ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని నారాయణపేట్ లో నిర్మించిన ఇథనాల్ కంపెనీ బలమైన విష ప్రయోగంతో ప్రజలు భిన్న రకాల సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నారు.ఆ అనుభవ సారాంశం దృష్ట్యా తెలంగాణ ఉద్యమ తరహాలోనే సమాజం పట్ల సోయ కలిగిన విద్యావంతుడిగా ఆ ప్రజలు విషపూరిత కంపెనీల బారిన పడవద్దని అవగాహన కల్పించే దిశగా కొద్దిమంది బుద్ది జీవులతో కలిసి ఆరేపల్లి విజయకుమార్ తమ ప్రయత్నాన్ని మొదలు పెట్టారు.ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన విధులను ఎక్కడా కూడా విడనాడలేదు.ఆచార్య జయశంకర్ చూపించిన తోవలో ప్రజలు బాధలలో ఉన్నప్పుడు బుద్ధి జీవులుగా వారికి అండగా నిలబడాలన్న సోయితో ముందుకు సాగడమే పాలకులకు నేరమైపోయింది.ప్రజల సాధకబాదకాల కంటే,ప్రజాభిప్రాయాన్ని కంటే,ప్రజాస్వామ్య డిమాండ్ కంటే కూడా పెట్టుబడిదారుల డిమాండే ప్రభుత్వాలకు ప్రథమ ప్రాధాన్యత ఐనది.
వేలాదిమంది ప్రజలు ఏకతాటిపై వచ్చి మాకు హాని కలిగించే ఈ పరిశ్రమలు ఇక్కడ స్థాపించవద్దని మొరపెట్టుకున్నా కూడా పాలకులకు కనికరం లేకుండా పోయింది. అడ్డగోలు అనుమతులు ఇచ్చి పెట్టుబడిదారులకు రక్షణ కల్పిస్తూ ప్రజలపై పోలీసు నిర్బంధాలను ప్రయోగించడం ఏ ప్రజా పాలనకు నిదర్శనమో పాలకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సాగునీటిని,తాగునీటిని పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ఇథనాల్ కంపెనీ అనుభవాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ఎందుకు ఇంత దుందుడుకుడుగా వ్యవహరిస్తుందో తేల్చి చెప్పాలి.
ప్రజలందరు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న ఇథనాల్ కంపెనీని, ఆ పోరాటంకు,ఆ ప్రజలకు అండగా నిలబడిన నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరేపల్లి విజయకుమార్ ను సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండిస్తుంది.విజయ్ కుమార్ కు ఉద్యమాలు కొత్తేమి కాదు.మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలతో సంబంధాలు కలిగి వివిధ పౌర సమాజ సంస్థలతో కలిసి ప్రజా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్చార్జిగా పనిచేస్తూ ఒక ఉపాధ్యాయుడిగా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.ఆనాటి సమైక్య పాలకులు కనీసం టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు.మానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్ తో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఆదివాసి ఉద్యమాలలో పాలు పంచుకున్నారు.తెలంగాణ ఉద్యమం అంతా ఆచార్య కోదండరాం గారితో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితం కాకుండా అనేక రోజులు దిల్లీ కేంద్రంగా ఉద్యమాలలో పాలు పంచుకున్నారు.స్వయం పాలనలో నియంత ఐన కేసీఆర్ కూడా జోక్యం చేసుకునే ప్రయత్నం చేయలేదు.కాని ప్రజా ప్రభుత్వం పేరుతో నడుస్తున్న ఈ పాలనలో ఆంధ్రా లాబీయింగ్ కు తలొగ్గి వేటు వేశారు.
ప్రజా పాలన..! లో విధానాలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టాలి కాని ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలతో ఆడుకోవడం సరైన పద్ధతి కాదు. ఉద్యమాలకు వ్యూహాలు రుపొందించిన ఉద్యమకారులను గత పాలకులు ఏ విధంగా అణచివేశారో ప్రస్తుత పాలకులు కూడా అదే విధమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నారు.పాలకులు మారినా పాలన విధానాలలో మార్పులు రావడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు హామీలతో ప్రజలను ఆకట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు వంత పాడటం నూటికి నూరు శాతం ప్రజా కంఠక పాలనగానే తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తుంది. పాలకులు,రాజకీయ పార్టీలు ప్రజల ఆరోగ్యాలను విస్మరించి విషపూరిత కంపెనీలకు అండగా నిలబడినప్పుడు సమాజం పట్ల సోయి ఉన్నవారు బాధిత ప్రజలకు అండగా నిలబడడం అనివార్యం.ఆ వైపు గా విధ్వంసం అవుతున్న ప్రకృతిని,ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవడం దిశగా తన సంఘిభావాన్ని,తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న ఆర్.విజయ్ కుమార్ ను సస్పెండ్ చేయడం ఏలాంటి ఎంప్లాయిస్ ప్రెండ్లీ ప్రభుత్వమో చెప్పాలి.ఉపాధ్యాయునికి కేంద్ర బిందువు సమాజం అన్న సంగతి పాలకులు గుర్తెరగాలి. గతంలో జరిగిన నియంతృత్వ విధానాలు సమీక్ష చేయకుండా,నూతన విధానాల పై నూతన ప్రభుత్వం అడుగులు వేయకుండా యథాతథంగా పాలన కొనసాగించడం ప్రజా పాలనా.!
ప్రజా ఉద్యమకారులను ,పౌర సమాజ సంస్థలను అలుసుగా తీసుకున్న గత పాలకులు అధికారానికి దూరమైన విషయం మీకు తెలిసిందే. తెలంగాణ సమాజంలో రాజకీయ పార్టీల కంటే బుద్ధి జీవులు తమ పౌర సమాజం పాత్రే క్రియాశీలకమైనది.ప్రజలు వీరికిచ్చిన ప్రాధాన్యత ఏ రాజకీయ వ్యవస్థలకు ఇవ్వరు.అదేవిధంగా ప్రజలు నిర్బంధాన్ని అస్సలు సహించరు.ఇదే సందర్భంలో ప్రజలు పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడంతోపాటు తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కాపాడుకోవడం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ద పడతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తున్న అధికారం వెనకాల ఆ పార్టీ చేసిన ఆందోళనలు ఉద్యమాలు ఏమీ లేవు. ఆ నియంతలను తొలగించడంలో ఈరోజు మీరు అనుభవిస్తున్న పదవులకు తెలంగాణ పౌర సమాజం చేసిన నిరంతర ఉద్యమాల చలువేనని యాది పెట్టుకోవాలి. గత అనుభవాలను సమీక్షించుకొని పాలన విధానాలలో మార్పులు చేసుకోకపోతే భవిష్యత్ కార్యచరణతో ప్రజలు ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడం ఖాయం.