ఒక వారం వారం శీర్షికలో గత వారం రాసిన విషయం మీదనే మరొకసారి రాయడం సాధారణంగా జరగదు. కాని వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా విలేజి భూసేకరణకు వ్యతిరేకంగా వ్యక్తమైన ప్రజాగ్రహం తెలంగాణ సమాజానికీ, పాలనకూ, అభివృద్ధి నమూనాకూ, అమలవుతున్న పోలీసు రాజ్యానికీ సంబంధించి లోతైన ప్రశ్నలెన్నో లేవనెత్తుతున్నది గనుక దాని గురించి మళ్లీ మాట్లాడుకోవాలి. పైగా గడిచిన వారంలో బాధిత గ్రామాల మీద అర్ధరాత్రి పోలీసుల దాడి, మూకుమ్మడి అరెస్టులు, అక్రమ కేసులు, అబద్ధ ప్రచారాలు, నిజనిర్ధారణ బృందాలను అడ్డుకోవడం వంటి ప్రభుత్వ, పోలీసు అక్రమాలెన్నో జరిగిపోయాయి. అధికారుల మీద దాడి అంటూ పోలీసు కేసులు, ఉద్యోగ సంఘాల యాగీ సాగిపోతున్నాయి. ప్రభుత్వం మొత్తం ప్రజాగ్రహాన్ని ప్రతిపక్షాల కుట్రగా, పోలీసులు పరిష్కరించవలసిన శాంతి భద్రతల సమస్యగా కుదించి చూస్తున్నది, చూపుతున్నది. ప్రధాన స్రవంతి మాధ్యమాలు ప్రభుత్వానుకూల కథనాలనే వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లగచర్ల ప్రజాగ్రహం గురించి మళ్లీ మాట్లాడుకోవాలి. ప్రభుత్వం చెపుతున్నట్టు అది కేవలం ప్రతిపక్షాలు రెచ్చగొట్టినందువల్ల, ప్రతిపక్షాల కుట్రతో మాత్రమే రగుల్కొన్నది కాదు. తమ భూమిని లాక్కుంటామంటే ఎవరికైనా ఆగ్రహం కలుగుతుంది. అందులోనూ ఆ భూమిని “ప్రజాప్రయోజనం కోసం” అనే మాయ మాటలతో ఆక్రమించుకుని, ఆక్రమించడానికి ఎత్తుగడలు పన్నుతున్నప్పుడు, ప్రభుత్వం తమ దగ్గర గుంజుకుంటున్న భూమికి మార్కెట్ లో ఉన్న, తగిన ధర కట్టి ఇస్తుందనే హామీ లేనప్పుడు, గతంలో ప్రభుత్వాలూ అధికారులూ ఇచ్చిన ఇటువంటి వందలాది హామీలు నెరవేరని అనుభవం ఉండగా రైతులకు ఆగ్రహం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దానికి ఎవరూ రెచ్చగొట్టనక్కరలేదు. ఈ ప్రతిపాదన ప్రారంభమైనప్పటి నుంచీ తాము ప్రకటిస్తున్న వ్యతిరేకతను, నిరసనలను ఎంతమాత్రం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు తమకేదో ఒరగబెడుతుందని గ్రామస్తులు విశ్వసించలేదు.
ఆ ఆగ్రహం అధికారుల మీద వ్యక్తం చేయడం సరైనదేనా అని కొందరికి అనుమానం రావచ్చు. ఉద్యోగ సంఘాలైతే తమ సహోద్యోగుల మీద దాడి చేసిన వాళ్లను శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు, ఎవరెవరికో విజ్ఞప్తులు చేస్తున్నారు. కాని రైతులు తమ కోపం ప్రభుత్వం మీద చూపదలిచారు, వారికి కనబడిన ప్రభుత్వం ఆ అధికారులే. ఉద్యోగ సంఘాల ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. కాని ఈ ఉద్యోగ సంఘాలు తమ సహోద్యోగులు అవినీతికి పాల్పడినప్పుడు, విధి నిర్వహణ సరిగా చేయనప్పుడు, అరకొరగా విధి నిర్వహణ చేసినందుకే లంచాలు అడిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడాయా? తాము ప్రజా సేవకులమని, తమ జీతభత్యాలు ప్రజల నెత్తుటిని చెమటగా మార్చిన సంపద అని, ప్రజలు కట్టిన పన్నులని గుర్తించకుండా ప్రజల మీద దౌర్జన్యం, పెత్తనం చేసినప్పుడు ఎప్పుడైనా మాట్లాడాయా? ఉద్యోగులుగా ప్రభుత్వం ఏమి చెపితే అది చేయడమే తమ విధి నిర్వహణ అనుకున్నారు గాని, తాము ఉద్యోగుల కన్నా ముందు మనుషులమని, మనుషులుగా న్యాయాన్యాయాల ఆలోచన ఉండాలని అనుకున్నారా? జీవనోపాధి లాక్కుని ప్రజలను నిరాశ్రితులను చేయడం, అందుకోసం అబద్ధపు హామీలు ఇవ్వడం, ఆ హామీలు నెరవేర్చకపోవడం, భూమి ఇవ్వడానికి నిరాకరించినవారి మీద పోలీసులచేత దాడి చేయించడం, తీసుకున్న భూమిని కార్పొరేట్లకు కారుచౌకగా అప్పగించడం, ఆ కార్పొరేట్లు ప్రజారోగ్యాన్నీ పర్యావరణాన్నీ భవిష్యత్తునూ ధ్వంసం చేసే కాలుష్యకారక పరిశ్రమలు పెట్టడం – ఇదంతా “ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ” పరిధిలోకి వస్తాయా? విధి నిర్వహణేనా? ప్రజాసేవేనా? ఇప్పుడు తమను ప్రశ్నించారని, బహుశా ఒక దెబ్బ వేశారని ఇంత ఉక్రోషపడుతున్న ఉద్యోగ సంఘ నాయకులు ఈ ప్రశ్నలు ఎప్పుడైనా ఆలోచించారా?
ఫార్మా విలేజి బీభత్సానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అనే దాంట్లో రెండో మాట లేదు, కాని ప్రతిపక్ష పార్టీలది మరింత విచిత్రం. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ (భారత) రాష్ట్ర సమితి రెండూ తాము అధికారంలో ఉన్న చోట, అధికారంలో ఉన్న సమయంలో భూములను దౌర్జన్యంగా లాక్కుని కార్పొరేట్లకు అప్పగించిన దుర్మార్గమైన చరిత్ర ఉన్న పార్టీలే. తన పది సంవత్సరాల పాలనలో తెరాస కాళేశ్వరం కోసం, ప్రత్యేకించి మల్లన్నసాగర్ కోసం, “అభివృద్ధి పథకాలు” అనే ముద్దుపేరు పెట్టిన ఇతర పథకాల కోసం ఎంత భూమి సేకరించిందో, ఎందరు రైతులను నిరాశ్రితులను చేసిందో, ఎంత దౌర్జన్యం ప్రయోగించిందో లెక్కలేదు. కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ, పునరావాస చట్టం రైతులకు, భూయజమానులకు ఎంతో కొంత మెరుగైన నష్టపరిహారం ఇస్తుందని చూసి, దానికి తూట్లు పొడవడానికి జివో 123, జివో 214, జివో 190, జివో 191, భూసేకరణ చట్టం 2016 అనే అత్యంత దుర్మార్గమైన ప్రయత్నాలు చేసిన ఘన చరిత్ర కె చంద్రశేఖర రావు ప్రభుత్వానిది. ఇప్పుడు భూమిని కోల్పోతున్న రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తున్న భారత రాష్ట్ర సమితికి ఆ మాట మాట్లాడే హక్కు లేదు.
ఫార్మా విలేజి బీభత్సానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అనే దాంట్లో రెండో మాట లేదు, కాని ప్రతిపక్ష పార్టీలది మరింత విచిత్రం. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ (భారత) రాష్ట్ర సమితి రెండూ తాము అధికారంలో ఉన్న చోట, అధికారంలో ఉన్న సమయంలో భూములను దౌర్జన్యంగా లాక్కుని కార్పొరేట్లకు అప్పగించిన దుర్మార్గమైన చరిత్ర ఉన్న పార్టీలే. తన పది సంవత్సరాల పాలనలో తెరాస కాళేశ్వరం కోసం, ప్రత్యేకించి మల్లన్నసాగర్ కోసం, “అభివృద్ధి పథకాలు” అనే ముద్దుపేరు పెట్టిన ఇతర పథకాల కోసం ఎంత భూమి సేకరించిందో, ఎందరు రైతులను నిరాశ్రితులను చేసిందో, ఎంత దౌర్జన్యం ప్రయోగించిందో లెక్కలేదు. కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ, పునరావాస చట్టం రైతులకు, భూయజమానులకు ఎంతో కొంత మెరుగైన నష్టపరిహారం ఇస్తుందని చూసి, దానికి తూట్లు పొడవడానికి జివో 123, జివో 214, జివో 190, జివో 191, భూసేకరణ చట్టం 2016 అనే అత్యంత దుర్మార్గమైన ప్రయత్నాలు చేసిన ఘన చరిత్ర కె చంద్రశేఖర రావు ప్రభుత్వానిది. ఇప్పుడు భూమిని కోల్పోతున్న రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తున్న భారత రాష్ట్ర సమితికి ఆ మాట మాట్లాడే హక్కు లేదు. గతంలో తెరాస చేసిన దుర్మార్గాన్నే యథాతథంగా కాంగ్రెస్ చేస్తున్నది. లేదా తిరగేసి చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గమంతా గతంలో తెరాస చేసినదే.
కాంగ్రెస్ ప్రభుత్వ మరొక ఆకు ఎక్కువ చదివినట్టుగా బాధిత గ్రామాలలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి, ప్రపంచానికి తెలియజెప్పడానికి వెళ్తున్న నిజనిర్ధారణ బృందాలను అడ్డుకుంటున్నది. వెళ్లేవారిని అరెస్టు చేస్తున్నది. పోలీసులు విరుచుకుపడి స్త్రీలని కూడా చూడకుండా నిజ నిర్ధారణ బృంద సభ్యులను వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కొనసాగిస్తున్న పోలీసు రాజ్యం తెరాస సాగించినదే. అంతకు ముందరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినదే. నేరెళ్ల ఇసుక మాఫియా బాధితులను, మల్లన్నసాగర్ బాధితులను కలవడానికి వెళ్లిన నిజనిర్ధారణ బృందాలను, చివరికి మేడిగడ్డ బ్యారేజి విహారయాత్రకు వెళ్తున్న ఉపాధ్యాయులను కూడా అడ్డుకున్న, అరెస్టు చేసిన ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిది. ఈ దౌర్జన్యాలేవీ ప్రజాసేవ కాకపోయినా, ప్రజా ప్రయోజనం కోసం కాకపోయినా అప్పుడు పోలీసులు కెసిఆర్- కెటిఆర్ “ప్రైవేట్ సైన్యం”గానే ఆ పనులు చేశారు. ఇప్పుడు అదే పోలీసులు, అవే పనులు చేస్తుంటే “రేవంత్ ప్రైవేట్ సైన్యంగా పని చేస్తున్నారా” అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మన రాజకీయాలు ఎంత హాస్యస్ఫోరకంగా, హాస్యాస్పదంగా మారిపోయాయి!!
బాధిత ప్రజల గురించిన వాస్తవ సమాచారం ప్రజలకు తెలియకుండా, అనేక ప్రచారాలు, అపోహలు, అబద్ధాలు చెలరేగుతున్న స్థితిలో లగచర్లలో, చుట్టుపక్కల తాండాలలో ఏం జరిగిందో, జరుగుతున్నదో, ప్రభుత్వం ఏ సమాచారాన్ని ప్రజల నుంచి దాస్తున్నదో తెలుసుకోవడానికి మహిళా, ట్రాన్స్ జెండర్ జాయింట్ ఆక్షన్ కమిటీ తరఫున ఒక బృందం నవంబర్ 19న ఆ ప్రాంతానికి వెళ్లింది. ఆ బృందాన్ని పోలీసులు అడ్డుకుని వేధించారు. ఆ బృందంలో ఉన్న పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య పై దాడి చేసి, దుస్తులు చించేశారు. ఆ రోజునే అక్కడికి వెళ్తున్న గిరిజన నాయకులను అడ్డుకున్నారు. ఆ మర్నాడు నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌరహక్కుల సంఘం బృందాన్ని అడ్డుకున్నారు.
తాము చట్టబద్ధ పాలన సాగించడానికి రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో ప్రవర్తించవలసినవాళ్లం మాత్రమే అనే సంగతి ఎప్పుడో మరిచిపోయిన పోలీసులు అధికారంలో ఎవరుంటే వారికి ప్రైవేటు సైన్యంగా ప్రవర్తించడం ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచీ సాగిపోతూనే ఉంది. అదే వరుసలో ఫార్మా విలేజి బాధితుల గ్రామాల మీదికి పోలీసులు అర్ధరాత్రి విరుచుకుపడి ఎంతో మందిని అరెస్టు చేశారు. స్త్రీలపట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ కఠోర వాస్తవాలు బైటపడకుండా ఉండడానికి ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ బంద్ చేశారు. సోషల్ మీడియా పని చేయకుండా చేశారు. ప్రధాన స్రవంతి వార్తా పత్రికలకూ చానళ్లకూ అబద్ధ సమాచారం వండి వార్చారు. ప్రజల మీద ఈ పోలీసు నిర్బంధం, దౌర్జన్యం సాగుతుండగా, ముఖ్యమంత్రి సోదరుడు ఈ గ్రామాల్లో తిరుగుతూ ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తున్నవారిని బెదిరిస్తూ వీరంగం వేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రభుత్వంలో భాగస్వామీ కాదు, ఫార్మా కంపెనీ యజమానీ కాదు, ఆయన ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అలా బాధిత ప్రజల గురించిన వాస్తవ సమాచారం ప్రజలకు తెలియకుండా, అనేక ప్రచారాలు, అపోహలు, అబద్ధాలు చెలరేగుతున్న స్థితిలో లగచర్లలో, చుట్టుపక్కల తాండాలలో ఏం జరిగిందో, జరుగుతున్నదో, ప్రభుత్వం ఏ సమాచారాన్ని ప్రజల నుంచి దాస్తున్నదో తెలుసుకోవడానికి మహిళా, ట్రాన్స్ జెండర్ జాయింట్ ఆక్షన్ కమిటీ తరఫున ఒక బృందం నవంబర్ 19న ఆ ప్రాంతానికి వెళ్లింది. ఆ బృందాన్ని పోలీసులు అడ్డుకుని వేధించారు. ఆ బృందంలో ఉన్న పి ఓ డబ్ల్యూ నాయకురాలు సంధ్య పై దాడి చేసి, దుస్తులు చించేశారు. ఆ రోజునే అక్కడికి వెళ్తున్న గిరిజన నాయకులను అడ్డుకున్నారు. ఆ మర్నాడు నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌరహక్కుల సంఘం బృందాన్ని అడ్డుకున్నారు.
గ్రామస్తులు ఎందుకు ఆందోళనగా వున్నారు? వినతి పత్రాలు, శాంతియుత పద్ధతుల్లో పోరాటం చేస్తున్నా అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆయా గ్రామాల ప్రజలకి ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ప్రతిపాధిత పరిశ్రమల వల్ల అక్కడ జరగబోయే పర్యావరణ విధ్వంసం ఏమిటి? జిల్లా కలెక్టర్ ను, సిబ్బందిని ప్రజలు ఎందుకు అడ్డుకున్నారు? వాళ్లకి ఆగ్రహం తెప్పించిన అంశాలు ఏమిటి? అధికార యంత్రాంగం వాహనాల మీద, సిబ్బంది మీద జరిగిన దాడికి తక్షణ కారణాలేమిటి? వాగ్వివాదంలో, ఆవేశంలో జరిగిందా లేక పోలీసులు చెబుతున్నట్టు ఏదైనా కుట్ర కోణం వుందా? అధికార సిబ్బంది మీద దాడి తర్వాత ఆ గ్రామాల ప్రజల మీద పోలీసుల నిర్బంధం ఏ విధంగా జరిగింది? మహిళల మీద కూడా దౌర్జన్యం చేశారా? ప్రజలు చెబుతున్నదేమిటి? ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నదేమిటి? అనే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికే తాము వెళ్లామని మహిళా బృందం ఆ తర్వాత నిర్వహించిన పత్రికా సమావేశంలో తమ పర్యటన ఉద్దేశం వివరించింది. నిజానికి ఈ ప్రశ్నలన్నీ ఎవరికైనా రావలసినవే, ఎవరైనా జవాబులు వెతకవలసినవే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడమే, జవాబులు వెతకడమే నేరమై పోయినట్టుంది. వలసపాలన కాలంలో ప్రభుత్వం జరిపిన దౌర్జన్యాల మీద నిజనిర్ధారణ బృందాలను పంపి, వాస్తవాలు సేకరించి ప్రజల ముందు నివేదికలు ఉంచే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీనే జలియన్ వాలా బాగ్ మారణకాండ సందర్భంగా ప్రారంభించింది. 1947 దాకా అటువంటి నిజ నిర్ధారణ నివేదికలు ఎన్నో ఉన్నాయి. అదే సంప్రదాయం 1947 తర్వాత, మరీ ముఖ్యంగా 1970ల తర్వాత విరివిగా ఉనికిలోకి వచ్చింది. కాని అదే కాంగ్రెస్ కు చెందిన ఒక ముఖ్యమంత్రి పాలనలో, అది కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏడో హామీ ఇచ్చిన పాలనలో నిజాలు సేకరించాలని అనుకోవడమే, నిజాలు సేకరించడానికి ప్రజల్లోకి వెళ్లడమే నేరంగా పరిగణించబడుతున్నది!.