- రహదారుల మరమ్మతులకు అత్యాధునిక యంత్రాలు
- గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసింది.
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులు, మెషినరీని ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూర్ గ్రామం వద్ద రహదారులపై గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన “ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్” , పాట్ హోల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ మిషనరీ” పనితీరును ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందనతో కలిసి మంత్రి.. మిషన్ల పనితీరును పరిశీలించారు స్వయంగా ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ మిషన్ ఎక్కిన మంత్రి.. మెషినరీ పనితీరు గురించి టెక్నిషియన్లతో చర్చించారు. 6ఎంఎం, 25ఎంఎం స్టోన్ మెటీరియల్, డస్ట్ తో కూడిన మిశ్రమం ఏ విధంగా రోడ్లపై గుంతలను పూడుస్తుందో పరిశీలించారు. రోజుకు 10-20 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చే సామర్థ్యం కలిగిన రెండు మిషన్లను ఆయన స్వయంగా పరిశీలించి మిషనరీ సామర్ధ్యం గురించి, వాటి పనితీరుగురించి టెక్నిషీయన్లను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం, మీడియాకు వివరాలను వెల్లడించారు. రోడ్లపై గుంతలను సంప్రదాయ పద్ధతుల్లో నింపడం వల్ల నెలల సమయం పడుతుందని ఈ లోపు రహదారులపై మరోచోట గుంతలు పడుతున్నాయని.. మెకనైజ్డ్ రోడ్ రిపేరింగ్ విధానంలో గుంతలను పూడిస్తే.. తక్కువ సమయంలో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించవొచ్చని తెలిపారు. అంతేకాదు, 90% కార్భన్ ఎమిషన్స్ ను తగ్గించగలిగే ఎకోఫ్రెండ్లీ పద్ధతుల వల్ల పర్యావరణానికి హాని తక్కువగా ఉండటంతో పాటు.. రద్దీగా ఉండే రహదారులపై పనులు వేగంగా చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని.. ఖచ్చితత్వంతో ప్యాచ్ వేయగలిగే మెకనైజ్డ్ సిస్టం వల్ల ప్యాచ్ వేసినట్టు కనిపించకుండా సహజంగా రోడ్డు వేసినట్టే ఉంటుందని.. దాని వల్ల వాహనాలు కుదుపులకు గురికాకుండా పూర్తిగా రోడ్డంత ఒకేసారి వేసినట్టు ఉంటుందని తెలిపారు. వీటితో పాటు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోడ్లను తక్కువ సమయంలో రిపేర్లు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతోపాటు.. ప్రజలకు గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి వొస్తాయని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇబ్బందులు
గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఇప్పటికి ప్రభుత్వానికి గుదిబండగా మారిందని రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి దోచుకొని తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసిఆర్.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో రోడ్లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పిన మంత్రి అందుకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో ఎక్కడా గుంతలనేవి లేకుండా చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఛీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.