- 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం
- యావత్ భారత దేశంలోనే ఇంత దిగుబడి ఇదే ప్రథమం
- 10 నెలల్లో 11,537.40 కోట్ల రుణభారం తగ్గింపు
- దాన్యంకొనుగోలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- రైతులను ఆందోళన పరచకండి
- మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : వరి దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారత దేశంలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి వొచ్చిన సందర్భం ముందెన్నడూ లేదని ఆయన స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పౌర సరఫరాల ముఖ్య కార్యదర్శి డి. యస్.చౌహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 150 లక్షల ధాన్యం దిగుబడి ఉండవొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. 60.80 లక్షల ఎకరాల్లో ప్రభుత్వం అంచనా వేస్తున్న దిగుబడిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు.అందులో 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలుగా, 44 లక్షలు దొడ్డు రకం ఉంటాయన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్ గా క్వింటా ఒక్కింటికి రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపరన్నారు. దిగుబడిలో సన్నాలు 47 లక్షల అంచనాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ మొత్తం కొనుగోలుకు గాను రూ.30 వేల కోట్లు అవుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 20 వేల కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అదనంగా నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నమన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో రైతులు అయోమయంలో పడకుండా ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కలిపించాలని సూచించారు. అత్యధికంగా రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి ఆయిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అనేది ప్రభుత్వానికి పరీక్షా కాలమని ఇందులో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రభుత్వానికి ఎక్కడా కుడా అప్రతిష్ట రాకుండా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రతినిధులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు తెలంగాణ బియ్యానికి బీహార్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని తెలిపారు. రెండుమూడు బయటి దేశాలు కుడా తెలంగాణా బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలులో తాలు, తరుగుదల లేకుండా కొనుగోలు చేస్తున్నామన్నారు.
తేమ శాతంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రకృతి విపత్తులతో అవాంతరాలు సంభవించిన పక్షంలో అధిగమించేందుకు అధికారులనూ సన్నద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ఉద్బోధించారు. రైస్ మిల్లుల పరిశ్రమకు ప్రభుత్వం చేయుతనిస్తుందన్నారు. సియంఆర్ బియ్యం మిల్లింగ్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సన్నాలకు 10 నుంచి 50 రూపాయలకు, దొడ్డు రకానికి 10 నుంచి 40 రూపాయలకు పెంచామన్నారు. నిబంధనల మేరకే బ్యాంక్ గ్యారెంటీ పెట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాకుండా కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,537.40 కోట్ల రుణభారాన్ని తగ్గించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.