- తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తారా?
- సిఎం రైవంత్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 14: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేయకపోతే ఎక్సైజ్ అధికారులను బదిలీలు చేయడమే కాకుండా, మద్యం అమ్మకాల టార్గెట్‌ను చేయని అధికారులపై చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వడ్లు కొనుగోలు చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీష్‌రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు అనేక కష్టాలు, వ్యయప్రయోసాలకు గురై పండించిన ధాన్యంను వడ్ల కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజుల తరబడి అవుతున్నా కొనడం లేదనీ, సన్న వడ్లను ఇప్పటి వరకు అసలు కొనుగోలే ప్రారంభించలేదన్నారు. కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి రైతులు తెచ్చిన వడ్లను కొనుగోలు చేయని వారిపై చర్యలు తీసుకోలేని సిఎం రేవంత్‌రెడ్డి మద్యం అమ్మకాలు చేయకపోతే ఎక్సైజ్ సూపరింటెండెంట్, సిఐలను ట్రాన్స్‌ఫర్ చేశాడనీ, మద్యం అమ్మకాలు చేయకపోతే చర్యలు తీసుకుంటున్నాడన్నారు. తెలంగాణా ప్రజలను రేవంత్‌రెడ్డి తాగుబోతుల తెలంగాణ చేయలనుకుంటున్నాడన్నారు. ఆడబిడ్డల పుస్తెలు తెంపాలని, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేయాలని అనుకుంటున్నాడనీ, రేవంత్ రెడ్డి ప్రజలకు మద్యం తాగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడనీ, రైతులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదదన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎవరి కోసం పనిచేస్తుందనీ ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా సన్న వడ్లు కొనుగోలు చేయలేదన్నారు.
కాంగ్రెస ప్రభుత్వం సన్న వడ్లకు సున్న.. దొడ్డు వడ్లకు గుండుసున్న పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందనీ, పత్తి, వడ్లు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం గానీ, రైస్ మిల్లుల టైయ్యప్ చేయడం ఆలస్యం కావడం గానీ, డబ్బులు ఆలస్యంగా ఇవ్వడం కారణంగా సగానికి సగం ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్మి నష్టపోయారన్నారు. వడ్లకు 2300 మద్ధతు ధర ఉంటే రైతులు 1900రూపాయలకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రూ.500 వందల బోనస్ బోగస్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక వానకాలం రైతు బంధు వేయలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్ని అడ్డంకులు వొచ్చినా.. అన్నింటిని ఎదుర్కొని రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వడ్లు కొనుగోలు చేయకపోతే అధికారులను ఎవ్వరినీ అడగట్లేదన్నారు. యాసంగికి ముందే రైతులకు రైతుబంధు, రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండు చేశారు. ఎన్నికల మానిఫెస్టోలు చెప్పిన ప్రకారం.. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలి డిమాండ్ చేశారు.
రైతులు అప్పులు తెచ్చి, భార్య మెడలోని బంగారం తాకట్టు పెట్టి మరీ బ్యాంకుల్లో రుణాలు కట్టారనీ, కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి 11 నెలలైనా రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. కానీ, మహరాష్ట్రకు వెళ్లి తెలంగాణలో రైతులకు రూ.500బోనస్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ, ఎక్కడ అది ఇవ్వట్లేదన్నారు. తెలంగాణ రాకముందు సిద్ధిపేట జిల్లాలో 50వేల మెట్రిక్ టెన్నుల ధాన్యాన్ని మాత్రమే ఇక్కడ రైతులు పంటలు పండించే వారనీ, కానీ పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో కాలేశ్వరం నీటితో చెరువులు నింపి, 24గంటల కరెంటు ఇచ్చి, మండలానికి ఓ మార్కెట్ కట్టామనీ, దీంతో రైతులు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ షరతులు లేకుండా పూర్తి రుణమాఫీ చేయాలనీ, రైతుబంధు డబ్బులు వేయాలని బిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక భూములకు విలువ తగ్గిపోయిందనీ, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందనీ, భూములు కొనే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వడ్లు కొనుగులో చేయాలని, మద్ధతు ధర చెల్లించాలని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆయన వెంట నంగునూరు మండల తాజామాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.