‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతి అరెస్ట్.. ‌రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: అ‌క్రమంగా ఆక్రమించిన భూమికి రిజిస్టర్‌ ‌చేసిన సికింద్రాబాద్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ ‌కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపరచగా, 14 రోజుల పాటు రిమాండ్‌ ‌విధించింది. సుభాష్‌ ‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్‌ఎస్‌ ‌నేత పద్మాజా రెడ్డి కబ్జా చేయగా. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో కుత్బుల్లాపూర్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి నకిలీ పత్రాలతో ల్యాండ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌చేయడానికి సహకరించింది. కాగా ఇదే కేసులో ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ ‌చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

తాజాగా ఈ కేసులో జ్యోతిని పోలీసులు అరెస్ట్ ‌చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఓ ఖాలీ స్థలంపై కన్నేసిన కొందరు.. ఏకంగా ఆ స్థల యజమాని మృతి చెందినట్లు నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించారు. సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌సాయంతో రిజిస్ట్రేషన్‌ ‌పూర్తి చేశారు. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్‌ఎస్‌ ‌మహిళా నేత, మరో ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు జ్యోతిని మంగళవారం అరెస్టు చేసి మేడ్చల్‌ ‌కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది.

ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన లెండ్యాల సురేశ్‌కు సుభాష్‌నగర్‌-‌వెంకట్రాద్రినగర్‌లో 200 గజాల స్థలం ఉంది. ఆ స్థలం ఖాలీగా ఉన్నట్లు సుభాష్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ ‌మహిళా నేత పద్మజారెడ్డి, అలియాస్‌ ‌కుత్బుల్లాపూర్‌ ‌పద్మక్క(32) గుర్తించింది. హయత్‌నగర్‌కు చెందిన రేపాక కరుణాకర్‌(34)‌ను సంప్రదించింది. రూ.3.50 లక్షలు చెల్లించి నకిలీపత్రాల తయారీకి ఒప్పందం చేసుకుంది. ఇంటి యజమాని 1992లోనే మృతి చెందినట్లు మరణ ధ్రువపత్రం సృష్టించారు. రవిశంకర్‌ అనే వ్యక్తిని అతడి కుమారుడిగా సృష్టించారు.

ఆధార్‌ ‌కేంద్రం ఆపరేటర్‌గా గగనం నరేంద్ర(25) సహకారంతో హరీశ్‌ అనే వ్యక్తిని రవిశంకర్‌గా చూపించేందుకు నకిలీ పాన్‌కార్డు తయారు చేయించారు. దాంతో ఆధార్‌లో పేరు మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్‌ ‌సబ్‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయం అప్పటి అధికారి జ్యోతి సాయంతో పద్మజారెడ్డి సోదరి నాగిరెడ్డి కోమలకుమారికి ఈ స్థలాన్ని రవిశంకర్‌ ‌విక్రయించినట్లు రిజిస్ట్రేషన్‌ ‌పూర్తి చేయించారు. నిందితుల వద్ద పోలీసులు నకిలీ పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్‌ ‌తదితర పరకరాలను స్వాధీనం చేసుకున్నారు. స్థల యజమాని లెండ్యాల సురేశ్‌ ‌ఫిర్యాదుతో స్థలం కబ్జా బాగోతం బయటికొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page