హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : జన్వాడ్ ఫామ్ కేసులో కీలక నిందితుడైన రాజ్ పాకాల నివాసం ఓరియన్ విల్లాలో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్ పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్ పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదిలావుంటే జన్వాడ ఫామ్ హౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఫామ్ హౌస్‌లో పార్టీకి హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణిని పోలీసులు విచారించారు. మరోవైపు.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి పోలీసుల దర్యాప్తుకు సహకరించ లేదు.
ఆదివారం విచారణకు హాజరైన విజయ్ మద్దూరి.. సోమవారం పోలీసుల దర్యాప్తుకు డుమ్మా కొట్టాడు. జన్వాడ ఫామ్ హౌస్‌లో రైడ్ సమయంలో తన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్‌ను విజయ్ మద్దూరి తమకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన మొబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతోనే విజయ మద్దూరి వేరే మహిళ ఫోన్ అందజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడుల సమయంలో విజయ్ మద్దూరి సతీమణి ఆయన పక్కనే ఉండగా.. తన సతీమణి నెంబర్ కాకుండా థర్డ్ పర్సన్ నెంబర్‌ను ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
పార్టీలో డబ్బులు కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట ఆడినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తులో పేకాట ఆడినట్లు తేలితే మరో కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల సమయంలో పోలీసుల కంటపడకుండా కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలా పరార్ అయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజ్ పాకాలా, విజయ మద్దూరి నోరు మెదిపితే కేసు దర్యాప్తు ముందుకు సాగుతోందంటున్నారు.