అమెరికా రాజకీయాల్లో మస్క్ మార్క్ మొదలు కానుంది. ఆయన తనకున్న ఫాలోయింగ్‌తో పాటు ఇతర పద్దతుల ద్వారా ట్రంప్ గెలుపు లక్ష్యంగా పని చేశారని చెప్పవొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను మస్క్ శాసించాడనటం అతిశయోక్తి కాదేమో. ఇప్పుడెక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. మస్క్ ప్రొఫైల్‌లో మాత్రం కొత్త ట్యాగ్ యాడ్ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది. ఈ ఎన్నికలతో కొత్త స్టార్‌గా ఎలాన్ మస్క్ ఆవిర్భవించాడని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పేర్కొనడం విశేషం. అసలు హాఫ్ డెమోక్రట్, హాఫ్ రిపబ్లికన్‌ను అని కొన్నేళ్ల కిందట చెప్పుకొన్న మస్క్ ఇప్పుడు పూర్తిగా ట్రంప్ పక్షం వహించారు. అసలు 2016, 2020 ఎన్నికల్లో డెమోక్రట్ల పక్షానే మస్క్ నిలిచారు. కానీ, బైడెన్ కార్యవర్గంతో ఆయనకు విభేదాల కారణంగా ట్రంప్ వైపు మొగ్గు చూపారు. మస్క్ మొదటి నుంచీ ట్రంప్‌నకు వ్యతిరేకి. 2016 తర్వాత ఒకసారి అధ్యక్షుడిగా ఆయన సరైన వ్యక్తి కాదు అని వ్యాఖ్యానించారు.
2022 మొదట్లో కూడా ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో నిలబడకూడదని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ట్రంప్ పాలనలో నిత్యం చాలా హైడ్రామా ఉంటుందన్నారు. కానీ, మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాక ఇద్దరి మధ్య సంబంధాల్లో మార్పు వచ్చింది. అప్పటికే ట్రంప్‌ను సోషల్ మీడియాలు వెలివేశాయి. ఆ సమయంలో మస్క్ ఆయన్ను ఎక్స్ లోకి తిరిగి ఆహ్వానించారు. ట్రంప్ అకౌంట్‌ను పునరుద్ధరించారు. మస్క్ సాధారణంగా తాను తటస్థంగా ఉంటానని చెబుతుంటారు. కొవిడ్ సమయంలో బైడెన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పరిపాలన తీరు, పాలసీలు కొన్ని మస్క్‌కు నచ్చలేదు. వీటిని అతడు బహిరంగంగానే తప్పు పట్టాడు. దీంతో విభేదాలకు బీజం పడిరది. 2021లో శ్వేతసౌధంలో విద్యుత్తు వాహనాలపై ఓ సదస్సు జరిగింది. దీనికి అమెరికాలోని పెద్ద కంపెనీ టెస్లాను ఆహ్వానించలేదు.
దేశంలో 74శాతం విద్యుత్తు వాహనాలు టెస్లావే. 2021 సెప్టెంబర్ లో మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ పౌర అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టింది. బైడెన్ తప్ప అందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. తాము అనుకున్నది చేయడం సాధ్యం కావడం లేదని మస్క్ ఓ సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో డెమోక్రటిక్ పార్టీ విభజనకారులకు నిలయమని, అది విద్వేష పూరితమైన పార్టీ అని అభివర్ణించారు. అందుకే తాను రిపబ్లికన్ల వైపు మారిపోతున్నట్లు చెప్పారు. అందుకే దేశాన్ని రక్షించేందుకు ట్రంప్‌నకు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. కమలాహారిస్ విజయం సాధిస్తే ఎక్స్‌ను మూసేయిస్తుందని ఆరోపించారు. మస్క్ మొత్తం ఆరు కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఇవి ఆయా రంగాల్లో సృజనాత్మకంగా పనిచేసేవే. ముఖ్యంగా టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ కంపెనీలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది.
ఈనేపథ్యంలో ట్రంప్‌తో ఉన్న సంబంధాలను వాడుకొని కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని ఆయన తగ్గించుకోవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నతరంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ప్రజల్లో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అలాగే ట్రంప్ గెలిస్తే కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సూపర్ సక్సెస్ అయ్యారు. అలాగే ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాట్లాడం కూడా ట్రంప్‌నకు అనుకూలంగా పనిచేశాయి.
-కల్లూరి రామకృష్ణా రెడ్డి