ఒక ప్లేట్ ఇడ్లీ- మూడు సాసర్ల సాంబార్

హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని లోంచి లోపలకు పోతే ముందుగా కొద్దిగా ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా కొంచం ఎత్తులో వుండే భవనమే కోహినూర్ హోటల్. నాలుగైదు మెట్లెక్కితే వరండా, ఆ వెనకాల పెద్ద హాలూ. ఇందులో లభ్యమయ్యేవి బిస్కట్లూ, బన్ మస్కా, సమోసాలు. బిర్యానీ, కప్పులో చాయ్ లేదా పౌనా. ఒక చాయ్ కప్పు తాగి అర్ధ గంట గప్పాలతో కాలాన్ని అత్యుత్సాహంగా గడిపే కాలేజీ విద్యార్థులకు కాలక్షేప కేంద్రం. అలనాటి హనుమ కొండ నివాస విద్యార్థులకు ఇతర కాలక్షేప రాయుళ్ళకూ ఇది అనుభవమే… అందుకే హనుమకొండ వాసులకు కోహినూర్ హోటల్ ఒక వారసత్వ సూచిక! ప్రస్తుతం ఈ మూడూ లేవు.

ఇక శీర్షిక విషయాని కొద్దాం. నేనొక సారి 2001 లో పాలీటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పని సందర్భంగా మా టెక్నికల్ బోర్డ్ లో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నప్పుడు, ఒక నాటి సాయంత్రం అప్పటి సెక్రెటరీ గారితో మాట్లాడుతున్న సందర్భంలో వరంగల్ ప్రస్తావన వచ్చింది. ఆయన రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ, ఖాజీపేట లో 1960 ప్రాంతాల్లో ఇంజినీరింగ్ (BE) చదివానని చెబుతూ అప్పుడప్పుడూ సినిమాను చూడటానికి ఖాజీపేట్ నుండి వరంగల్ వచ్చే వాళ్ళమని, అదేదో హోటల్ లో టిఫిన్ తినే వాళ్ళమని అది చాలా బాగుండేదని చెప్పారు. ఆ హోటల్ పేరు అడిగి తెలుసుకొని ‘అది ఇంకా ఉందా?’ అని అడిగారు. ఆయన అడిగిన ఆ హోటలే అలనాటి ‘రామా విలాస్’. 35 సంవత్సరాల తర్వాత కూడా ఆయన దాన్ని గుర్తుపెట్టుకోవడం అంటే ‘రామా విలాసు’ను కూడా వరంగల్ కు ఒక గుర్తింపు సూచికగా తీసుకోవడానికి మంచి ఉదాహరణ కదా? వరంగల్ చౌరాస్తా నాలుగు మూలల్లో బట్టల బజారును కలిపే రోడ్డు, జెపిఎన్ రోడ్డు కలిసే మూలలో ఒక పాత కాలపు భవనం మొదటి అంతస్తులో వున్నది రామా విలాస్. జెపిఎన్ రోడ్డు వైపునుండి సన్నని మెట్ల మార్గం మిమ్మల్ని ముందుగా చిన్న వరండాలాంటి క్యాషియర్ కౌంటర్ వైపు తీసుకు పోతుంది.

పక్కనే వున్న ద్వారం గుండా పెద్ద హాలు, దాన్ని దాటుకుని మరొక తలుపు ద్వారా చిన్న బాల్కనీ లాటి మరొక గదీ వుంటాయి. హాల్ లో మరియు ఈ గదిలో అమర్చిన టేబుల్లు కుర్చీలు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటాయి . సాంబార్ గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటున్న వరంగల్ జనానికి రామా విలాస్ లో ఇడ్లీ, వడ, దోశతో బాటు ఇచ్చే అమృతం లాంటి ఆ రుచికర సాంబారు ను వారు వదులుతారా? కాబట్టి ప్లేట్ (రెండు ఇడ్లీలు) తో బాటు చిన్న సాసర్లో ఇచ్చే సాంబారు వారికి సరి పోతుందా? మరో రెండుసార్లో/ మూడు సార్లో ఆ సాసరును సాంబారుతో ఆ సర్వర్ నింపవలసిందే, దాన్ని ఈ ఇడ్లీ సాంబార్ ప్రియుడు ఖాలీ చేయాల్సిందే! ఇక వడ ఐనా, వుల్లిపాయ దోశ ఐనా (వాటితో బాటు) మూడు సాసర్ల సాంబారు కావల్సిందే… . సాయంత్రం 4 నుండి 9 గంటల దాకా విపరీతమైన రద్దీ. బట్టల బజరులోని వస్త్రాలయాలు, జెపిఎన్ రోడ్ పై గల షాపులు మూసి వేశాక అందులో పనిచేసే వాళ్ళు, యజమానులు ఇక్కడే కాసేపు తిష్ట. ఇక్కడ కాఫీ రుచి గూడా చాలా బాగుండేది. అన్నట్టు ఆ రోజుల్లో ప్లేట్ ఇడ్లీ/వడ ధర 10 నయా పైసలు. దోశ ఇరవై పైసలు. టీ 10 పైసలు; కాఫీ 12 పైసలు. రామా విలాసు కు పోటీగా ఎన్ని హోటల్లు ఆ ప్రాంతంలో వచ్చినా రామా విలాసుకున్న ప్రాముఖ్యత తగ్గ లేదు. ఆ రోజుల్లో అది వరంగల్ ప్రజలకు నంబర్ వన్ శాఖాహార ఉపాహార శాల. అందుకే వరంగల్ కు వున్న పర్యాయ పదాల్లో రామా విలాస్ ఒకటి.

మొట్ట మొదటి ఆంగ్ల చిత్ర ప్రదర్శన శాల – అలంకార్ టాకీస్
1966 కు ముందు వరంగల్ లో 5 (శ్రీనివాస్, లక్ష్మి, రాజ రాజేశ్వరి. రామా, సరోజ్) సినిమా టాకీసులు , హనుమకొండలో రెండు (విజయా; జీ ఆర్) టాకీసులు వుండేవి. వీటిలో టికట్ బుకింగ్ కౌంటర్లు ఒక క్రమ పద్ధతి లో లేకుండా ‘కుమ్ములాటలు, తోసి వేతలు… బలవంతుడిదే ముందు టికట్’ తరహాలో వుండేవి. టికెట్ల పై సీట్ నంబర్ వుండేది కాదు. చిన్నప్పుడు ముందు వరస బెంచీల మీద కూర్చొని విఠలాచార్య తీసిన ‘అగ్గి పిడుగు’ లాంటి సినిమా చూడటం – అదో అనుభవం… 1965-66 ప్రాంతాల్లో రెండు కొత్త థియేటర్లు కట్టడం మొదలైంది. ఒకటి మట్టెవాడ పోలీసు స్టేషన్ ప్రక్క సందులో ‘దుర్గా కళా మందిర్”; మరొకటి ములుగు రోడ్డు ప్రక్కన భద్రకాళి చెరువు నుండి వచ్చే కాలువ పై కట్టిన బ్రిడ్జ్ దాటాక ఎడమవైపు! దీని పేరు ‘అలంకార్ టాకీస్’. వీటిలో ‘అలంకార్’ ముందుగా 1966 లో ఓపెన్ అయింది. మొదటి చిత్రం ఇంగ్లీష్ మూవీ ‘Arabesque’. తర్వాత అన్నీ ఇంగీష్ సినిమాలే… దగ్గరనే వున్న కాకతీయ మెడికల్ కాలేజీ, దూరంగా వున్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, దానికి ఇవతలనే వున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులకు, స్టాఫ్ కు (ముఖ్యంగా తెలుగువారు కాని వాళ్ళకు) ఇది ఒక పండగే. ఇంకా పాలీటెక్నిక్ టీచర్లకు, విద్యార్థులకు, డాక్టర్లకు, లాయర్లకు ఇతర విద్యాధికులకు ఈ కొత్త ప్రయోగమొక వరం లాగా ఐంది. అన్నిటి కంటే ముఖ్యంగా టికెట్ మీద సీట్ నంబర్ సూచించిన మొదటి థియేటర్ వరంగల్ లో అలంకార్ టాకీస్. ఆ విధంగా అలంకార్ టాకీసు అన్నది అప్పటి రొజుల్లో ఒక ట్రెండ్ సెట్టర్. నేడు అలంకార్ టాకీసు లేదు. ఐనా ఆ సెంటర్ పేరు అలంకార్ సెంటర్.

కాలేజీ విద్యార్థుల కాలక్షేప కూడలి ‘కోహినూర్ హోటల్’
హనుమకొండ చౌరస్తా నుండి పబ్లిక్ గార్దెన్ వైపు వస్తుంటే ముందుగా మీకు కుడి వైపు గీతా భవన్ హోటల్ వస్తుంది. ఆది దాటగానే (ఇప్పటి జీవన్ లాల్ కాంప్లెక్సు కు ఎదురుగా) ఒక కాంపౌండ్ గోడకు మధ్యలో అమర్చిన ఒక ఫాటక్, దాని లోంచి లోపలకు పోతే ముందుగా కొద్దిగా ఓపెన్ స్పేస్ వుండి ఎదురుగా కొంచం ఎత్తులో వుండే భవనమే కోహినూర్ హోటల్. నాలుగైదు మెట్లెక్కితే వరండా, ఆ వెనకాల పెద్ద హాలూ. ఇందులో లభ్యమయ్యేవి బిస్కట్లూ, బన్ మస్కా, సమోసాలు. బిర్యానీ, కప్పులో చాయ్ లేదా పౌనా. ఒక చాయ్ కప్పు తాగి అర్ధ గంట గప్పాలతో కాలాన్ని అత్యుత్సాహంగా గడిపే కాలేజీ విద్యార్థులకు కాలక్షేప కేంద్రం. అలనాటి హనుమ కొండ నివాస విద్యార్థులకు ఇతర కాలక్షేప రాయుళ్ళకూ ఇది అనుభవమే… అందుకే హనుమకొండ వాసులకు కోహినూర్ హోటల్ ఒక వారసత్వ సూచిక! ప్రస్తుతం ఈ మూడూ లేవు.

-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,
పాములపర్తి నిరంజన్ రావు

4 Comments

  1. రామా విలాస్ లో కొన్ని డజన్ల సార్లో, వందల సార్లో గడిపి ఉంటాను గాని, బహుశా 1973లోనో, 1974లోనే మా అన్నయ్య (రాంగోపాల్) నన్ను మొదటిసారి అక్కడికి తీసుకువెళ్లి బాసుంది తినిపించాడు. అసలు అటువంటి స్వీట్ ఉందని వినడమే, చూడడమే, తినడమే మొదటి సారి. అద్భుతం. ఆ పన్నెండు పదమూడేళ్ల కుర్రవాడి నాలుక మీది బాసుంది రుచి, యాబై ఏళ్ల తర్వాత కూడా చెరిగిపోలేదు!!

  2. అయ్యో, చెప్పడం మరిచాను. చంద్రకీర్తి గారు, నిరంజన్ రావు గారు రాసిన ఈ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. అలంకార్ లో 1972-73ల్లో చూసిన గన్స్ ఆఫ్ నవరోన్, ఏర్ పోర్ట్ నిన్న చూసినట్టే ఉన్నాయి.

  3. ముచ్చట్లు ఆసక్తికరంగా…ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి..పాములపర్తి సదాశివ రావు గారి గురించి ..కాళోజీ సోదరుల తో వారి సానిహిత్యం.. మాజీ ప్రధాని పీవీ సాబ్ తో వారి అనుబంధం ఈ తరానికి తెలిసేలా కూడా మీ శీర్షిక కొనసాగాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page