పేద ప్రజానీకానికి మెరుగైన జీవన శైలి అందిస్తాం
మూసీ అభివృద్ధికి అందరూ సహకరించాలి
మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం శంషాబాద్ పట్టణంలో నూతనంగా దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజానీకానికి మెరుగైన జీవన శైలి అందిస్తామని, చదువుకున్న పిల్లలకు రాబోయే కాలంలో స్కిల్ యూనివర్సిటీ ద్వారా వారి నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళలకు మెప్మాతోపాటు ఇతర గ్రూప్‌లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు కోసం వారికి స్థలం కూడా ప్రభుత్వమే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయంగా ఇండ్లు ఇప్పించడంతో పాటు వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, మూసీ ప్రక్షాళనకు అందరూ కృషి చేయాలని, ఈ మూసీ నదిలో స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా, మూసీ ఇరువైపులా సుందరీరించేందుకు అందరూ సహకరించాలని తెలిపారు.
11 నెలల్లో మున్సిపల్ కార్యాలయ నూతన భవనం నిర్మించిన కార్యాలయ భవనాన్ని తానే ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బండి గోపాల్ యాదవ్, టీయూఎఫ్‌ఐసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, ఆర్డీఓ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.