పండుగపూట ఉద్యోగుల ఉసురుపోసుకుంటావా..?

  • మూసీ కోసం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు… వృద్ధులకు రూ.2వేల పెన్షన్‌ ఎందుకియ్యవూ…?
  • రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు
  • హైడ్రాతో హైదరాబాద్‌ కల తప్పింది…అవీనితి అదుపు తప్పింది…
  • కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గొల్డెన్‌ గ్యారంటీ అన్నడు..అది గోల్‌మాల్‌, గోబెల్స్‌ గ్యారంటీ
  • సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు

పండుగపూట ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఉద్యోగుల ఉసురు పోసుకుంటుందని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో రేవంత్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మంగళవారం సాయంత్రం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ…రాష్ట్రంలో పండుగలను ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా జరుపుకోవల్సిన పండుగలను సరైన వేళకు వేతనాలు రాకపోవడంతో బాధపడుతూ, ప్రజలు ఇబ్బందితో పండుగలను జరుపుకోవల్సిన పరిస్థితిని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వల్ల వొచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, పార్ట్‌టైం లెక్చరర్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రతినెలా ఒకటవ తేదీన వేతనాలు ఇస్తున్నామనీ ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో జరగడం లేదన్నారు.

పోలీసుల పది నెలల సరెండర్‌ లీవ్‌ డబ్బులు ఇవ్వలేదనీ, ప్రతి నెలా హోంగార్డులకు వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నారన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండగ మహిళలకు అతి పెద్ద పండగ అని…ఆర్పీలకు మూడు నెలలుగా వేతనాలు లేక పండుగను సంతోషంగా జరపడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు మార్చి నెల నుండి రాక ఇబ్బంది పడుతున్నారనీ, గాంధీ, ఉస్మానియా సిబ్బందికి వేతనాలు రాలేదనీ, పండగపూట కూడా వేతనాలు ఇయ్యక ప్రభుత్వ ఉద్యోగుల ఉసురు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోసుకుంటుందన్నారు.ఐదు నెలల కాలంలో మూడు ఆసరా పెన్షన్లు మాత్రమే వొచ్చాయి అని, ఇంకా రెండు నెలల బాకీ పడిరదన్నారు. హైదరాబాద్‌లో మూసీ నదీ ప్రక్షాళన పేరుతో లక్షా 50వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రేవంత్‌రెడ్డి 2వేల రూపాయల పెన్షన్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వృద్ధుల మీద వితంతుల మీద రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇంత ఎందుకు వివక్ష ఎందుకు అని అడిగారు. బకాయి పడ్డ రెండు నెలల పెన్షన్‌ విడుదల చేయాలని డిమాండు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో హైదరాబాద్‌ కల తప్పిందనీ..అవినీతి అదుపు తప్పిందనీ, పరిపాలన కూడా అదుపు తప్పిందనీ, గాడి తప్పిందన్నారు.

హైడ్రా వల్ల హైదరాబాద్‌ కల తప్పిందనీ, రాజకీయ భాష కట్టు తప్పిందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ కుదేలైందనీ, మొత్తంగా తెలంగాణ బతుకు బండి పట్టాలు తప్పిందనీ, అనేకమంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసాన్ని యువత కుటుంబ సభ్యులకు వివరించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందనీ, 4వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. పంటలు చేతికి వొచ్చిన పంట పెట్టుబడి సహాయం అందలేదనీ, అన్ని పంటలకు బోనస్‌ అన్నారనీ, కాంగ్రెస్‌ బోగస్‌ మాటలను చర్చించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కాంగ్రెస్‌ వొచ్చాక బాగా పెరిగాయనీ, కాంగ్రెస్‌ వొచ్చాక బియ్యంకు రెక్కలు వొచ్చాయన్నారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గోల్డెన్‌ గ్యారంటీ అన్నాడనీ, అది గ్యారంటీ కాదనీ గోల్‌మాల్‌ గ్లోబల్స్‌ గ్యారంటీ అన్నారు. దిగిపోయిన ప్రజా ప్రతినిధుల జీతాలు ఇవ్వలేదనీ, చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత క్రమంలో బిల్లులు విడుదల చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వ దవాఖానలలో చిన్న మందులు కూడా దొరకడం లేదనీ, ఎస్‌సి, ఎస్‌టి హాస్టల్‌ విద్యార్థులు నీళ్లతో అన్నం తింటున్నారనీ, రేవంత్‌రెడ్డి పాలనతో రాష్ట్రంలోని ఏ వర్గమూ సంతోషంగా లేదనీ, కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరిని గ్రామాలలో యువత చర్చించాలని ఎమ్మెల్యే హరీష్‌రావు కోరారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్‌ నాయకులు రాజనర్సు, పూల బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page