నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాతను నాటి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రజాకవి కాళోజీ అసలు పేరు…రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను, ఔన్నత్యాన్ని చాటుతుంది. ప్రజా సమస్యల పట్ల సమగ్ర దృష్టి.. న్యాయం, సత్యం కోసం నిరంతర పోరాటం వల్ల ఆయన జీవితంలోని ప్రతి దశలో ప్రజాదరణ పొందారు.అందరి గురించి ఆలోచించే వాడు ఒకే వ్యక్తికి అనుకూలంగా ఉండలేడు. ఆ అందరివాడిని ఓ వ్యక్తి తనకు అనుకూలంగా ఉండమని ఒత్తిడి చేస్తాడు.
అందరివాడు ఒక చట్రంలో ఉండిపోడు. కినుక వహించి ఇక ఆ వ్యక్తి అందరివాడిని తన వాడు కాదని వదిలేస్తాడు.ఇలా అందరి వాడు ఎవరికీ చెందని వాడు అవుతాడు.ఇది కాళన్న స్వీయ అనుభవం కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే.. కాళన్న ఎప్పుడూ ‘మనిషిని మనిషి మాదిరిగా మన్నించ లేనంత మలినమైనదీ జగతి మలినమైన ది..’ అంటూ ఆవేదన చెందారు. ఆయన ఎప్పు డూ ఎవరినీ అనుకరించలేదు. ఆయన భాషలో సరళత, శైలిలో స్పష్టత, సమస్యల మూలాలపై విషయ సమగ్రత, నమ్మిన సిద్ధాంతం పై నిబద్ధత, వ్యక్తీకరణలో నిర్భయత్వం.. ఆయనను ప్రజా కవిని చేశాయి. ప్రజల మనస్సులలో ఆ యనకు పదిలమైన స్థానాన్ని ఏర్పరిచాయి. ఆయన సిద్ధాంతాల్ని ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా ప్రవర్తించినప్పుడే నిజంగా కాళోజీని మనం స్మరించినట్లు. అన్ని రకాల పీడనలను, అన్యాయాలు, అక్రమాలను ఎదురించి పోరాడితేనే ఆయన బాటలో నడిచినట్లు. “ఆత్మకు అవమానం జరిగినా దవడ పళ్ళు రాలతాయన్న భయంతో పెదవి విప్పలేని మనిషి ఏం మనిషి”అని ఈసడించుకున్నాడు కాళోజీ.
‘ నా గొడవ ’ కాళోజీ రచనల్లో ప్రసిద్ధి పొందింది. అయితే నా గొడవ అంటే ఏమిటో.. కాళోజీ వివరణ ఇచ్చినప్పుడు ‘దానికి ఇంత విస్తృ త అర్థం ఉన్నదా !’ అని ఆశ్చర్యం కలగక మానదు. ‘నేనంటే.. భారత పౌరుడు. నా గొడవ ఆ పౌరుని స్థితి’. ఇంత సామాన్య పదాలకు అసామాన్య అర్థాలను ఇచ్చారు కాబట్టే కాళోజీ ఇంత ప్రశస్తి పొందారు. ఎలాంటి వ్యాకరణ చట్రంలో ఇమిడి పోకుండా, స్వేచ్ఛగా వచన కవిత్వం రాసిన మొదటి కవి కాళోజీ. ఆయన విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారు. సత్యాగ్రహ ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వందేమాతరం ఉద్యమాలు, ఆర్య సమాజ్, స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలతో రజాకార్ల వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడాయన. ఆయన వ్యక్తిత్వం ఆయనను రాజకీయ పార్టీలకు అతీతంగా నిలబెట్టినా, ఆయన అంతరాంతరాల్లో రాజకీయవాది.
ఆ దృక్పథంతోనే లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణించిన సందర్భంలో కాళోజీ రాసిన కవిత..‘పుట్టుక నీది… చావు నీది బ్రతుకంతా దేశానిది..’ వ్యక్తి చేతిలో లేనివి పుట్టుక, చావు మాత్రమే. అవి తప్ప బతుకంతా దేశానికి అర్పించారు జేపీ అని శ్లాఘించారు.అలతి పదాల్లో అనల్ప భావాన్ని నింపగల అపర మేధావి కాళోజీ. ‘పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు’ అన్న నానుడి గుర్తొస్తుంది.ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అందరూ చుట్టూ చేరి అతని గుణగణాలను శ్లాఘిస్తారు. అతడి వల్ల చెడు జరిగి ఉండొచ్చు. కానీ అతడి వల్ల జరిగిన చెడును.. అతడు దూరం అవడం వల్ల కలిగే బాధ డామినేట్ చేస్తుంది. అందుకే చనిపోయినవాడు ఎప్పుడూ మంచివాడే. కానీ బతుకున్నవాడి చరిత్రపై రంధ్రాన్వేషణ ఎందుకని ప్రశ్నిస్తారు ప్రజాకవి.ఈ భాష,ఈ వేషమెవరి కోసమురా? ఆంగ్లమందున మాటలనగానే.. ఇంత కుల్కెదవెందుకురా? తెలుగు వాళ్లకు ఆంగ్లభాషా వ్యామోహం మీద ఆయన వాడి- వేడి చురకలేశారు. వ్యక్తి భావం ముఖ్యమనేది మర్చిపోయి కాళోజీ ఆత్మ ఘోషించే విధంగా రేవంత్ భాషను ఎగతాళి చేస్తున్నారు. కాళోజీ తాత్విక దృష్టికి ఈ రెండు వాక్యాలు చక్కటి ఉదాహరణ.
పదవులు దొరికితే చాలు పదికాలాలు హాయిగా ఉండొచ్చు ‘అనుకుంటూ పచ్చగడ్డి వేయడానికి జంకిన పరిస్థితుల్లో మీకు అండగా మేము ఉన్నాం దిగులుపడకండి’ అంటూ కొండంత ధీమాతో ముందుకొచ్చిన వారే ఆప్తులు. ఆపదలో వెంటనిలిచి ఆదుకున్నవారే ఆపద్బాంధవులు.గత దశాబ్ద చివరి మజిలీ వరకు ప్రజల తిరస్కరణతో, వాగ్దాన భంగాలతో, అమలు కానీ హామీలతో, పిరాయింపులతో ఎగలేక, తెరచాటు నాటకాలతో. శుష్క ప్రియాలు శూన్య హస్తాలతో కేసీఆర్ ముచ్చట్లతో ఆశలుడిగిన తెలంగాణ ప్రజలు అత్యంత క్లిష్ట సమయంలో నేనున్నాను ‘అంటూ ముందుకొచ్చి’ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. గత మూడేండ్లుగా అహోరాత్రుల నిర్విరామ కృషితో రేవంత్ ప్రజాపాలనకు తెలంగాణ పౌర సమాజం రాజమార్గం వేసింది. కాళోజీ తెలుగు, ఉర్దూ హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు.ప్రపంచం గొడవ అంతా తన గొడవ అనుకున్నారు కాళోజీ, అందుకే మన తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రజాకవిగా,భావితరాలకు కాళన్నగా చిరస్థాయిగా నిలిచిపోయారు. నాడు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. కేసీఆర్ ప్రభుత్వం వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ అని పేరు పెట్టింది, కాళోజీ సంస్మరణార్థం ఆయన జన్మదినం సెప్టెంబర్-9 ని ‘ తెలంగాణ భాషాదినోత్సవం ’ గా ప్రకటించింది. కానీ హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ పై ఉన్న అభిమానాన్ని మరో మారు నిరూపించుకుంది.దశాబ్ద కాలంగా నిర్లక్ష్యం చేసినందుకు ఉమ్మడి జిల్లాలో చేదు ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచం గొడవ అంత తన గొడవగా భావించారు కాళోజీ. అందుకే, మన తెలంగాణ ప్రజల గుండెల్లో ‘కాళన్న’ చిరస్థాయిగా మిగిలిపోయారు.
(ప్రజాకవి ‘కాళోజీ’ పుట్టినరోజు సందర్భంగా )
డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355.