బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
శంకరపట్నం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో గత పది రోజులుగా డాక్టర్ కరివేద సదాశివరెడ్డి స్మారక జిల్లాస్థాయి ఆహ్వానిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం టోర్నీ విజేతగా నిలిచింది. రన్నరప్ జట్టుగా పెద్దపల్లి జిల్లా, తురకల మద్దికుంట గ్రామం నిలిచింది. ఆదివారం టోర్నీ ముగింపు కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నీ విజేతకు క్రికెట్ కప్ తో పాటు రూ.20వేలు, రన్నరప్ జట్టుకు రూ.10 వేలు చెక్కులు, టోర్నీ ఉత్తమ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని చింతగుట్ట గ్రామానికి చెందిన కరివేద సదాశివరెడ్డి వార్డు మెంబర్ గా, తాడికల్ ఉప సర్పంచ్ గా, సీడ్ ఆర్గనైజర్ గా ఎన్నో విధాలుగా గ్రామానికి అత్యంత సేవలు అందించారని, ఆయన గుర్తింపుగా కరీంనగర్ కి చెందిన ఆదర్శ హాస్పిటల్ డాక్టర్ కరివేద సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సీనియర్ క్రీడాకారులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సీడ్ ఆర్గనైజర్ గా ఎన్నో రకాల విత్తనాలను రైతులకు అందజేసి, వారి ఎదుగుదలకు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ఆటలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమి రేపటి విజయానికి సోపానమని, ఓటమి చెందినవారు కుంగి పోకూడదని సూచించారు. కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ బత్తిని శ్రీనివాస్ , ఎమ్ సి సి అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, నాయకులు కీసర సంపత్, దుర్గపు తిరుపతి, జనగాం శ్రీనివాస్ కర్క గోపాల్ రెడ్డి, అనంతరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బహుమతి సమర్పకులు కరివేద సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.