తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. 

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు 
 హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్01:  బతుకమ్మ పండుగ సందర్భంగా , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్  తెలిపారు.
ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దుల తో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా పల్లెలు పట్టణాలు భేదం  లేకుండా మహిళలతో పిల్లా పాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రాశస్త్యాన్ని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు. మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కానుకలను అందజేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను ఆటా పాటలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్ కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page