దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ ను గుర్తించండి..

అప్పటి వరకు కూల్చివేతలు వొద్దు..
బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌23,ఆర్ఎన్ఏ : ‌చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ ‌కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతల పై హైకోర్ట్ ‌స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ పరిగణలోకి తీసుకోవాలని హైకోర్ట్ ‌పేర్కొంది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ ‌నిర్ధరణ శాస్త్రీయంగా జరగలేదంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్‌టీఎల్‌ ‌బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

వారంలోపు చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలను చెప్పాలని బాధితులకు సూచించింది. 6 వారాల్లోపు ఎఫ్‌టీఎల్‌ ‌పరిధిని నిర్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్‌ఎం‌సీ తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ 65 ఎకరాలు మాత్రమే ఉందని.. అధికారులు 160 ఎకరాలు అని చెప్పడం సరికాద‌ని  పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్‌ 4‌న లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్టు  ‌తెలిపింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్‌ 4 ‌నుంచి ఆరు వారాల లోపు తుది నోటిఫికేషన్‌ ‌జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్ల‌యింది.

జెట్ స్పీడ్‌తో బుల్‌డోజ‌ర్లు..
కాగా జెట్‌ ‌స్పీడ్‌లో హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. జూన్‌ 26 ‌నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చివేసింది. ఆక్రమణలకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎప్టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో చెరువును హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌పరిశీలిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగి హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. హై రీచ్‌ ‌జా క్రషర్స్‌తో పాటు జేసీబీలతో, బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టారు. జీహెచ్‌ఎం‌సీతో పాటు ఓఆర్‌ఆర్‌ ‌లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు పెంచింది. అన్‌ ‌పూర్‌లో హైడ్రా బిగ్‌ ఆపరేషన్‌ ‌చేపట్టింది. 17 గంటలపాటు నాన్‌ ‌స్టాప్‌ ‌గా ఇళ్లులు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్‌, ‌రెండు అపార్ట్ ‌మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ ‌గూడలో 16 విల్లాలు కూల్చివేసింది. సోమవారం తెల్లవారుజాము ఒంటిగంట వరకు కూల్చివేతలు కొనసాగాయి.

హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్‌ ‌నైట్‌ ‌కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు అనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్‌ ‌కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా 17 గంటలపాటు హైరిస్క్ ఆపరేషన్‌ ‌కొనసాగించి రికార్డు క్రియేట్‌ ‌చేసింది.  గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్‌ ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది.

ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అన్‌పూర్‌ ‌మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, ‌బఫర్‌ ‌జోన్‌ ‌పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ‌తెలిపారు. అయితే తమ సామ‌గ్రిని కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు గ‌గ్గోలు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page