తుదిదశకు మావోయిస్టు తీవ్రవాదం

ఛత్తీస్‌గఢ్‌ ‌విజయం అందరికీ ప్రేరణ
తీవ్రవాదం అంతానికి కలిసి పనిచేద్దాం..
ఆయుధాలు వొదిలేసిన 13 వేల మందికి పైగా మావోయిస్టులు
గిరిజనులకు అభివృద్ది పథకాలు చేర్చాలన్నదే లక్ష్యం
మావోయిస్ట్ ‌ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా

న్యూదిల్లీ, అక్టోబర్ 7: ‌మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలిపారు. అమిత్‌ ‌షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు దిల్లీలోని విజ్ఞాన్‌ ‌భవన్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరింద‌ని, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింద‌ని తెలిపారు. . ఇప్పటివరకు 13 వేల మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వొదిలేశారని,  2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందగా.. 723 మంది లొంగిపోయారు. భవిష్యత్‌లో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకెళ్లాలి. ఛత్తీస్‌గఢ్‌ ‌విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. అక్కడ కొందరు మావోయిస్టులు లొంగిపోయారని అమిత్‌ ‌షా పేర్కొన్నారు. మావోయిస్టు రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ ‌సీఎం, డీజీపీని ఆయన అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

పదేళ్లలో మోదీ సర్కార్‌ ‌చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ‘పదేళ్లలో 11,500 కిలోటర్ల మేర రోడ్‌ ‌నెట్‌వర్క్‌తో పాటు 15,300 సెల్‌ఫోన్‌ ‌టవర్లను ఏర్పాటుచేశాం. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుచేశాం. గతంలో హింసాత్మక ఘటనలు 16,400కు పైగా జరిగాయి. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు 7,700లకు తగ్గాయని వెల్లడించారు. పౌరులు, భద్రతా బలగాల మరణాలు 70 శాతం తగ్గాయి. హింస ప్రభావిత జిల్లాలు 96 నుంచి 42కు తగ్గాయి. హింసాత్మక ఘటనలు నమోదయ్యే పోలీస్ స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అమిత్‌ ‌షా పేర్కొన్నారు. హింస మార్గంలో ఏం సాధించలేమని.. జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హింస మార్గాన్ని వీడే మావోయిస్టుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి రావాలని మావోయిస్టుల కు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా సూచించారు. ఈ సమావేశంలో 2023, మార్చి 31వ తేదీ నాటికి దేశంలో మావోయిజం అంతం, అర్బన్‌ ‌మావోయిస్టుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా మాట్లాడుతూ.. మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయడంతో పాటు పోలీస్‌ ‌సామర్ద్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌మహారాష్ట్ర చాలా బాగా పనిచేశాయని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వికసిత భారత్‌ ‌లక్ష్యంగా పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే వికసిత భారత్‌ ‌సాధించాలంటే గిరిజనులు, ఆదివాసీలు సైతం అందులో భాగస్వామ్యం కావాలన్నారు. కానీ ప్రభుత్వ ఫలాలు గిరిజనులు, ఆదివాసీలకు అందకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా మండిపడ్డారు. రహదారులు, టవర్లు, చివరకు విద్య, వైద్యం సైతం వీరికి చేరనివ్వడం లేదన్నారు. అయితే గత కొన్నేళ్లుగా మావోయిస్టు సమస్యను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కార్‌ ‌గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు.

2022లో తొలి సారి మావోయిస్టు హింస కారణంగా జరిగిన మరణాల సంఖ్య 100 కంటే తక్కువ నమోదయిందని వివరించారు. అలాగే మావోయిస్టుల ప్రభావిత గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ ఫలాలు, పథకాలు సైతం వేగంగా చేరుతున్నాయని తెలిపారు. మావోయిస్టుల సమస్యను అధిగమించేందుకు బహుముఖ వ్యూహాన్ని సైతం అమలు చేస్తున్నామన్నారు. దీంతో ఈ సమస్యను చాలా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల పోలీస్‌ ‌విభాగాలు సైతం చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. ఇక ఎన్‌కౌంటర్‌లలో గాయపడిన భద్రత బలగాలను త్వరితగతిన వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్‌ ‌సేవలను వినియోగిస్తున్నామని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదంపై పైచేయి సాధించామని హోం మంత్రి అమిత్‌ ‌షా ఈ సందర్భంగా వివరించారు. ఈ సక్షా సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ‌నుంచి హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతోపాటు డీజీపీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే జార్ఖండ్‌, ‌బిహార్‌, ‌మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ‌మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

మరోవైపు భవిష్యత్తులో వామపక్ష తీవ్రవాదం దేశానికి ముప్పుగా పరిణమిస్తుందని కేంద్రంలోని మోదీ సర్కార్‌ ‌భావిస్తుంది. ఆ క్రమంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుక చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో దశాబ్దాల క్రితం నేపాల్‌ ‌నుంచి ఆంధ్రప్రదేశ్‌ ‌వరకు పశుపతి టూ తిరుపతి కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు మావోయిస్టులు ఉపక్రమించారు. అయితే దీనిని సైతం మోదీ సర్కార్‌ ‌ధ్వంసం చేసిన విషయాన్ని ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు సెప్టెంబర్‌ 21 ‌నుంచి అక్టోబర్‌ 20‌వ తేదీ వరకు మావోయిస్టులు వార్షికోత్సవాలు జరపాలంటూ కేడర్‌కు పిలుపు నిచ్చింది. అలాంటి వేళ.. ఛత్తీస్‌గఢ్‌లో శనివారం భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 35 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు భద్రత దళాలు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దు రాష్ట్రాల్లోకి వెళ్లకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకున్నాయి. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ ‌సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఇక దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ఆపరేషన్‌ ‌కగార్‌ ‌చేపట్టిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page