ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో బహుళ మార్గాలు

తెలంగాణ  రాజధాని  హైదరాబాద్‌ ఎంతో విస్తరించింది. ఇలా నగరం  విస్తరించడంతో పాటు, శివారు గ్రామాలు అన్నీ కలసిపోతున్నాయి.  దీనికితోడు గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. దీనికితోడు టూ వీలర్‌, కార్లు తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ఉపయోగం పెరుగుతోంది. కరోనా తరవాత సొంత వాహనాల్లో వెళ్లడం అలవాటు చేసుకున్నారు. మెట్రో అందుబాటులోకి వచ్చినా ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడడం లేదు. మరోవైపు హైదరాబాద్‌ నగరం విస్తరించడంతో పాటు, అందుకు మించి అన్నట్లుగా నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతున్నాయి. నగర రోడ్లపై  ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఓ గంటలో గమ్యం చేరుకుంటామన్న భరోసా కలగడం లేదు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యతో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయలేక పోతున్నారు. దీనికితోడు ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ విషయంలో పోలీసులు అలసత్వం కూడా తోడవుతోంది. దీంతో నిత్యం నగర జీవనం దుర్భరంగా మారుతోంది. అంబులెన్సులు కూడా పరుగెత్తలేని పరిస్థితి ఏర్పడిరది.  శని,ఆదివారాల్లో కూడా  ట్రాఫిక్‌ తగ్గడం లేదు. మెహదీపట్నం నుంచి ఐటి కారిడార్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి.  వేలాది ఐటీ కంపెనీలు.. రోజుకు సుమారు 15,20 లక్షల మంది వాహనదారులు రాకపోకలు సాగించే అత్యధిక రద్దీ ప్రాంతం.. కావడంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు కొదువ లేదు. దీనికి చెక్‌ పెట్టడానికి సైబరాబాద్‌ పోలీసులు అనేక కార్యక్రమాలను చేపడుతు న్నారు. తాజాగా ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న, అత్యధికంగా వాహనాల రాకపోకలు సాగించే ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పుడున్న రోడ్లను విస్తరించి, ప్రత్యేకంగా ఫ్రీ లెప్ట్‌ వెల్లడానికి సరిపడా రోడ్లను విస్తరిస్తున్నారు. గచ్చిబౌలి ఐటీ జంక్షన్‌ వద్ద గచ్చిబౌలి పీఏఎస్‌ ఎంట్రెన్స్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌లో పార్కింగ్‌ స్థలాన్ని తొలగించి ఐఐటీ జంక్షన్‌ వరకు అతిపెద్ద రోడ్డుగా విస్తరిస్తున్నారు. దాంతో సైబరాబాద్‌ సీపీ కార్యాలయం, ఓఆర్‌ఆర్‌ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్‌క్రు వెళ్లేవారు ఐఐఐటీ జంక్షన్‌ వద్ద సిగ్నల్‌ కోసం ఆగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక రోడ్డును నిర్మిస్తున్నారు. అంతేకాకుండా హెచ్‌సీయూ నుంచి వచ్చే ట్రాఫిక్‌ ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ఆగకుండా లెప్ట్‌వెళ్లేవారు, నేరుగా వెళ్లేవారు సిగ్నల్‌ కోసం ఆగకుండా, జంక్షన్‌ వద్ద వాహనాలు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లాలనుకునేవారు. ఐఐఐటీ వద్ద లెప్ట్‌ తీసుకొని, స్టేడియం వద్ద యూటర్న్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా రాయదుర్గం నుంచి షేక్‌పేట ఫ్లయ్‌ వోవర్‌ వరకు, ఐకియా నుంచి హైటెక్‌సిటీ వరకు అక్కడి నుంచి మాదాపూర్‌ యశోద ఆస్పత్రి వరకు సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌లు అందించడానికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. బయోడ్కెవర్సిటీ వద్ద సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్‌ ఏర్పాటు చేసి ఎలా సక్సెస్‌ అయ్యారో ముఖ్యమైన జంక్షన్‌ల వద్ద అదే పద్ధతి కొనసాగించడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. మరో కొద్ది  రోజుల్లో సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ జంక్షన్‌లు అందుబాటులోకి వొచ్చే అవకాశం ఉంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణ కు ఇప్పటికే హైరైజ్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ చిన్న ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినా, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు తెలిసేలా కెమెరాలను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పబ్లిక్‌ సేప్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ (పీఎస్‌ ఐవోసీ)కి అనుసంధానం చేశారు.

అక్కడి నుంచి సిబ్బంది ట్రాఫిక్‌ను మానిటరింగ్‌ చేస్తారు. ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ సైతం పరిస్థితిని సవిరీక్షించేలా ఆయన కార్యాలయానికి కనెక్ట్‌ చేశారు. ఇటీవల భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్‌ల ఏర్పాటు సైతం సత్ఫలితాలు ఇస్తాయని, ఎన్నాళ్లుగానో ఉన్న ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌ కష్టాలు తీరిపోతాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూరా సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్‌పాస్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు వైపు 740 విరీటర్ల మేర అతిపెద్ద భూగర్భ మార్గం నిర్మించనున్నారు. దీంతో ఐటీ కారిడార్‌, ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీ చెక్‌పోస్ట్‌ కంటే ముందు ఉండే అండర్‌పాస్‌ నుంచి సిగ్నల్‌ చిక్కులు లేకుండా రాకపోకలు సాగించే వెసులుబాటు కలగనుంది. మూడు లేన్లుగా అండర్‌ పాస్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. అలాగే సిగ్నల్‌ చిక్కులు లేకుండా జంక్షన్ల వారీగా బహుళ మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇలా ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు రకరకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా చేయడం మరో ఎత్తు కావాలి.
 -మారుపాక గోవర్ధన్‌ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page