహసనాన్ని ఒకే ఒక్క రోజులో జరిపింది. నాలుగు లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 98 ప్రశ్నల ప్రశ్నపత్రంతో రాష్ట్ర జనాభాలో ప్రతి ఒక్కరి సమాచారాన్నీ సేకరించారు. అత్యంత నిశితమైన సామాజిక ఆర్థిక సర్వేగా ప్రగల్భాలు పలికిన ఆ సర్వే కులాన్ని కూడా తన పరిశీలనాంశాలలో చేర్చింది. కాని తర్వాత ఐదు సంవత్సరాలలోనూ, మళ్లీ గెలిచాక మరొక ఐదు సంవత్సరాలలోనూ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఊసెత్తిన వారే లేకపోయారు. ఆ గణాంకాలు ఏమయ్యాయో, అప్పటి ప్రభుత్వం ఆ గణాంకాలను బైటపెట్టడానికి, వాటి ఆధారంగా ఏవైనా చర్యలు తీసుకోవడానికి ఎందుకు సంకోచించిందో ఎవరికీ తెలియదు. ప్రస్తుత పటాటోపం చూస్తుంటే ఇది పది సంవత్సరాల తర్వాత మళ్లీ అటువంటి బురిడీనే అనిపిస్తున్నది.