- అటవీ ప్రాంతంలో వాగులు దాటేందుకు పడవల కొనుగోలు
- తెలంగాణ నుంచి ఛత్తీస్‌గడ్‌కు పడవలు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
- డీసీఎం వ్యాన్ ద్వారా అడవిలోకి తరలించే యత్నం
- పడవలతో సహా డీసీఎం, రెండు ట్రాక్టర్లు పేలుడు పదార్థాల స్వాధీనం
భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : అటవీ ప్రాంతంలో సంచరించే మావోయిస్టులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలో వాగులు, వంకలు దాటి ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో కొన్ని పడవలను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టారు. పడవలను డీసీఎం వ్యాన్‌లో తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు.
పడవలతో సహా డీసెం వాహనం, రెండు ట్రాక్టర్లు, రెండు బైక్ లు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ శంఖ్వార్ వెల్లడించారు. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గడ్ కు ఈ పడవలను తరలిస్తున్న నలుగురు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై చర్ల పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు.
చర్ల సీఐ రాజువర్మ పర్యవేక్షణలో చర్ల స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు, 141 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ జవాన్లు, సంయుక్తంగా చింతగుప్ప, బోదనెల్లి గ్రామాల సమీపంలో ఏరియా తనిఖీలు చేస్తుండగా చింతకుప్ప జామాయిల్ తోట వద్ద కొంతమంది పోలీసులను చూసి పారిపోయే చేశారు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
విచారణలో మావోయిస్టు పార్టీకి గత కొంతకాలంగా మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు తెలిపారని ఏఎస్పీ చెప్పారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పామేడు, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జారిపల్లి, నిమ్మలగూడేనికి చెందిన వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న డీసీఎం వాహనం రెండు పడవలను, ట్రాక్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.