- నిజం చేసిన ఆల్విన్, ప్రాగా టూల్స్, మల్లేపల్లి ఐటిఐ
- కాకతీయ కలగూర గంప – 6
1960 దశకం చివరి వరకు భారతదేశం పారిశ్రామిక ప్రగతిలో శైశవ దశ నుండి 16 యేండ్ల బాల్య దశ కు చేరుకొని ఉరుకులు పరుగుల వేగంతో వివిధ రంగాల ప్రజల అవసరాలను తీర్చి వారిని అభివృద్ధి మార్గంలో పయనించేట్లు దోహదపడసాగింది. ఉదాహరణకు బి.హెచ్. ఈ ఎల్ సంస్థ 1964 లో ఏర్పడి 1972 వచ్చే సరికి అప్పటి గరిష్ఠ స్థాయి 110 ఎండబ్ల్యూ ల పవర్ యూనిట్లు తయారు చేసి నెలకొల్పి పనిచేయించ గలిగింది. తెలంగాణ లోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌లో 1964-1966 లో జపాన్ హిటాచీ సంస్థ 60 ఎండబ్ల్యూ (4 యూనిట్లు) నెలకొల్పితే, బి.హెచ్.ఈ ఎల్ 1974-76 లో 110 ఎండబ్ల్యూ (2 యూనిట్లు), 1976 -79 లో 120 ఎండబ్ల్యూ ( మరో 2 యూనిట్లు) నెలకొల్పగలిగింది. 1980 వచ్చేసరికి దాని ఒక యూనిట్ సామర్థ్యత 200 ఎండబ్ల్యూ, 1984 వరకు 500 ఎండబ్ల్యూ తయారుచేసే స్థాయికి ఎదిగింది. ఐతే పైన తెలిపిన బి.హెచ్.ఈఎల్ విజయం కంటే కూడా ఆశ్చర్యకర నైపుణ్యత 1950 ల లోనే చూపించాయి అప్పుడెప్పుడో 1940 లలో అప్పటి హైదరాబాద్ లో నెలకొల్పిన రెండు గొప్ప పారిశ్రామిక సంస్థలు.
వాటి విజయం ఎంతో గొప్పది. అవి- ఆల్విన్ సంస్థ (1942), ప్రాగాటూల్స్ సంస్థ (1943). ఈ రెండూ కూడా తయారీ పరిశ్రమకు నిర్వచనాలు. డ్రిల్లింగ్ యంత్రాలు, లేత్ మెషిన్, మిల్లింగ్ మెషిన్ మొదలగు వివిధ తయారీ యంత్రాలు తయారు చేసి వివిధ చిన్నా, పెద్దా వర్క్ షాప్ యజమానుల సంస్థలకు సప్లై చేయడం వల్ల ఆ సంస్థలు దేశ వివిధ ప్రాంతాల్లో పని చేసి ప్రజల అవసరాలను తీర్చ సాగాయి. ఇవి రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే… ఇక ఆల్విన్ సంస్థ అనేక విధాల ప్రజారంజక వస్తువులను తయారుచేసి మార్కెట్లో పెట్టగలిగింది. 1970 లలో దేశంలోకి ప్రవేశించిన మొట్ట మొదటి స్కూటర్ లలో ఆల్విన్ పుష్పక్ ఒకటి. 1966 లోనే జపాన్. ‘సీకో’ కంపెనీ తో ఒప్పందం కుదుర్చు కొని ఆల్విన్ వాచ్ లు తయారు చేసింది.
ఇక ఆ రోజుల్లోనే తయారు చేసిన ‘ఆల్విన్’ రిఫ్రిజిరేటర్లు చాలా ఫేమస్. ఇక ఆల్విన్ అల్మైరాలు ఎంతో స్ట్రాంగ్ గా మంచి నాణ్యత కలిగివుండేవి. ఈ విధంగా అత్యంత నాణ్యతకు ఆల్విన్ సూచిక గా వుండేది. ఈ సంస్థ ప్రత్యేకంగా బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ను కలిగియుండి రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్ టిసి) బస్సుల బాడీ ఇక్కడే తయారయ్యేది. 1984 లో జపాన్ సంస్థ ‘‘నిస్సాన్’’ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకొని ‘ఆల్విన్ నిస్సాన్’ ట్రక్కుల తయారుచేసే సంస్థను జహీరాబాద్ లో ఏర్పరచుకున్నారు. 1943 లో ప్రారంభం ఐన ప్రాగా టూల్స్ సంస్థ 1965 వరకు సి.ఎన్.సి (కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా పనిచేసే) యంత్రాలను తయారు చేసే స్థాయికి ఎదిగింది. అది బహుషా మన దేశంలో మొదటిదేమో! అప్పుడే (1963 లో) ప్రాగా టూల్స్ భారత రక్షణ శాఖ ఆధ్వర్యంకు బదిలీ అయింది. 1986 నుండి హిందుస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్.ఎం.టి) ఆధ్వర్యంలో పనిచేస్తూంది. 1996 లో ప్రాగా టూల్స్ సంస్థ కు ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ- 9001 గుర్తింపు రావడం గమనార్హం.
ఇకపోతే ఆ రోజులలోనే ఈ రెండు సంస్థ లకు సుశిక్షిత కలిగిన అత్యంత నైపుణ్యత కలిగిన కార్మిక శక్తి నిచ్చిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణాసంస్థ మల్లేపల్లి ఐటిఐ.తరువాత క్రమంలో వరంగల్ లో నెలకొల్పిన మరొక ప్రభుత్వ ఐటిఐ. 1950, 60 దశకాలలో ఈ రెండు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఆల్విన్, ప్రాగా టూల్స్ సంస్థలకే కాకుండా రాష్ట్ర రవాణా సంస్థకు, మౌలాలీ, కాజీపేట రైల్వే వర్క్ షాప్ లకు, ఒక్కొక్కటి గా నెలకొల్పబడుతన్న హెచ్.ఎం.టి, బి.హెచ్.ఈ ఎల్, హెచ్.ఏ.ఎల్ మొదలగు అనేక భారీ పరిశ్రమ సంస్థ లకు, ఇంకా 1965 ప్రాంతాల్లో నెలకొల్పబడిన కొత్త గూడెం థర్మల్ పవర్ స్టేషన్కు, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎలక్ట్రిసిటీ బోర్డు) కు, వివిధ యితర అనేక ప్రభుత్వ, ప్రైవేట్సాం కేతిక సంస్థలకు సుశిక్షిత విద్యార్హత కలిగిన యువశక్తి నందించాయి.
ఇదే సమయంలో 1956లో సమైక్య రాష్ట్ర మేర్పడిరది. అప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పేర్గాంచిన రెండు పారిశ్రామిక శిక్షణా సంస్థలు (కాకినాడ, అనంతపూర్ ఐటిఐలు) కూడా చేరి మొత్తం నాలుగు ఐటిఐలు కలిసి రెండు సునిశిత కండ్లు, రెండు సుశిక్షిత హస్తాలు లాగా మంచి నేర్పరులను అప్పుడప్పుడే నెల కొల్పు తున్న భారీ పరిశ్రమల కందించాయి. తర్వాత ఏర్పడిన ముషీరాబాద్ ఐటిఐ, నిజామాబాద్, మహబూబ్ నగర్ ల లోని ఐటిఐల విద్యార్థులు కూడా అలనాటి ‘మేడ్ యిన్ హైదరాబాద్’తీపి గుర్తులే! ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి..1958 ప్రాంతాల్లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో జూనియర్ టెక్నికల్ స్కూళ్లను (జెటి ఎస్ లను) ప్రారంభించింది.
ఇది 7 వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల కొరకు. 3 సంవత్సరాల కోర్స్. అంటే మిడిల్ స్కూల్ పూర్తయిన తరువాత 8, 9, 10 తరగతుల చదువు లాగా. జెటి ఎస్ పాస్ ఐన విద్యార్థి ఐటిఐ పాస్ ఐన విద్యార్థి లాగా ప్రాక్టికల్ నైపుణ్యత కలిగి వుండడమే కాకుండ మ్యాథ్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ థియరీ సబ్జెక్టులలో తగిన విషయ పరిజ్ఞానం కలిగి వుండేవాడు. మొత్తానికి వీరందరు కలిసి ఆ రోజుల్లోనే ‘‘మేడ్ యిన్ హైదరాబాద్’’ ట్రెండ్ సృష్టించారు. అంటే ‘మేడ్ యిన్ చైనా’ నోట్లో వేలు పెట్టుకొని ఉయ్యాలలో పడుకొని శైశవ దశలో ఊగుతుండే ఆ కాలపు 1950, 60 దశాలల్లలోనే మన ‘ మేడ్ యిన్ హైదరాబాద్’’ యువక రక్తంతో పరుగులు తీయడం గొప్ప విశేషమే కదా!
-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
-పాములపర్తి నిరంజన్ రావు