- అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం
- జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి శషబిషలు లేవు.
- తాము అధికారంలోకి వొచ్చాకే సచివాలయంలోకి జర్నలిస్టులకు అనుమతి
- అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డుల, ఇళ్ల పట్టాలు హెల్త్ కార్డులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కి భూమి స్వాధీన పత్రాల అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. నిజమైన జర్నలిస్టులకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మాది.
జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ఎలాంటి శశబిషలు లేవు. జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం.. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈ రోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది.
\
నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం. తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు. మేం మీలో ఒకరమే… మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నా.. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం.
ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించాల్సిన వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించినప్పుడే సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. మా ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వృత్తిపరమైన గౌరవం మనకు మనమే పెంచుకోవాలి” ”గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. మా ప్రభుత్వం వొచ్చాక స్పీకర్‌కు నేనే అసెంబ్లీ లోపలికి జర్నలిస్టులను అనుమతించాలని కోరాను. ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనితోనే ఇబ్బంది కలుగుతోంది. గతంలో సచివాలయానికి వెళ్లేందుకు మాకే అనుమతి లేదు. కొంత మందికి పాస్‌లు ఇచ్చి లోపలికి రప్పించి ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపైనే ఉంది.
అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు, ఇళ్ల పట్టా, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వ్యవస్థల మీద నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో 73 మంది నిజాన్ని చూడక ముందే కన్ను మూశారు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తాం” అని రేవంత్‌రెడ్డి అన్నారు. జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాలను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రవీంద్రభారతిలో అందజేసిన జరిగిన కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్,జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.