గ్రంథాలయాలయాలను ఆధునీకరించాలి!

పుస్తకం హస్తభూషణం అన్నారు. ఇంటర్‌నెట్‌,స్మార్ట్‌ ఫోన్‌ మాయలో పడి మనం అంతా పుస్తక పఠనాన్ని మర్చి పోయాం. ప్రతిదీ గూగుల్‌ చూసిపెడుతుందన్న భావనలో ఉన్నాం. కానీ పుస్తక పఠనంతోనే మస్తిష్కం వికసిస్తుంది. మనం మరచిపోతున్న ఈ అలవాటును జ్ఞప్తికి చేసుకునేలా పుస్తక ప్రదర్శనలు ఉపయోగపడుతున్నాయి. అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్న బుక్‌ఫెయిర్‌లు మళ్లీ ఆనందాన్ని  నింపుతున్నాయి. ఆసక్తిని పంచుతున్నాయి. డిజిటల్‌ యుగంలోనూ పుస్తకాలకు ప్రాముఖ్యత ఇంకా కొనసాగుతుంది. అక్షరాభ్యాసంతో ఆరంభమయ్యే ఈ అభిరుచి నిరంతరం నిరాఘాటంగా కొనసాగించాలి. పుస్తకాలు ప్రియమైన నేస్తాలు. డిజిటల్‌ యుగం లోనూ పుస్తకాలకు ఉన్న ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంటుంది. పుస్తకం ఒక విజ్ఞాన భాండాగారం. ఎప్పటికప్పుడు మన అవగాహనను పెంచుకోవడానికి అది అందించే విజ్ఞానం ఉపకరిస్తుంది. విజ్ఞానాన్ని పెంచుకోవడంతో బాటు, మనలో మనల్ని తెలుసుకునేలా చేస్తుంది. పుస్తకం మనచుట్టూ ప్రపంచాన్ని మనం తెలుసుకునేలా చేసే అపురూప సాధనంగా చూడాలి. అంతర్లీనంగా పుస్తకం అందించే విజ్ఞానం మన సామాజిక జీవనాన్ని నిర్దేశిస్తుంది. ఎన్నిపుస్తకాలు చదివితే అంతగా విజ్ఞానం అబ్బుతుంది. అందువల్ల పుస్తక ప్రియులు ఎలాగూ పఠనం చేస్తారు. ఆ అలవాటు లేనివారు సైతం అలవాటుచేసుకుంటే తమజ్ఞానాన్ని పెంచుకోగలుగుతారు. అందువల్ల పాఠశాల స్థాయిలోనే రకరకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలి.  పుస్తకాల పఠనంపై ఆసక్తి తగ్గడంతో ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది.
అంతెందుకు స్కూళ్లలో కూడా గ్రంధాలయాలు అతంంతగానే ఉంటున్నారు. పాఠ్యపుస్తకాలు తప్ప ఇతర గ్రంథాలు  అందుబాటులో ఉండడం లేదు. రెఫరెన్స్‌ పుస్తకాలు కూడా దొరకడం లేదు. డబ్బుండి కొనుక్కునే వారికి తప్ప పుస్తకాలు లేక ల్కెబ్రరీలు నిరసించి పోతున్నాయి. అంతకుమించి  నేటి విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గుతోంది. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ కళాశాలలు తగ్గడం, సామాజిక శాస్త్రాలు చదివిన వారికి తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఆ శాస్త్రాలపై నేటి యువత మొగ్గుచూపటం లేదు. తద్వారా సమాజంతో బంధానికి దూరమౌతున్నారు. పాఠశాలల్లో ఒకప్పుడు ల్కెబ్రేరియన్లు వుండేవారు. ఇప్పుడు ఆ పోస్టులు భర్తీ కావడం లేదు. ఫలితంగా విద్యాలయాల్లో విద్యార్థులకు పాఠశాలల్లో లభిస్తున్న పుస్తకాలపై అవగాహన కలగడం లేదు. ఇటువంటి పరిస్థితులలో సాహితీవేత్తలు, భాషాభిమానులు, స్వచ్ఛంద సంస్థలు గ్రంథాలయ ఉద్యమాలు వంటివి మరోసారి ప్రారంభించాల్సిన అవసరం వుంది.ఈ రోజుల్లో పుస్తక ప్రచురణ కష్టసాధ్యంగా మారింది. పాలకుల నుండి కూడా పెద్దగా ప్రోత్సాహం లభించడం లేదు. కేవలం పోటీ పరీక్షల కోసం ముద్రించే పుస్తకాలకు మాత్రమే డిమాండ్‌ ఉంటోంది.
యువతలో ఎక్కువ మంది సినీ సాహిత్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ’యునెస్కో’ అంచనా ప్రకారం ప్రతి ఐదు వేల మందికి ఒక గ్రంథాలయం ఉండాలి. మన దేశంలో కేవలం 75 వేల గ్రంథాలయాలున్నాయనేది ఒక అనధికార అంచనా. గ్రంథాలయాల్లో పోస్టుల భర్తీ కూడా సక్రమంగా జరగడం లేదు. చాలా గ్రంథాలయాలను ఆధునీకరించడం లేదు. ల్కెబ్రరీలలో పాత పుస్తకాలే దర్శన మిస్తున్నాయి. గ్రంథాలయ వారోత్సవాలని కూడా మొక్కుబడిగానే నిర్వహిస్తున్నారు. ఆ రోజుల్లోనే అయ్యంకి రమణయ్య గ్రంథాలయాల అభివృద్ధికి పది ఎకరాల స్థలాన్ని దానం చేసి ’గ్రంథాలయ ఉద్యమ పిత’ గా పేరు పొందారు. తెలుగు రాష్టాల్లో  పుస్తక మహోత్సవాలను హైద్రాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కర్నూలు వంటి ప్రముఖ పట్టణాలలో, జిల్లా కేంద్రాలలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఫలితంగా గ్రావిరీణ ప్రాంత విద్యార్థులకు మార్కెట్లో వచ్చే కొత్త పుస్తకాలపై అవగాహన ఏర్పడటం లేదు. పిల్లలకు కనీసం చదవడం, రాయడం వంటి విషయాలపై అవగాహన కల్పించాలని ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటువంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించాలి. అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా చిన్న, చిన్న పుస్తక మహోత్సవాలను నిర్వహించి స్థానిక రచయితలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సాహిత్యాన్ని పరిపుష్టం చేయవొచ్చు. గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రంథాలయాలను ఆధునీకరించాలి.
-ఎం.అజయ్‌  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page