దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంత‌ర పోరాటం

  • బీఆర్ఎస్ నేతలు ఈ పది ప్రశ్నలకు స‌మాధానం ఇవ్వండి
  • ఐటీ. ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స‌వాల్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుప‌ర‌చ‌డానికి కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే నిరంతరం పోరాటం సాగిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షం స్థానానికి పరిమితమైనా పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసింది, మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ మంగళవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో కారు పార్టీ పెద్దలకు ఆయన పది ప్రశ్నలు సంధించారు. మలిదశ తెలంగాణ‌ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది విద్యార్థులు, యువకుల కుటుంబాలను బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు విస్మరించారో స‌మాధానం చెప్పాల‌న్నారు.

2014 జూన్ 14న ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో 1200 బలిదానాలు జరిగినట్టు కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేకసార్లు మాట మార్చి అమరుల సంఖ్యను 585 కు కుదిస్తూ వేర్వేరు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మిగిలిన 615 మంది ఏమై పోయారో పదేళ్ల విధ్వంస పాలనలో ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా అని శ్రీధ‌ర్ బాబు ప్ర‌శ్నించారు. ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, గృహ వసతి, సాగు భూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తామని ఎన్నో హామీలిచ్చారు. చివరకు కొద్ది మందికి నగదు, ఉద్యోగాలిచ్చినా మిగిలిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. బిడ్డలను, కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబాల గురించి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు అని మంత్రి నిల‌దీశారు.

అధికారంలోకి వొస్తే దళితుడిని ముఖ్యమంత్రి ప‌ద‌వి, దళిత కుటుంబాలకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి నీటి మూట అయింది వాస్తవం కాదా? అని అన్నారు. తెలంగాణ తల్లిగా సోనియమ్మను పొగిడిన నోళ్లతోనే మీరు ఆ కుటుంబాన్ని కించపరుస్తున్న విషయం ప్రజలకు తెలుసున‌ని అన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నది ఎవరు? మాట తప్పింది ఎవరు? అని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వొచ్చిన వెంటనే నిరుద్యోగం అనేది ఉండదని ఆశలు కల్పించి చివ‌ర‌కు మోసగించింది మీరు కాదా అని మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్ర‌శ్నించారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ లీకయైనా సమర్థించుకున్నార‌ని, నోటిఫికేషన్ విడుదల చేసిన మూడేళ్లలో సరిగ్గా పరీక్షలు నిర్వహించలేని అసమర్థత ఎవరిది? న్యాయస్థానాల జోక్యంతో పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితికి బీఆర్ఎస్ నేత‌లు బాధ్యలు కాదా ? అని మంత్రి ప్ర‌శ్నించారు.

ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి పదేళ్లలో మీరు కట్టింది ఎన్ని? పంపిణీ చేసింది ఎన్నో గుండెపై చేయివేసుకుని చెప్పగలరా ? కేజీ టు పీజీ విద్య హామీ అసలు మీకు గుర్తుందా అని మంత్రి శ్రీధ‌ర్ బాబు నిల‌దీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లోని 16,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని నమ్మబలికారని,మరి లక్ష ఎకరాలైనా సాగులోకి వచ్చిందా? అని ప్ర‌శ్నించారు. మేం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. మా అధినేత రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికీ వొచ్చి వెళ్లారు. మరి జనం మధ్యకు వెళ్లంది మీరా, మేమా? అధికారం కోల్పోయాక ఇంటికే పరిమితమై బయటకు రానిది మీ పార్టీ అధినేత కాదా? రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడితే పెద్దోళ్లమై పోతామని భ్రమ పడుతున్నార‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు విమ‌ర్శించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page