ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వొస్తేనే సరిపడంతా ఫోర్స్ లేదని, సిబ్బంది లేదని 8 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అలాంటప్పుడు 29 రాష్ట్రాల అసెంబ్లీలకు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 543 లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు.. ఇది సాధ్యమయ్యే పనేనా.! లోక్ సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తూ మరో 100 రోజుల కాలవ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని బిజెపి చెబుతోంది. పైన పేర్కొన్న ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి సాధ్యపడే పనేనా.! రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జమిలిలో భాగమైతాయా..! 6 రాష్ట్రాలలో (ఎగువ సభ) విధాన మండలి ఉంది. విధాన మండలికి 5 రకాలుగా (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ , పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ , శాసన సభ సభ్యులచే ఎన్నుకోబడే ఎమ్మెల్సీలు , గవర్నర్ చేత నామినేట్ చేయబడే ఎమ్మెల్సీలు ) సభ్యుల ను ఎన్నుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జమిలీ ద్వారా ఏలా సాధ్యం.?
మూడవసారి అధికారంలోకి వొచ్చిన బిజెపి మళ్లీ నాలుగోసారి అధికారంలోకి రావడానికి అనేక రకాల కుట్రల మధ్య కొత్త పుంతలను తొక్కుతున్నది. ప్రాచీన కాలంలో ఒక రాజ్యానికి రాజు ఉన్నట్లుగానే భారతదేశం అంతటా బిజెపి రాజకీయంగా అధికారాన్ని కేంద్రీకృతం చేసే కుట్రలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయి కూటమితో కలిసి గెలిచిన బిజెపి తగిలిన ఎదురు దెబ్బల నుంచి గుణపాఠం నేర్చుకోకుండా 2029 ఎన్నికల్లో జరగబోయే నష్టాన్ని పసిగట్టి జమిలీ ఎన్నికలకు తెరలేపింది. చేసిన తప్పుడు విధానాలను సవరించుకోకుండా ఎన్నికల ఫలితాలు ఏజెండాగా వక్రమార్గాన్ని అనుసరించే పనిలో భాగంగా వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనే ట్యాగ్ లైన్ తో బయలుదేరడానికి బాజాప్తా సిద్దపడింది. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఇటీవలే కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మాజీ రాష్ట్రపతి అధ్వర్యంలో కమిటి వేయడమనేది భారతదేశ రాజకీయ చరిత్రలో మొదటగా వింటున్నాం. ఈ కమిటీ 21,000 మంది ప్రజల అభిప్రాయాలను 190 రోజుల్లో సేకరించి 18,600 పేజీల నివేదిక తయారు చేసిందంటే ఈ నివేదిక లో ఎంత శాస్త్రీయత ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా 47 పార్టీ ల అభిప్రాయం కూడా తీసుకున్నారట. ఇంతవరకు ఆ నివేదికను బహిర్గతం చేయలేదు.
రాజ్యంగం ఏమి చెపుతుంది.?
రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా రాజ్యాంగం విధించిన నియమ నిబంధనలకు లోబడి ఏ ఆర్టికల్ నైనా సవరించుకునే అధికారం ఈ దేశ సర్వోన్నత శాసన వ్యవస్థ అయిన పార్లమెంటుకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని.. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్రాన్నీ .. అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని.. వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకునే దిశగా మా రాజ్యాంగాన్ని మాకు మేము ఆమోదించుకుంటున్నామని రాజ్యాంగ పీఠిక స్పష్టం చేసింది.
రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదు.. దాని ఆత్మ ఎల్లప్పుడూ యుగ స్ఫూర్తి అని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగంలో ఒకటవ నిబంధన భారత దేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్ ‘ గా పేర్కొన్నది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు బలంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. సాధారణ సమయాలలో భారతదేశం ‘సమాఖ్య రాజ్యాంగం’గా కొనసాగుతుందని డాక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. బహు పార్టీ విధానం అమలులో ఉన్న భారతదేశంలో కేంద్రంలో ఒక పార్టీ లేక సంకీర్ణ పార్టీలు, రాష్ట్రాలలో భిన్నమైన పార్టీలు అధికారంలో కొనసాగే అవకాశం రాజ్యాంగం కల్పించింది. కానీ జమిలి ఎన్నికల ద్వారా బిజెపి సమాఖ్య విధానాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నది. సమకాలీన భారతదేశంలో ప్రజలలో ప్రాంతీయ ఆకాంక్షలు, సామాజిక ఆకాంక్షలు పెరిగాయి. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరిగింది. ప్రజలకు జాతీయ, రాష్ట్ర స్థాయి, స్థానిక ఆకాంక్షలు భిన్నంగా ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలు ఒక రకంగా ఉంటే, శాసనసభ ఎన్నికలలో మరో విధంగా ఉండవొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిత్వాలు ప్రధాన పాత్ర వహిస్తాయి.
ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్నికి ప్రమాదం
జమిలీ ఎన్నికల ద్వారా జాతీయ పార్టీల మధ్యనే పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. జాతీయ ఎజెండాగా ఎన్నికల జరుగుతున్నప్పుడు ప్రాంతీయ ఎజెండా పెడదోవపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అనాదిగా ప్రాంతీయ పార్టీలను గౌరవిస్తూ వాటి ద్వారా అభివృద్ధి సాధ్యమని ప్రజలు ఎన్నికల ఫలితాలు నిరూపిస్తూ వొస్తున్నారు. ఇప్పటికే భారత దేశంలో మూడుసార్లు అధికారంలోకి వొచ్చిన బిజెపి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చులు పెడుతూ ఈడీలను సిబిఐలను ముందు పెట్టి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ ఇప్పటికే ఆరు, ఏడు రాష్ట్రాలలో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా అక్రమ మార్గంలో బిజెపి అధికారాన్ని చేపట్టింది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందో, ప్రాంతీయ ఉద్యమాలు ఎక్కడైతే బలంగా బయలుదేరుతున్నాయో అక్కడ పాగా వేయడానికి బీజేపీ జమిలీ ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలను టార్గెట్ గా చేసుకొని నిరంకుశ విధానాలను రూపొందిస్తూ ముందుకు వొస్తున్నట్లు స్పష్ఠంగా కనపడుతుంది.
ఒకేసారి ఎన్నికలు అసంభవం
ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వొస్తేనే సరిపడంతా ఫోర్స్ లేదని, సిబ్బంది లేదని 8 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అలాంటప్పుడు 29 రాష్ట్రాల అసెంబ్లీలకు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 543 లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు.. ఇది సాధ్యమయ్యే పనేనా.! లోక్ సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తూ మరో 100 రోజుల కాలవ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని బిజెపి చెబుతోంది. పైన పేర్కొన్న ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి సాధ్యపడే పనేనా.! రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జమిలిలో భాగమైతాయా..! 6 రాష్ట్రాలలో (ఎగువ సభ) విధాన మండలి ఉంది. విధాన మండలికి 5 రకాలుగా (స్థానిక సంస్థల ఎమ్మెల్సీ , పట్టభద్రుల ఎమ్మెల్సీ , ఉపాధ్యాయ ఎమ్మెల్సీ , శాసన సభ సభ్యులచే ఎన్నుకోబడే ఎమ్మెల్సీలు , గవర్నర్ చేత నామినేట్ చేయబడే ఎమ్మెల్సీలు ) సభ్యుల ను ఎన్నుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జమిలీ ద్వారా ఏలా సాధ్యం.? భారత రాజ్యాంగ పరిభాషలో ఎలక్షన్ కమిషన్ వాడుక భాషలో ఈ దేశంలో ఎన్నికలను మూడు రకాలుగా ఉంటాయి.
1.సాధారణ ఎన్నికలు
2.మధ్యంతర ఎన్నికలు
3.ఉప ఎన్నికలు.
బిజెపి చెపుతున్న జమిలీ ఎన్నికలు ఇందులో ఏ కోవకు చెందినవి.? ఒకవేళ సాధారణ ఎన్నికలే జమిలీ ఎన్నికలైతే రాబోయే మధ్యంతర ఎన్నికలకు, ఉప ఎన్నికలకు పరిష్కార మార్గాలు ఏమిటి.? ఉదాహరణకు ఒక పౌరుడు ఏవైనా రెండు పార్లమెంటు స్థానాలకు,లేదా రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిస్తే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేక ఏ శాసన సభ్యుడు ఐనా ఆకాల మరణం చెందితే ఆ సందర్భంలో ఖాలీ అయిన స్థానానికి ఉప ఎన్నికల నిర్వహిస్తరా లేదా.! ఒకవేళ నిర్వహిస్తే జమిలీ ఎన్నికల లక్ష్యం ఎలా నెరవేరినట్లు.? నిర్వహించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం కాదా.! ఇది ఇలా ఉంటే దేశంలోను, కొన్ని రాష్ట్రాలలో హంగ్ ఏర్పడుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాలిసిన స్పష్ఠమైన మెజార్జీ రాదు, అలాంటప్పుడు మళ్లీ ఎన్నికలకు పోతే జమిలీ లక్ష్యం ఎటుపోయినట్లు.? కొన్నిసార్లు స్వపక్షంలోనే విపక్షం తయారై ప్రభుత్వాలు మధ్యలో కూలిపోతాయి. అప్పుడు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలా.! వొద్దా.! ఎన్నికలు నిర్వహించకుండా ఒక వేళ రాష్ట్రపతి పాలన పెట్టాలనే ఉద్దేశ్యం మీకు అంటే అది సమ్మతి ఐన విషయమేనా.!
ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకం,
ఎన్నికలు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. ప్రజలు తమకు నచ్చని పాలకులని, తమకు నచ్చని ప్రభుత్వాలని పోరాటాల ద్వారా ఎప్పుడైనా గద్దె దించే అధికారం ప్రజలకు ఉంటుంది. మధ్య మధ్యలో ప్రభుత్వాలు కూలిపోతున్నప్పుడు ఆ స్థానంలో నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఎన్నికల వ్యవస్థ ద్వారా ప్రజలకే ఉంటుంది. అదే వాస్తవమైన ప్రజాస్వామ్యం. ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను భారత పౌరులకు భారత రాజ్యాంగం ప్రసాదించింది. కానీ పాలకులు తమకు నచ్చినట్లుగా మంద బలంతో బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టరూపకంగా తెస్తామంటే అది ప్రజా వ్యతిరేకమైన చట్టంగానే భావించాల్సి వస్తుంది. ఇటీవల కేంద్ర సమాచార శాఖా మంత్రి అశ్వినివైష్ణవ్ స్పందిస్తూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు 80% ప్రజలు అనుకూలంగా ఉన్నారని చెప్పడం వారి అవివేకమైన చర్య.
ఏ కమిటీ ప్రజల మధ్యకు పోయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజల అభిప్రాయాలను సేకరించిందో స్పష్టం చేయాలి కదా..! తమకు నచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం ప్రజల మనోభావాలను తిరస్కరించడం కాదా.! ప్రజలకున్న ఏకైక ప్రజాస్వామిక సాధనం ఎన్నికలు మాత్రమే. రాజ్యాంగ ప్రవేశికలో ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆలోచనలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, భావ ప్రకటనను గౌరవిస్తూ రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాలు విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కానీ నేడు బిజెపి రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏకీకృత విధానాల వైపు మొగ్గుచూపుతుంది. ఇలాంటి నిరంకుశ విధానాలపై న్యాయవ్యవస్థ నిబద్దతతో సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రాజ్యాంగ మౌలిక స్ఫూ ర్తి దెబ్బతింటుంది. సమాఖ్య వ్యవస్థ సైతం నిర్వీర్యం అవుతుంది. ప్రాంతీయ పార్టీలు, బుద్ధి జీవులు, ప్రజాస్వామిక వాదులు బిజెపి ఏకీకృత నిర్ణయాలను ప్రజల ముందు పెడుతూ చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192