చేసింది చెప్పుకోకనే ఓడిపోయాం..

  • చిట్టినాయుడు ఉంటేనే.. కెసిఆర్‌ ‌విలువ తెలుస్తుంది
  • స్టేషన్‌ ‌ఘనపూర్‌లో ఉప ఎన్నిక ఖాయం
  • వరంగల్‌ ‌వెస్ట్ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌

గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది.. చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్‌ ‌విలువ తెలుస్తుంది… ఆడ బిడ్డలతో పెట్టుకుంటే రేవంత్‌ ‌రెడ్డి లగ్గం పక్కా చేస్తారు అంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవనలో వరంగల్‌ ‌వెస్ట్ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ సీఎం రేవంత్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మనం సంధికాలంలో ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మనకు కొత్త. ఒక్క జిల్లా కమిటీలో మనం అనుకుంటే 8 వందల మందికి పదవులు ఇచ్చుకోవచ్చు. డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలను శాసిస్తోంది. 24 ఏళ్ల పార్టీ మనది. ఇంకా వందేళ్లు ఉండాలంటే మనం మరింత ధృడంగా తయారు కావాలి.

వొచ్చే మన ప్రభుత్వంలో వినయ్‌ ‌భాస్కర్‌ ‌మంత్రి అవుతారు. ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్‌ ‌భాస్కర్‌ ఓడిపోవటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. మనం చేసింది చెప్పుకోలేదు. కానీ వాళ్లు చేయని దానికి క్రెడిట్‌ ‌తీసుకుంటున్నారు. అసలు  సీఎం అవుతానని రేవంత్‌ ‌రెడ్డి కూడా అనుకోలేదని… ఈ విషయాన్ని ఆయన దోస్తులే తనకు చెప్పారన్నారు. లంకెబిందెలు ఉంటాయనుకున్నా అని అన్నాడని… లంకెబిందెల కోసం దొంగలు కదా వెతికేది అని కామెంట్స్ ‌చేశారు. స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌లో బరాబర్‌ ఉపఎన్నిక వ‌స్తుంద‌ని, తప్పకుండా మనమే గెలుస్తామ‌న్నారు.

చిట్టి నాయుడు, వాళ్ల అన్నదమ్ములు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, సీఎం నీ బావమరది కంపెనీకి రూ.2 కోట్లు లాభం ఉంటే రూ.1,137 కోట్ల పనులు ఎలా ఇచ్చాడ‌ని  ప్రశ్నించారు. 9 నెలలుగా రేవంత్‌ ‌రెడ్డికి రక్షణకవచంలాగా బీజేపీ ఉందని ఆరోపించారు. గుజరాత్‌ ‌మోడల్‌ ‌ఫేక్‌ అని రాహుల్‌ ‌గాంధీ అంటే గుజరాత్‌ ‌మోడల్‌ ‌బెస్ట్ అని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నారని తెలిపారు. హైడ్రా అనే హైడ్రామా వరంగల్‌లో కూడా మొదల‌వుతుంద‌ని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. చిన్న పిల్లల కళ్లముందే వాళ్ల తల్లిదండ్రులు పెట్రోల్‌ ‌పోసుకుంటే.. వేదశ్రీ అనే చిన్న పాప ఆ బాధను చెప్తుంటే మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేసిందన్నారు.

కస్తూరిబాయి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్‌తో తీసి పారవేయటం స‌రికాద‌న్నారు. సామాన్లు తీసుకుంటా అంటే కనీసం గర్భిణిలకు కూడా సమయం ఇవ్వారా? అని నిదీశారు. హైడ్రా బాధితులకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా న్యాయపరంగా అండగా నిలుస్తామ‌ని కేటీర్ భ‌రోసా ఇచ్చారు.  లక్షలు వెచ్చించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి గతేంటని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా వొచ్చిందన్నారు.  దీనికి సిఎం సమాధానం చెప్పాలన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలి ప్రజలద పడడం సబబు కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page