మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాఢీ(ఎమ్వీఏ) కూటములు ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ‘మహా’సంగ్రామంపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో పోటాపోటీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికారపగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని తేలింది.
288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145. పీపుల్స్పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 182 (175 -195) సీట్లు, ఎమ్వీఏ కూటమికి 97(85 -112) సీట్లు, ఇతరులుకు 9 (7 -12) సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్దగా అవతరించే అవకాశాలున్నాట్టు పీపుల్పల్స్ ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. బీజేపీ 113(102 నుండి 120) స్థానాలు, శివసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ 52 (42 నుండి 61) స్థానాలు, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ 17(14 నుండి 25) స్థానాలు, కాంగ్రెస్ 35(24 నుండి 44) స్థానాలు, శివసేన (యూబీటీ) 27(21 నుండి 36) స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 35 (28 నుండి 41) స్థానాలు, ఇతరులు 9 (6 నుండి 12) స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి.