మ‌హారాష్ట్ర‌ ఎన్నికల్లో మోస‌పూరిత బీజేపీని ఓడించండి : సీఎం రేవంత్ రెడ్డి

  • ఈ రాష్ట్రానికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్ కు త‌ర‌లించారు.
  • దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బిజెపి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు..
  • ముంబై ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముంబై, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 9 : మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు వొచ్చే ఎన్నిక‌ల్లో మోస‌పూరిత బిజేపీ పార్టీని ఓడించి తగిన గుణ‌పాఠం చెప్పాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నార‌ని, ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని విమ‌ర్శించారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామ‌న్నారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శ‌నివారం ముంబైలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై మహారాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడానికి ఇక్కడకు వొచ్చాన‌ని తెలిపారు. దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయ‌న్నారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారని విమ‌ర్శించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామ‌ని, ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామ‌ని తెలిపారు.ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామ‌ని, ఆ తర్వాత‌ ఆయన తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామ‌ని, మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నామ‌ని, ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారని, వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నామ‌ని చెప్పారు. 1కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారని, ఇందు కోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింద‌ని తెలిపారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామ‌ని, 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేశామ‌ని తెలిపారు.

దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంద‌ని, దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చింద‌ని తెలిపారు.మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెస్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారని కొనియాడారు.ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదని అన్నారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్ కు తర‌లించుకొని పోయార‌ని, మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page