రతన్ టాటా మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం..

ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త : కేసిఆర్ సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర : భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా (Ratan Tata) అని కేసీఆర్ కొనియాడారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికత ను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ తెలిపారు. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై., నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి బిఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణ కు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం

తరాల తరబడి స్ఫూర్తి నింపిన ఓ అమూల్యమైన ‘రతనా’న్ని భారతదేశం కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత పారిశ్రామిక దిగ్గజం, సామాజికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. పరిశ్రమలతోపాటు టెక్నాలజీ, అటొమొబైల్, విద్యుదుత్పత్తి తదితర రంగాల్లో వీరి కంపెనీల విస్తరించడంతోపాటు.. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన రతన్ టాటా.. స్పృశించని భారతీయ కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. నిరంతరం సృజనాత్మకతకు, ఆధునిక విధానాలకు పెద్దపీట వేస్తూ దేశ పారిశ్రామికాభివృద్ధికి చుక్కానిలా నిలిచిన మహనీయుడు.. భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యరంగానికి ఓ ఆదర్శమూర్తి రతన్ టాటా. భారతీయ కంపెనీలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు వారు చేసిన ప్రయత్నం చిరస్మరణీయం. వారి నిరాడంబరమైన జీవితం, సమాజాభివృద్ధి దిశగా చేసిన ప్రయాణం.. భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. అలాంటి మహనీయుని అస్తమయం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అని కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page