నేడు కాశ్మీర్‌, ‌హర్యానా ఫ‌లితాలు

  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
  • ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
జమ్మూ కశ్మీర్‌, ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో భద్రతను క‌ట్టుదిట్టం చేసింది. కేంద్రాల వ‌ద్ద‌ భారీగా బలగాలను మోహరించింది. మంగళవారం ఉదయం 8.00 గంటలకు వోట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. భద్రత చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులతోపాటు భద్రతా దళాలను మోహరించినట్లు తెలిపింది. అలాగే వోట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించింది. తొలుత 7.30 గంటలకు పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌వోట్లను లెక్కిస్తామని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలో నమోదైన వోట్ల ప్ర‌క్రియ ప్రారంభమవుతుందని సీఈసీ పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా.. సెప్టెంబర్‌ 18, ‌సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 1‌వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 60 శాతంపైగా వోటింగ్‌ ‌నమోదైంది. దాదాపు దశాబ్దం తర్వాత జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదీకూడా ఆర్టికల్‌ 370 ‌రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి.  నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ ‌వోటర్‌ ఏ ‌పార్టీకి పట్టం కడతాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎగ్జిట్‌ ‌పోల్స్‌లో మాత్రం నేషనల్‌ ‌కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి విజయావకాశాలున్నాయని స్పష్టం చేశాయి. లేకుంటే రాష్ట్రంలో హాంగ్‌ ‌ప్రభుత్వం కొలువు తీరే అవకాశముందని పేర్కొంది.
ఇక హర్యానాలో సైతం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో అంటే.. అక్టోబర్‌ 5‌న జరిగాయి. ఈ ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్‌ ‌నమోదయింది. గతంలో హర్యానాలో వరుసగా జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. అయితే ఈ సారి ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌మాత్రం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ.. అదే జరిగితే మాత్రం రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌విజయాన్ని సొంతం చేసుకుంటామని బీజేపీ అగ్రనేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి హర్యానా వోటరు ఎవరి పట్టం కట్టేది.. బీజేపీకా? లేకుంటే కాంగ్రెస్‌ ‌పార్టీకా? అనేది మంగళవారం సాయంత్రం నాటికి తెలిపోనుందన్నది సుస్పష్టం. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశముందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page