కాకతీయ కలగూర గంప – 5
కోఠీ ఒక పెద్ద వ్యాపార కూడలి. పెండ్లి చీరలు, ధోతులూ, ఇతర బట్టలూ కొనాలంటే నీలకంఠం నరసింహులు బట్టల దుకాణం వెరీ పాపులర్. సుల్తాన్ బజారు రోడ్డుపై రెడీ మేడ్ బట్టల షాపులు వుండేవి. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ సంబంధిత సామాగ్రికి బ్యాంక్ స్ట్రీట్ లోని సందుల్లో షాపులు ఫేమస్. ఇక మీకు కావలసిన అన్ని రకాల పుస్తకాలు ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నికల్, మెడిసిన్ మరియు ఇతర విద్యా సంబంధిత కొత్త పుస్తకాలకు బుక్ షాప్స్, సెకండ్ హేండ్ పుస్తకాలకై ఫుట్ పాత్ ల మీద పరుచుకున్న పాత పుష్తకాల షాపులూ ఎప్పుడూ రద్దీగా వుండేవి. ఇక మీరక్కడ ఒక అర దినం గడిపారంటే మీ రూహించని అరుదైన పుస్తకం అతి చౌకగా మీ చేతికి చేరుతుంది. ఇక పుత్లీ బౌలి చౌరాస్తా నుండి జాం బాగ్ పోయే మార్గంలో వున్న నవ్ రంగ్, అశోక్, విక్రాంతి సినిమా టాకీసులు ప్రజల చలన చిత్ర వీక్షణా కాంక్షకు గుర్తుగా వుండేవి. ఇక అప్పటి మంచి లాడ్జ్ లలో లక్డీకాపూల్ ద్వారక హోటల్, వెంకటేశ్వర లాడ్జ్, నాంపల్లి రాయల్ హోటల్, ఆబిడ్స్ బృందావన్ హోటల్, ప్యాలస్ హోటల్.
ఇక అన్నిటికంటే ప్రత్యేకం రిట్జ్ హోటల్. ఇక ఆబిడ్స్ -నాంపల్లి స్టేషన్ రోడ్ పై, సికింద్రాబాద్ స్టేషన్ ముందు గల అనేక సాధారణ హోటల్స్. కొన్ని విశేషాలు: 1) మన దేశంలో బాంబే తో బాటు డబల్ డెక్కర్ బస్సులు గల సిటీ హైదరాబాద్ మాత్రమే! 2) 1971 లో మొట్ట మొదటిసారిగా హైదరాబాదు లో సూపర్ మార్కెట్ వచ్చింది. ఇది ప్రభుత్వ సూపర్ మార్కెట్. నాంపల్లి స్టేషన్ రోడ్డు పై ఒక 5 అంతస్తుల భవనం లో ఏర్పాటు చేయ బడిరది. ఐతే అప్పటికి హైదరాబాదు వాసులకు ఇంకా ‘వాల్ మార్ట్’ కల్చర్ రాలేదు కాబట్టి ఆ ప్లాన్ బెడిసి కొట్టి ఒక ఏడాది లోనే అది మూత పడిరది. 60 ఏండ్ల క్రితం ఫెయిల్ ఐన ఆ సూపర్ మార్కెట్ కల్చర్ నేడు నగర మూల మూలనా కళ కళ! 3) ఇకపోతే, ఆ రోజుల్లో చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్. బిర్లా మందిర్ లేదు. చిలుకూరు గుడి అంటే ఎవరికీ తెలియదు. అమెరికా వీసా అంటే తెలియని రోజు లాయె! శనివారం వచ్చిందంటే సందులో వున్న గుడి ముందు నుంచి మెయిన్ రోడ్డు దాకా పెద్ద క్యూ. 4) ఆ రోజుల్లో ద్రాక్ష తోటల పెంపకం ఒక స్టేటస్ గుర్తు. కాజీపేట రైల్వే మార్గంలో దాదాపు బీబీనగర్ దాకా రెండు వైపులా ద్రాక్ష తోటలే. 5) 1969 లో అప్పుడప్పుడే వెస్పా, బజాజ్ స్కూటర్లు మార్కెట్ లోకి రావడం మొదలైంది. 500 రూపాయల %ణణ% పంపించి బజాజ్ స్కూటర్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రెండేండ్ల తర్వాత మీ ఇంటిముందుకు! 6) ఆటోలు 1971 చివర్లో హైదరాబాద్ రోడ్లు ఎక్కాయి. అంతకు ముందు రిక్షాలు, ట్యాక్సీలే రవాణా సాధనాలు. టాంగాలు అప్పటికే అంతరించాయి నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ ల ముందు, ఆబిడ్స్, కోటీ, నారాయణ గూడా మొదలగు ముఖ్య కూడళ్లలో నలుపు, పసుపు రంగుల అంబాసిడర్, ఫియట్ ట్యాక్సీ లు వుండేవి. ఫోన్ చేస్తే ఇంటికి కూడా వచ్చేవి. మీటర్ చార్జీలు వసూలు చేసేవారు.
చిక్కడపల్లి నుండి నాంపల్లి స్టేషన్ కు ఆటో చార్జీ 75 పైసాలు. చార్మినార్ చౌరస్తా (క్రాస్ రోడ్డు) నుండి మాసాబ్ ట్యాంకుకు కు ఆర్ టీసీ బస్సు చార్జీ 7 పైసలు. 7) 1968- 75 మధ్య కొత్త సినిమా థియేటర్లు (వెంకటేశ్వర, శ్రీనివాస్, సుదర్శన్, శ్యాం…. ) కట్టడం లేదా పాత థియేటర్ల ఆధునీకరణ (సంగం, ప్రభాత్….) 8) 1978 దాకా ఇందిరా పార్కు లేదు. ఇందిరా పార్కు రోడ్డు లేదు. చార్మినార్ చౌరస్తా నుండి వీఎస్టీ దాకానే రోడ్డు. తర్వాత కాలువ వుండేది. శంకర్ మఠ్ రోడ్డు కు కలిపే మార్గం లేదు. హైదరాబాద్ వైపు నుండి ఉస్మానియా యూనివర్సిటీ పోవాలంటే బర్కత్ పుర, నల్లకుంట, శంకర్ మఠ్ మీదుగా పోవాల్సిందే. 9) ఇక ఆకాశవాణి ప్రసారాలు అద్భుతం. కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క, రేడియో అన్నయ్య, ఏకాంబరం మాటల వినోదం ఆహ్లాదకరం . ఇక లలిత సంగీత గీతాలు సుమధురాలు. సీరియల్ నాటకాలు మనో రంజకాలు. ప్రతి శనివారం రాత్రి 9.30 కు దిల్లీ కేంద్రంగా ప్రసారమయ్యే జాతీయ సంగీత కార్యక్రమం దేశ ప్రజలకు సంగీత దిగ్గజాలను పరిచయం చేసేది.
క్రికెట్ మ్యాచ్ ల కామెంట్రీ , దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే విన్యాసాల కామెంట్రీ లతో బాటు రేడియో సిలోన్ ద్వారా ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ‘బినాకా గీత్ మాలా’ జనాల ఆకర్షితాలే! 10) ఇక భారత క్రికెట్ టీంలో హైదరాబాద్ కు పెద్ద పీట. అప్పటి భారత కేప్టన్ పటౌడి హైదరాబాద్ వాడే! రాంజీ, మెయినుద్దౌలా, దులీప్ ట్రోఫీ మ్యాచ్ ల్లో హైదరాబాద్ టీం లో ఆడే వాడు. ఆబిద్ ఆలి మరో గొప్ప బాట్స్ మన్ మరియు బౌలర్. ఇక హైదరాబాద్ కేప్టన్ జై సింహ. ఆ రోజుల్లో అత్యంత జనాకర్షణ కలిగిన క్రికెటర్. మంచి స్ట్తైలిస్ట్ క్రికెటర్. ఆప్పుడే క్రికెట్ నేర్చుకుంటున్న గవాస్కర్ కు ఆరాధ్య క్రికెటర్. ఐతే స్టైల్ లో చూపించిన ‘నవాబీ దర్జా’ ఆటలో చూపక పోయేసరికి త్వరలోనే కనుమరుగు..తర్వాత క్రమంలో అజహరుద్దీన్ హైదరాబాద్ పేరు నిలబెట్టాడు . భారత క్రికెట్ కేప్టన్ గా రాణించాడు. (మరి కొన్ని హైదరాబాద్ ముచ్చట్లు తదుపరి వారంలో…)
-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
పాములపర్తి నిరంజన్ రావు
-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
పాములపర్తి నిరంజన్ రావు