- అబద్దాల పోటీలో నెంబర్ వన్‌గా ప్రధాని మోదీ
- రైతు రుణమాఫీకి రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం..
- కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
షోలాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ఛత్రపతి శివాజీ, జ్యోతి బాపూలే.. బీఆర్ అంబేడ్కర్.. బాలా సాహెబ్.. శరద్ పవార్ వంటి యోధులు పుట్టిన ఈ నేలలో ఇప్పుడు ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్, అశోక్ చవాన్ వంటి విద్రోహులు తయారయ్యారని.. వారు గుజరాత్ గులాంలుగా మారారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నయాగామ్, భోకర్, నాందేడ్ ప్రచార సభల్లో ఆయన ఆదివారం ప్రసంగించారు. సోలాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబర్ వన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలుస్తారని ముఖ్యమంత్రి విమర్శించారు. ఆటో డ్రైవర్‌గా ఉన్న ఏక్‌నాథ్ శిందేను మంత్రి వరకు బాలాసాహెబ్ కుటుంబం తీసుకువొచ్చిందని.. సొంత కుమార్తెను కాదని అజిత్ పవార్‌ను శరద్ పవార్ ఉప ముఖ్యమంత్రి చేశారని.. అశోక్ చవాన్… ఆయన తండ్రి శంకర్ రావు చౌహాన్‌ను కాంగ్రెస్ పార్టీ.. గాంధీ కుటుంబం ముఖ్యమంత్రులుగా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేలను అవమానాలపాలు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ.18 వేల కోట్లను రైతుల రుణమాఫీకి వారి ఖాతాల్లో వేసిందని తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండర్.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న నయాగామ్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మీనల్ పాటిల్ ఖత్‌గావ్‌కర్, భోకర్ అభ్యర్థి తిరుపతి కదమ్ కొందేకర్, దక్షిణ సోలాపూర్ అభ్యర్థి చేతన్ నరొటే, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌహాన్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కౌంటర్
కాంగ్రెస్ మోడల్ దేశానికి తెలిస్తే గుజరాత్ మోడల్ విఫలమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 వేల మందిని తరలించిన గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్‌కు చప్పట్లు కొట్టి అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో మాత్రం మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి గుజరాత్‌కు గులాంగా మారారని.. మహారాష్ట్రకు ఏక్ నాథ్ శిందే, అజిత్ పవార్ ఎలా విరోధులుగా మారారో కిషన్ రెడ్డి తెలంగాణలో అలా తయారయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ మండిపడ్డారు.. గంగా నది ప్రక్షాళన, సబర్మతీ రివర్ ఫ్రంట్ కిషన్ రెడ్డికి గొప్పగా కనిపిస్తోందని.. అదే వ్యక్తి మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు..బీజేపీ నేతలు ఏం చేసినా తాము మూసీ పునరుజ్జీవనాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు…