వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల పేరుతో భూములు కోల్పోతున్న గ్రామస్తులు సోమవారం నాడు ప్రభుత్వ అధికారుల మీద తిరగబడ్డారు. రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో జిల్లా కలెక్టర్ తో సహా చాల మంది అధికారులు గాయపడ్డారు, లేదా తప్పించుకుని పారిపోయారు. ఈ దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తామని, దాడికి పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని ప్రభుత్వమూ, పోలీసు అధికారులూ ప్రకటిస్తున్నారు. ఈ దాడి వెనుక ప్రధాన ప్రతిపక్ష నాయకుల కుట్ర ఉందని అధికార పక్షం ఆరోపిస్తున్నది. విధి నిర్వహణలో ఉన్న తమ సహోద్యోగులపై దాడిని నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి.
ప్రభుత్వమూ, పోలీసులూ సహజంగానే ప్రతి సమస్యకూ బలప్రయోగం ఒక్కటే పరిష్కారం అనుకుంటారు గనుక గ్రామం మీద అర్ధరాత్రి దాడులూ, ఎడాపెడా అరెస్టులూ, కేసులూ, ఇంటర్నెట్ రద్దూ వంటి చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంతటి సాహసమా అని కక్ష, ప్రతీకార వాంఛ చూపుతున్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వినియోగించుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నది. ఈ రణగొణ ధ్వనిలో అసలు సమస్య, ఆ సమస్య ఇక్కడిదాకా పర్యవసించిన క్రమం కనబడకుండా పోతున్నాయి. సాధారణంగా ఆధిపత్య వర్గాల వాణిని చిలుక పలుకుల్లా వినిపిస్తూ, ప్రత్యామ్నాయ, ప్రజా స్వరాలను విస్మరించడం అలవాటయిన ప్రధాన స్రవంతి ప్రచార మాధ్యమాలలో ప్రభుత్వ, అధికారపక్ష, ఉద్యోగ సంఘాల కథనాలు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల దాడి దృశ్యాలు కూడ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి గాని అవి కేవలం సంచలనం కోసం మాత్రమే తప్ప, ప్రజలకు అంత ఆగ్రహం ఎందుకు వచ్చిందో మూల కారణాలను చూపడం మీద దృష్టి పెట్టడం లేదు.
సోషల్ మీడియా దృశ్యాల్లో ప్రభుత్వాధికారుల నిస్సహాయత, గ్రామస్తుల, ముఖ్యంగా మహిళల ఆగ్రహం, దాడి, కార్ల ధ్వంసం కనబడుతున్న మాట నిజమే. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగుల మీద ఎవరైనా దాడికీ దౌర్జన్యానికీ దిగడం శిక్షార్హమైన నేరం అనే మాట నిజమే. ప్రభుత్వ బలగాలు, అధికార పక్ష నాయకులు ఈ వ్యవహారమంతా ప్రధాన ప్రతిపక్ష కుట్ర అని చూపడానికి ఏవేవో సాక్ష్యాధారాలు కూడా సృష్టిస్తున్నారు. అయితే ఈ నిజాలూ, సాక్ష్యాధారాలూ మొత్తం చిత్రంలో ఒకానొక భాగం మాత్రమే. దాడి, దౌర్జన్యం ఖండించదగినవే అయినా అవి ఒక సుదీర్ఘ క్రమానికి పర్యవసానాలో, సుదీర్ఘ క్రమంలో భాగాలో అయినప్పుడు, ఆ క్రమాన్నంతా వదిలి ఆ ఒక్క ఘటన మీదనే వ్యాఖ్యానించడం చెల్లదు. అసలు ఏ ఘటనకైనా, క్రమానికైనా ఒక సామాజిక నేపథ్యం, సందర్భం ఉంటాయి. ప్రతి ఒక్క ఘటననూ దాని గతం నుంచి ఒక క్రమంలోనే అర్థం చేసుకోవాలి.
ఇవాళ రైతుల పక్షం అన్నట్టు నటిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తన పాలనా కాలంలో మల్లన్నసాగర్ తో సహా ఎన్నో పథకాలకు ప్రజల మీద ఇంతకంటే ఎక్కువ అణచివేత అమలుచేసి, 2013 చట్టం కన్నా భిన్నంగా జి వో లు తెచ్చి భూసేకరణ అమలు చేసింది గదా, ఇప్పుడు దాని చిత్తశుద్ధి ఏమిటి? రాజకీయ నాయకులు ప్రకటిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను యథాతథంగా అమలు చేస్తూ, ప్రజల మీద ఒత్తిడి తెచ్చి భూసేకరణ చేస్తూ, పనిలో పనిగా అవినీతి చక్రవర్తులుగా మారిన అధికారులకు ఇప్పుడు ప్రజా ఆగ్రహాన్ని ప్రశ్నించే నైతిక అర్హత ఉందా? ఎన్నెన్నో ప్రశ్నలు….
గత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 2018లో హైదరాబాద్ సమీపంలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల దగ్గర ఇరవై వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తానని, భూసేకరణ ప్రారంభించిది. ఫార్మా కంపెనీల వ్యర్థాలతో జరగబోయే కాలుష్యం, భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం, వ్యవసాయ విధ్వంసం, భూసేకరణలో అవకతవకలు, తక్కువ నష్టపరిహారం వంటి సమస్యలపై ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళన ప్రారంభించారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఫార్మా సిటీ బాధిత ప్రజలకు మద్దతు ప్రకటించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ముచ్చర్ల ఫార్మా సిటీ ప్రతిపాదనను ఉపసంహరించి, ఒకే చోట ఇరవై వేల ఎకరాల బదులు, రాష్ట్రమంతటా పది జిల్లాలలో, జిల్లాకు వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల చొప్పున ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఒక్కచోటి సమస్య పది చోట్లకు వికేంద్రీకరించడం, పేరు మార్పు తప్ప జరిగిన మౌలిక మార్పేమీ లేదు. టి ఆర్ ఎస్ పిల్లి అంటే, కాంగ్రెస్ మార్జాలం అంది. అంతే.
అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట, పులిచర్ల తండా, రోటిబండ తండా పరిధిలో 1373 ఎకరాల ఫార్మా విలేజి తలపెట్టారు. ఇందులో 90 ఎకరాల ప్రభుత్వ భూమి, 547 ఎకరాల అసైన్డ్ భూమి, 736 ఎకరాల రైతుల పట్టా భూమి ఉంది. రైతుల నుంచి సేకరించే 736 ఎకరాల్లో652 ఎకరాలకు (హకీం పేట 366 ఎకరాలు, పోలేపల్లి 130 ఎకరాలు, లగచర్ల 156 ఎకరాలు) గాను 580 మంది రైతులకు ఆగస్టులో నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచీ రైతుల్లో ఆందోళన రగుల్కొంటున్నది. ఎట్టి పరిస్థితిలోనూ తమ భూమి ఇవ్వబోయేది లేదని రైతులు నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. అన్ని రాజకీయ పక్షాలనూ కలిశారు. అక్టోబర్ లో భూసేకరణ కోసం బహిరంగ విచారణ జరపడానికి ప్రయత్నించినా, రైతుల ఆందోళనతో దాన్ని విరమించుకోవలసి వచ్చింది. అలా వాయిదా పడిన బహిరంగ విచారణ ఈ సోమవారం జరగవలసి ఉండింది. బహిరంగ విచారణ స్థలానికి రైతులు రాలేదు. రైతుల దగ్గరికే వెళ్లడానికి అధికారులు లగచర్ల వెళ్లడంతో ఘర్షణ జరిగింది.
అసలు ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములను ప్రభుత్వం గుంజుకోవడం, గుంజుకోవడానికి ప్రయత్నించడం అతి పెద్ద అక్రమం. ప్రైవేటు ఫార్మా కంపెనీలు తమంతట తామే భూమి కొనుక్కుంటే, రైతులు స్వచ్ఛందంగా అమ్ముకుంటే కూడా పర్యావరణ, కాలుష్య, ప్రజారోగ్య కారణాలతో ఆంక్షలు విధించవలసిన ప్రభుత్వం, తానే భూమి సేకరించి ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని దలారీ ఆలోచన చేయడం ప్రజాద్రోహం, అక్రమం, పర్యావరణ విధ్వంసం. కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చిన భూసేకరణ చట్టాలన్నీ, వాటిలో అతి ముఖ్యమైనదీ, నష్టపరిహారం విషయంలో భూనిర్వాసితులకు ఎంతో కొంత మెరుగైనదీ అయిన 2013 భూసేకరణ చట్టంతో సహా, “ప్రజా ప్రయోజనకర అభివృద్ధి పథకాల కోసం మాత్రమే” ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని సేకరించవచ్చునని అంటాయి.
భూగర్భ జలాన్ని తోడేసే, విషపూరితం చేసే, కలుషిత, విషపూరిత వ్యర్థ పదార్థాలను విడుదల చేసి, పరిసర ప్రాంతాల వ్యవసాయాన్ని ధ్వంసం చేసే ఫార్మా పరిశ్రమ “ప్రజా ప్రయోజన అభివృద్ధి పథకం” ఎలా అవుతుంది? ఆ కంపెనీలు రావడం వల్ల ఉద్యోగకల్పన జరుగుతుందని, పెట్టుబడులు వస్తాయని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని గత చరిత్ర అడుగడుగునా రుజువు చేస్తున్నది. ఏ ఒక్క పరిశ్రమలోనూ ప్రభుత్వమూ, పారిశ్రామికవేత్తలూ వాగ్దానం చేసినన్ని ఉద్యోగాలు రాలేదు. పెట్టుబడులు వచ్చినందువల్ల స్థానికులకు, భూములు పోగొట్టుకున్న రైతులకు ఒరిగినదేమీ లేదు. ఆర్థికాభివృద్ధి అంటే ఫార్మా రంగంలోని విపరీతమైన లాభాల వల్ల పెట్టుబడిదార్లు అభివృద్ధే గాని ప్రజల అభివృద్ధి కాదు. భూమి, గ్రామం కోల్పోయిన నిర్వాసితుల జీవితాలు మాత్రం బుగ్గిపాలయ్యాయి. ఇంతకూ చాలా చోట్ల ఇటువంటి ప్రకటనలతో భూములు ఆక్రమించాక నిజంగా అక్కడ పరిశ్రమలు కూడా రాలేదు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు పెట్టి, భూమి ఆక్రమించిన వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు, ఆ తర్వాత ఆ భూమిని రియల్ ఎస్టేట్ గా మార్చుకున్నారు.
అసలు ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములను ప్రభుత్వం గుంజుకోవడం, గుంజుకోవడానికి ప్రయత్నించడం అతి పెద్ద అక్రమం. ప్రైవేటు ఫార్మా కంపెనీలు తమంతట తామే భూమి కొనుక్కుంటే, రైతులు స్వచ్ఛందంగా అమ్ముకుంటే కూడా పర్యావరణ, కాలుష్య, ప్రజారోగ్య కారణాలతో ఆంక్షలు విధించవలసిన ప్రభుత్వం, తానే భూమి సేకరించి ఫార్మా కంపెనీలకు ఇవ్వాలని దలారీ ఆలోచన చేయడం ప్రజాద్రోహం, అక్రమం, పర్యావరణ విధ్వంసం. కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చిన భూసేకరణ చట్టాలన్నీ, వాటిలో అతి ముఖ్యమైనదీ, నష్టపరిహారం విషయంలో భూనిర్వాసితులకు ఎంతో కొంత మెరుగైనదీ అయిన 2013 భూసేకరణ చట్టంతో సహా, “ప్రజా ప్రయోజనకర అభివృద్ధి పథకాల కోసం మాత్రమే” ప్రభుత్వం ప్రజల నుంచి భూమిని సేకరించవచ్చునని అంటాయి.
ఈ భారీ మోసానికి “ప్రజా ప్రయోజనం” అని పేరు పెట్టిన ప్రభుత్వాలు రైతులను బెదిరించి, ఒత్తిడి చేసి, సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా భూమి లాక్కుని, కారు చౌకగా తమ ఆశ్రితులకు, తమకు ముడుపులు ఇచ్చిన పెద్దలకు కట్టబెడుతున్నాయి. మన గ్రామాల్లో ఎక్కడైనా భూమి లేని నిరుపేద ప్రజానీకం 30 నుంచి 40 శాతం ఉన్నారు గనుక వారికి ఆ కనీస నష్టపరిహారం కూడా దక్కదు. ఎంతో కొంత నష్టపరిహారం దక్కే సన్న, చిన్న, మధ్యతరగతి భూయజమానులకు హఠాత్తుగా వచ్చిపడిన ఆ కొద్దిపాటి డబ్బు పప్పులు పుట్నాలకు ఖర్చయి పోతుంది. అంతకు ముందున్న పావు ఎకరమో, అర ఎకరమో కోల్పోయి, దిక్కు లేక పట్నాల బాట పట్టి, అడ్డా కూలీలుగా మారిపోవలసి వస్తుంది. ఈ మొత్తం క్రమంలో భూయజమానుల్లో ఒకరిద్దరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. పారిశ్రామిక వేత్తలకు ఇబ్బడి ముబ్బడి లాభాలు, రాజకీయ నాయకులకు ముడుపులు లభిస్తాయి. ఈ బందిపోటు దొంగతనాన్ని “పారిశ్రామికీకరణ”, “ఫార్మా విలేజి”, “అభివృద్ధి”, “ప్రజా ప్రయోజనం” అనడం పెద్ద మోసం.
ప్రస్తుత సందర్భమే చూస్తే, 580 మంది రైతుల దగ్గర 652 ఎకరాలు, అంటే సగటున ఒక రైతు కుటుంబం నుంచి ఒక ఎకరం ఐదు గుంటలు లాక్కుంటున్నారు. అది చాలా తక్కువ భూమి అని బైటివాళ్లకు అనిపించవచ్చు గాని, ఆ రైతులకు అదే ఆస్తి, అదే గౌరవం, అదే విలువ, అదే శాశ్వత ఆదాయ వనరు. దాన్ని కొల్లగొట్టి వారిని బిచ్చగాళ్లుగా మార్చే పథకం ఇది. ఇక మిగిలిన భూమిలో 547 ఎకరాల అసైన్డ్ భూమి దళితులకు, పేదలకు, సహాయం అవసరమైన వారికి చెందినది, చెందవలసినది. దాన్ని ధనవంతులకు అప్పనంగా అప్పగించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు.
కనుక ఇవాళ అధికారుల మీద దాడి, దౌర్జన్యం, సహోద్యోగుల మీద దాడి వంటి విషయాల కన్నా ముఖ్యంగా ఆలోచించవలసినవి మరింత లోతైన సామాజిక, రాజకీయార్థిక, అభివృద్ధి నమూనా అంశాలు. అసలు ఫార్మా పరిశ్రమ ఎవరికోసం? అది అభివృద్ధి చెందితే దేశానికి, ప్రజలకు ఏం ఒరుగుతుంది? ఫార్మా పరిశ్రమ కాలుష్యాన్ని అరికట్టే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా? భూసేకరణ ప్రభుత్వం ఎందుకు చెయ్యాలి? ఆ పారిశ్రామికవేత్తలు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర పెట్టి, అమ్మదలచుకున్న వారి వద్దనే కొనుక్కోవచ్చు గదా? ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు గత భూసేకరణల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చారా? తమ భూమి ఇవ్వబోమని శాంతియుతంగా మూడు నెలలుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ప్రజలను పట్టించుకోకుండా, వారి ఆగ్రహం పెరిగిపోయేలా చేసిన నిర్లక్ష్యం ఎవరిది? ఇవాళ రైతుల పక్షం అన్నట్టు నటిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తన పాలనా కాలంలో మల్లన్నసాగర్ తో సహా ఎన్నో పథకాలకు ప్రజల మీద ఇంతకంటే ఎక్కువ అణచివేత అమలుచేసి, 2013 చట్టం కన్నా భిన్నంగా జి వో లు తెచ్చి భూసేకరణ అమలు చేసింది గదా, ఇప్పుడు దాని చిత్తశుద్ధి ఏమిటి? రాజకీయ నాయకులు ప్రకటిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను యథాతథంగా అమలు చేస్తూ, ప్రజల మీద ఒత్తిడి తెచ్చి భూసేకరణ చేస్తూ, పనిలో పనిగా అవినీతి చక్రవర్తులుగా మారిన అధికారులకు ఇప్పుడు ప్రజా ఆగ్రహాన్ని ప్రశ్నించే నైతిక అర్హత ఉందా? ఎన్నెన్నో ప్రశ్నలు.