సమాజ సంబంధాలను ప్రతిబింబింపజేసే భావోద్వేగ రూపం కవిత్వం. మానవ సంబంధాలు అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో మానవ ప్రవృత్తులను సరిచేయడానికి కవి చేతిలో ఉన్న కవిత్వమే బలమైన మాధ్యమం. లోకంలోని చీకటి తొలగి వేకువ వెల్లివిరియాలని కోరుకుని అందుకు అక్షరాలను కవితా వాహికలుగా మలిచిన కవి నల్లగొండ రమేశ్. కూడలి చెట్టులోని కవితలు రమేశ్‌లోని నిరంతర మానవీయ తపనకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. పదవ తరగతిలోనే కలం పట్టి కవిత్వాన్ని శ్వాసగా మలచుకుని నిరంతరంగా సాగుతున్న కవిలోని అంతరంగాన్ని, సమాజంలోని పరిణామ క్రమాలనూ చూపే 47 కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. మన చెలిమి చెట్టుకు లేదు శిశిరం/ మన మమతలకు లేదు ఏ దూరం/ మనది ఆత్మీయమైన సమరం అని వసంతమే నిరంతరం అన్న ఈ సంపుటిలోని తొలి కవితలోనే స్నేహ మాధుర్యాన్ని కవి విడమర్చి వివరించారు.
చేదబావి కవితలో ఆ గ్రామం జీవధార, పెదవాగుతో చేద బావిని పోల్చి ఆ నీటి మనసును తడిమి అపురూపమైన బాల్యపు జ్ఞాపకాలను అక్షరీకరించారు. మానవ నివాసాల్ని యుద్ధ కాంక్షతో మరు భూములుగా మార్చవద్దని రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన భీకర యుద్ధాన్ని తలపోస్తూ రాసిన కవిత జగమంతా సమతా మమతలతో కూడిన విశ్వశాంతి గీతాన్ని ఆలపించాలని ఆకాంక్షించింది. దగాపడ్డ బడుగు బిడ్డ ఈ సమాజంలో ఎప్పుడూ ఒంటరేనని వేదన చెందారు. ఈ లోకంలో శిల శిల్పమై బ్రతికిపోయిందన్నారు. ఆమె శోకపు గాయాన్ని మాన్పే మందేమిటో చెప్పండని ప్రశ్నించారు. అలలతో కదిలి వెళ్లిన రాళ్ళు జ్ఞాపకాలను వదిలివెళ్ళి మళ్ళెక్కడో కొత్తగా సేద దీరుతాయని చెప్పారు. అసలైన ఆనంద తీరం మనిషికి చివరికైనా దొరుకుతుందా అని ఎంతగానో వాపోయారు. అతని కన్నీటి కావ్యానికి ఎవరు వాక్యమవ్వగలరని, అతని బాధకు ఎవరు శృతి కలుపగలరని ఆలోచింపజేసే విధంగా అన్నారు. సుఖ దుఃఖముల గాలమే కాలరూప ఇంద్రజాలము అని చెప్పారు.
మనిషిలో మమతను, మట్టి తత్వాన్ని, మానవత్వ చేతనత్వాన్ని మరలా ప్రవహింపజేసేందుకు రీచార్జ్ ఎంతో అవసరమన్నారు. పీడల నీడల అడ్డుతెరలు తొలగించి లోకమంతా పీయూషాన్ని వర్షించమని విషాల ఆకాశాన్ని వేడుకున్నారు. అప్ఘనిస్తాన్ దేశ సంక్షోభం నేపధ్యంలో రాసిన కవితలో అనేక దేశాల పౌరులు అప్ఘన్ వెళ్లారని ఆరని అధికార దాహపుటగ్ని కీలలు ఎగిసిన ఈ వేళలో వెనక్కి రావటం తప్పేమి కాదు/ వెనక్కి రావడమంత సులభమూ కాదు అన్నారు. వేనవేల జ్ఞాపకాలు నిండిన స్థలాన్ని వొట్టి ఖాళీ స్థలమని ఎలా సునాయాసంగా అంటారని ప్రశ్నించారు. జీవన చేతనత్వం రెక్కవిప్పడానికి ఒక తోవ అవసరమన్నారు. ఆశలు సమాధైన లోకంలో గాయాలు మానేది ఏనాటికో అని వేదన చెందారు. చానా కాలం తరువాత సమస్యల తీరం దాటేందుకు ధైర్యంగా అడుగేశానని తెలిపారు. కూడలి చెట్టు అవసరాలకు ఆయువు పట్టు అని ఆసిఫాబాద్‌లోని వివేకానంద చౌక్‌ను ప్రస్తావిస్తూ చెప్పారు. ఓటరును మేలుకొని ఏలుకొమ్మని తెలిపారు.
ప్రేమలు వర్షిస్తే మానవత్వం సురభిళమై పరిమళిస్తుందని చెప్పారు. సిటీలైఫ్ నిజమైన పిటీలైఫ్ అని తెలిపారు. రేపటి నవోదయానికై అలజడుల ముంగిట ఎంత కష్టమైనా ధైర్యంగా వేచి ఉన్నానని చెప్పారు. కులాతీత నవ కలల్ని స్వప్నిస్తున్న మేం కవివర్యులమని తెలిపారు. అశోకవనంలో సీతమ్మ గుండె నిబ్బరానికి జయకేతన మెత్తారు. వేదన నుండి ఆనందాల వెలుగు దాకా అప్రతిహతంగా ప్రస్థానం సాగాలని చెప్పారు. ఓ మహాకవీ నీకు లేదు అస్తమయం అన్న కవితలో కవి మధుకు అక్షర నివాళి అర్పించారు. కనుమూసే కడదాకా లేదా విరామమంటూ జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాన్న గుండెల్లో నిత్యం బ్రతికే ఉన్నాడన్నారు. సిరియాలో శాంతిగీతం పల్లవించాలని కోరుకున్నారు. బ్రేక్ పడింది అన్న కవిత అష్టకష్టాల ఆర్టీసీ చోదకుని జీవితం పరిపూర్ణం కాని సమస్యల సుడి గుండమని చెప్పారు.
రోడ్డనే మ్యూజియంపై రైతు శిలలా నిలబడ్డాడని ఢిల్లీ రైతుల ధర్నా నేపధ్యంలో రాసిన రైతు ధ్వజం కవితలో వేదన చెందారు. ఎద దగ్ధమై అణువణువునూ దహించి వేస్తున్నదన్నారు. మనిషి మనిషిని చంపే విష సంస్కృతికి చరమగీతం పాడాలని జార్జ్ ఫ్లాయిడ్ మరణం సాక్షిగా రాసిన కవితలో పిలుపునిచ్చారు. పేదరికాన్ని అష్టమ సముద్రంతో పోల్చారు. నిరంతరం జీవనపు ఒత్తిడుల మధ్య నలిగి పోతూ తల్లడిల్లే మనిషి చెట్టు దగ్గర సేద దీరవచ్చంటారు. ఊరందరినీ చల్లగా దీవిస్తూనే ఉంటుంది / అందరికీ సానుకూలమవుతూ/ తను మాత్రం స్థాణువులా ఉండే / ఏ నాటికీ వాడని మన కూడలి చెట్టు/ అది అందరి అవసరాలకు ఆయువు పట్టు అని కూడలి చెట్టు కవితలో రాసిన ప్రబలమైన వాక్యాలు ఆత్మధీరత్వానికి ప్రతిబింబాలయ్యాయి.
గగన శూన్యమే తన మనసుకు మనోహరమని చెప్పారు. కళ్లెదుటే కాలం వెళ్లి పోతుందన్నారు. శోకమెరుగని నవలోకం రావాలని ఆకాంక్షించారు. దగ్ధ హృదయం మీది వెన్నెల జలపాతమే శిశిర గీతంలో వసంత రాగమని తెలిపారు. కరోనా కష్టకాలం గురించి చెబుతూ వెల్లడి కాని వేనవేల భావాలే వెల్లువ కాని నవ మానవుని అనుభవాలని అన్నారు. సరిహద్దు గ్రామంలో జీవించడమంటే నిత్య సంగ్రామమేనని చెప్పారు. ప్రపంచం గురించి ఊసేలేని వింతమాలోకమైన ఆమె శప్తమయ జీవితపు శోక విపంచిక అని తెలిపారు. ఆఖరు చితి నుండే అంతిమ జీవన పరిణతి వెల్లడవుతుందని చెప్పారు. ఆవేదనను అణచిపెట్టి/ ఆలోచనకు పదనుపెట్టి ధీరురాలైతే ఆమే ఒక బాణం, ఆమే ఒక ఖడ్గమని తెలిపారు.
మానవత్వపు పొద్దు పొడవాలని ప్రగాఢంగా ఆకాంక్షించారు. మనిషి స్వేదపు సంగమంతో ప్రయాణమయ్యే రోడ్డు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి ఉపయోగపడాలనే సత్యాన్ని గ్రహించాలని తెలిపారు. కన్నీళ్లు లేని తెలంగాణను కవి కోరుకున్నారు. నవలోకపు ప్రతినిధిగా కవిని ఈ కవితలు బలపరిచాయి. కృషి, నిరంతర సాధనతో కవితల అల్లిక సాగింది. వస్తు విస్తృతి, నిర్వాహణ, గాఢత అన్న ప్రత్యేకతలతో కవితలు ప్రకాశించాయి. అనుబంధాలు, అంతరంగాలు, వికృత విషాదాలు, బ్రతుకు నేర్పించే పాఠాలు, తదనుగుణంగా అందివచ్చే దిశానిర్దేశాలను ఎంతో స్పష్టంగా ఈ కవితలు అందించాయి.
– డా. తిరునగరి శ్రీనివాస్
944146476