- హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం
- మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు
- అధికారంలోకి రాగానే అమలులోకి
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.) విజయ దుందుభి మోగించ నుందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర లోని మరట్వాడ జిల్లాలకు ఏ.ఐ.సి.సి పరిశీలకుడిగా నియమితులైన ఆయన బుధవారం రోజున జాల్నా ,పూలాంబ్రీ తదితర నియోజకవర్గలలో కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే ధ్యేయంగా పెట్టుకుందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలో కుడా జరిగింది అదే నని అందుకు రేపటి ఎన్నికల్లో బిజెపి, (షిండే) శివసేన, (అజిత్ పవార్) ఎన్.సి.పి కూటమి మట్టి కొట్టుకపోతుందని ఆయన దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలు ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు.
రాష్ట్రంలోనీ 48 లోకసభ స్థానాలకు గాను 31 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలోని మహారాష్ట్ర వికాస అఘాడి సాధించిన విజయపరంపర ఈ ఎన్నికల్లోనూ కొనసాహుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆ వ్యతిరేకత బిజెపి, శిండే, అజిత్ పవార్ వెల కూటమి పై గూడు కట్టుకపోయిందన్నారు. ఆ వ్యతిరేఖత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కుల జన గణనపై చర్చ జరగడమే కాదు, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రం తెలంగాణ లో ఇప్పటికే గణన మొదలు పెట్టినా ప్రధాని మోడీ నోరు మెదపక పోవడంలో ఔంతర్యం ఏమిటో తేల్చిచెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు పరచడంతో పాటు అప్పటికప్పుడు ప్రజా ప్రయోజనార్దం హామీలు ఇవ్వక పోయినా అభివృద్ధి, సంక్షేమం లకు పెద్ద పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కి ఉందన్నారు. మహారాష్ట్ర ప్రజల కోసం ఏ. ఐ. సి.సి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందే తడవుగా అమలు చేస్తామని ఆయన భరోసా నిచ్చారు. హీమాచల్ ప్రదేశ్,కర్ణాటక, తెలంగాణా లలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలులోకి వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
మహారాష్ట్రలో అధికారంలోకి రానున్న కాంగ్రెస్ పార్టీ కూటమి మహిళలకు నెలసరి ఆర్థిక సహాయం కింద 3,000,మహాలక్ష్మి యోజన పథకం అమ్మాయిలకు ఉచిత బస్ ప్రయాణం,రైతులకు 3 లక్షల వరకు ఋణమాఫీ,సాధారణ రుణ చెల్లింపులకు 50,000 వేల బోనస్,25 లక్షల వరకు ఆరోగ్య భీమా,ఉచిత మందులు నిరుద్యోగ యువతకు నెల ఒక్కింటికి 4,000 రూపాయల హామీని తప్పక అమలు పరుస్తామన్నారు.