‌మొన్నటి ఎన్నికలు సెమీఫైనలే.. ముందున్న ఫైనల్స్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ ‌పార్టీని ముందుకు..
రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం..
వొచ్చే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన
రూ.2 లక్షల రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం..  
మా కార్యకర్తల జోలికివస్తే ఊరుకోం..  
గాంధీభవన్‌ ‌కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి
టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని, 27 జూన్‌ 2021‌న తనను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించారని, 7 జూలై 2021న తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని, రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశామని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహేష్‌ ‌గౌడ్‌ ‌తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమని అన్నారు. రూ.18 వేల కోట్లు 23 లక్షల రైతుల ఖాతాల్లో వేసి…వ్యవసాయం పండగ అని నిరూపించామని, ఇదీ కాంగ్రెస్‌ ‌పార్టీ నిబద్ధత అని, సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, మార్పు కావాలంటే కాంగ్రెస్‌ ‌రావాలనే నినాదంతో ఒకవైపు తాను, మరో వైపు భట్టి విక్రమార్క పల్లె పల్లెనా పాదయాత్ర చేశామని తెలిపారు.

ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చిందని, అధికారంలోకి వొచ్చిన 48 గంటల్లోనే మొదటి రెండు గ్యారెంటీలను అమలు చేశామని,  ఇప్పటివరకు 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అం‌దిస్తూ పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. రూ.500లకే గ్యాస్‌ ‌సిలిండర్‌ అం‌దించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామని ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందం చూశామని తెలిపారు.  పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్‌ ‌రావు సవాల్‌ ‌విసిరారని, రాజీనామా చేస్తానని చెప్పిన ఆ సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడంటూ ప్రశ్నించారు. రాబోయే పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని, కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఉద్యోగాలు ఊడగొడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వొస్తాయని పాదయాత్రలో చెప్పామని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరిన్ని ఉద్యోగాల భర్తీ పక్రియ కొనసాగుతుందని సిఎం ఈ సందర్భంగా తెలిపారు.

నిరుద్యోగులకు నైపుణ్యం అందించేందుకు యంగ్‌ ఇం‌డియా స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని, వొచ్చే ఒలింపిక్స్ ‌లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీక్ష పూనిందని, త్వరలో తెలంగాణలో స్పోర్టస్ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, 2028లో ఒలింపిక్స్‌లో దేశం తరపున బంగారు పథకాలు సాధించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ముచ్చెర్లలో ఫోర్త్ ‌సిటీ..ఫ్యూచర్‌ ‌సిటీని అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాలని రేవంథ్‌ ‌పిలుపునిచ్చారు. ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలంటే పూర్తి సమయాన్ని కేటాయించే పార్టీ అధ్యక్షుడు ఉండాలని అధిష్టానాన్ని కోరామని తెలిపారు.

మొన్నటి ఎన్నికల్లో గెలుపు సెమీ ఫైనల్స్ ‌మాత్రమేనని, 2029లో ఫైనల్స్ ఉన్నాయని, దిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసి రాహుల్‌ను ప్రధానిని చేసినప్పుడే ఫైనల్స్ ‌గెలిచినట్లని సిఎం రేవంత్‌ ‌స్పష్టం చేశారు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌ ‌దే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 పార్లమెంట్‌ ‌స్థానాలు గెలిస్తేనే తాము ఫైనల్స్ ‌గెలిచినట్టని, అప్పటి వరకు ఎవరూ విశ్రమించొద్దని పార్టీ నాయకులకు, క్యాడర్‌కు పిలుపునిచ్చారు. నిన్నమొన్న కార్యకర్తలపై దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని, తమ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, ఎవరైనా తమ మంచి తనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు చేస్తామని రేవంత్‌ ‌హెచ్చరించారు. మహేష్‌ ‌గౌడ్‌ ‌సౌమ్యుడని అనుకోవద్దని, తాను ఆయన వెనకాలే ఉన్నానని రేవంత్‌ అన్నారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత తమ నాయకులపై ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలకు తమ ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page