మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ
వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీవోను జారీ చేసింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి అవసరం ఉంది. అందులో 253 ఎకరాల భూమిలో కొంత రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది.
వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు కార్యరూపం దాల్చుతుంది. ఇప్పటికే సచివాలయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో మంత్రులు సమావేశమైన సంగతి విదితిమే. ఆ సమావేశం తర్వాత పనుల్లో కదిలిక ఏర్పడింది. జీఎంఆర్ నిబంధనల సడలింపుతో…శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యత తీసుకున్న జీఎంఆర్ విధించిన 150 కిలో మీటర్ల దూరంలోపల మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదన్న నిబంధన సడలించడంతో మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకి తొలిగిపోయింది.