గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం చూపిన అనాలోచిత, మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు ఉండవచ్చు గాని, పని పరిస్థితుల మెరుగుదల, తమ వంటి పనే చేస్తున్న సిబ్బందితో సమాన హోదా వంటి ఆకాంక్షలు ఎప్పుడైనా మద్దతు ఇవ్వవలసినవే. ఒక ప్రజాస్వామిక సమానత్వ డిమాండ్ ఎవరు చేసినా అది హక్కుల కోసం ప్రశ్నించడానికి సంబంధించినది కాబట్టి ఆ డిమాండ్ ను సమర్థించవలసి ఉంటుంది. అయితే అదే సమయంలో ఎంత న్యాయమైన, సమర్థనీయమైన డిమాండ్లు ముందుకు తెస్తున్నప్పటికీ, అవి లేవనెత్తుతున్నవారి నేపథ్యం, చరిత్ర కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇంతకాలమూ ప్రజల హక్కులను కాలరాయడానికి పాలకుల చేతిలో దౌర్జన్య సాధనంగా, పనిముట్టుగా పనిచేసినవారు ఇవాళ తమ హక్కుల కోసం నిలబడితే, ప్రశ్నిస్తే పాలకులు ఎట్లా ప్రవర్తిస్తారో కూడ అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ కారణాల వల్ల ప్రస్తుత పోలీసు ఆందోళన వంటి పరిణామాలు క్లిష్టమైన విచికిత్సకు దారి తీస్తాయి.
ఈ నిప్పురవ్వ మొదట రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ లో ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీ ఎస్పీ) పదిహేడో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ లో ధర్నా జరపడంతో మొదలయింది. స్పెషల్ పోలీసుల విధులు, పని పరిస్థితులు అన్యాయంగా ఉన్నాయని, ఒకసారి విధినిర్వహణకు వెళితే ఎప్పుడు తిరిగివస్తారో తెలియడం లేదని, కానిస్టేబుళ్ల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఒకే విధానంలో పరీక్ష రాసి, కానిస్టేబుళ్లుగా ఉద్యోగంలో చేరినవారిలో స్పెషల్ పోలీసులకు మాత్రం ఇటువంటి దుర్భర పరిస్థితులు ఎందుకు ఉన్నాయని నిరసనకారులు ప్రశ్నించారు. సరిగ్గా అదే సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పదో బెటాలియన్ కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారి మీద ధర్నా జరిపారు. అక్కడా స్పెషల్ పోలీసులే గనుక సమస్యలు అవే. అలాగే నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి ఏడవ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు అక్కడి జాతీయ రహదారి మీద ధర్నా జరుపుతుండగా ఆ సమయానికి ఆ దారిన వెళుతున్న భారతీయ రాష్ట్ర సమితి నాయకులు కె టి ఆర్, తదితరులు తమ వాహనాలు దిగి నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. స్థానిక పోలీసులు కాస్త బలప్రయోగంతోనో, ఒత్తిడితోనో ఆ ధర్నాలన్నిటినీ విరమింపజేశారు గాని ఆ ఆందోళనకు లోతైన మూలాలున్నాయి గనుక అది అక్కడితో ఆగిపోలేదు.
ప్రజలు ఎంత న్యాయమైన ఆకాంక్షను ప్రకటించినా పోలీసులను ప్రయోగించి, బలప్రయోగం చేసి ఆ ఆకాంక్షలను అణచివేయడం పాలకులకు అలవాటు. అలా ప్రతి ప్రజాసమస్యనూ పరిష్కరించే బదులు అణచివేయడానికి పూర్తిగా పోలీసుల మీద ఆధారపడడం అలవాటైన ప్రభుత్వం పోలీసుల విషయంలో కూడా వారు తమ సమస్యలు ప్రకటించగానే బలప్రయోగానికీ, ఒత్తిడికీ దిగింది. వెంటనే 39 మంది కానిస్టేబుళ్లను, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. నాయకత్వం వహించిన, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
శనివారం నాటికి చాలా బెటాలియన్ల సిబ్బంది కుటుంబ సభ్యులతో పాటు, స్వయంగా సిబ్బంది కూడా యూనిఫాం లోనే నిరసన ప్రదర్శనల్లో కూచోవడం ప్రారంభమయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మూడో బెటాలియన్, వరంగల్ జిల్లా మామునూరు నాలుగో బెటాలియన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండ ఆరో బెటాలియన్, నల్లగొండ జిల్లా అన్నెపర్తి పన్నెండో బెటాలియన్, మంచిర్యాల జిల్లా గుడిపేట పదమూడో బెటాలియన్ – ఇలా క్రమక్రమంగా ఒక్కొక్క బెటాలియన్ లోనూ అసంతృప్తి వ్యక్తీకరణలు మొదలయ్యాయి, విస్తరించాయి. ‘ఒకే రాష్ట్రం, ఒకే పోలీసు’, ‘టీజీ ఎస్పీ వద్దురా, ఏక్ పోలీస్ ముద్దురా’ అనే నినాదాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని పదిహేడు బెటాలియన్లలో సగానికి పగియా బెటాలియన్లలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.
ఈ ఆందోళనలకు తక్షణ కారణం అయిన సెలవుల మెమోను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు స్పెషల్ పోలీసు విభాగం అదనపు డీజీ శుక్రవారం ప్రకటించారు గాని అప్పటికే చేతులు కాలాక ఆకుల పట్టుకున్నట్టు అయింది. అంతకు ముందు పదిహేను రోజుల వరుస పనికి నాలుగు రోజుల సెలవు అనే నిబంధనను రద్దు చేసి, 26 రోజుల వరుస పనికి నాలుగు రోజుల సెలవు అని కొత్త నిబంధన అక్టోబర్ 10న వెలువడిన ఫలితమే ప్రస్తుత ఆందోళనలు. ఈ కొత్త నిబంధనను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని ప్రకటించినా కానిస్టేబుళ్లకు, వారి కుటుంబ సభ్యులకు వచ్చిన కోపం చల్లారకపోవడానికి అంతకు మించిన సుదీర్ఘకాలపు కారణాలు కూడా ఉన్నాయి.
‘కష్టపడి, ఇష్టంగా పోలీసు కొలువు సాధించుకున్నాం. మాలాగానే కొలువు ఎక్కినవాళ్లు మాకంటే బాగున్నారు. మమ్మల్ని మాత్రం స్పెషల్ పోలీసు అని పేరు పెట్టి వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మట్టి పనులు, నిర్మాణ పనులు కూడా చేయిస్తున్నారు. పోలీసు విధులతో ఎంతమాత్రం సంబంధం లేని వాగు నుంచి ఇసుక తేవడం, మిషన్ భగీరథ పైపులు మోయించడం లాంటి పనులు కూడా చేయిస్తున్నారు’ అని కానిస్టేబుళ్లు అంటున్నారు. తాము ఆ పనులు చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు కూడా ప్రచారంలో పెట్టారు.
ఒకే రకమైన పరీక్ష రాసి, దేహ దారుఢ్య పరీక్షలను ఎదుర్కొని కానిస్టేబుల్ గా నియామకం అయిన తర్వాత కొందరిని సివిల్ విభాగంలో, కొందరిని సాయుధ రిజర్వ్ విభాగంలో, కొందరిని స్పెషల్ పోలీసు విభాగంలో నియమిస్తున్నారని, ఇలా వేరువేరు నియామకాలు ప్రభుత్వం వైపు నుంచి అవసరమే అనుకున్నా, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పని విధానం ఉండడం ఏమిటని, కొందరి పట్ల వివక్ష ఎందుకని ఈ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. ఒకే పనికి ఒకే హోదా, ఒకే పని పరిస్థితులు, ఒకే వేతనం అనే సహజ న్యాయసూత్రాలు తమకెందుకు వర్తించవని ప్రశ్నిస్తున్నారు. సివిల్ పోలీసులకు మూడు నుంచి ఐదేళ్ల వరకు ఒకే చోట ఉద్యోగం కల్పిస్తున్నట్టే తమకు కూడా అదే విధానం అమలు చేయాలని స్పెషల్ పోలీసులు కోరుతున్నారు. స్థానికత ఆధారంగా జిల్లాల్లో పోలీసు స్టేషన్లకు కేటాయించాలని కోరుతున్నారు. శ్రమదానం డ్యూటీల్లో వివక్ష చూపగూడదని కోరుతున్నారు. ఇతర రాష్ట్రాలలో అమలైనట్టుగా ఏకీకృత పోలీసు వ్యవస్థను నెలకొల్పాలని కోరుతున్నారు.
ప్రజలు ఎంత న్యాయమైన ఆకాంక్షను ప్రకటించినా పోలీసులను ప్రయోగించి, బలప్రయోగం చేసి ఆ ఆకాంక్షలను అణచివేయడం పాలకులకు అలవాటు. అలా ప్రతి ప్రజాసమస్యనూ పరిష్కరించే బదులు అణచివేయడానికి పూర్తిగా పోలీసుల మీద ఆధారపడడం అలవాటైన ప్రభుత్వం పోలీసుల విషయంలో కూడా వారు తమ సమస్యలు ప్రకటించగానే బలప్రయోగానికీ, ఒత్తిడికీ దిగింది. వెంటనే 39 మంది కానిస్టేబుళ్లను, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. నాయకత్వం వహించిన, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, ఈ ఆందోళన ప్రతిపక్షాల కుట్ర అని అలవాటైన పాత ఆరోపణలే చేశారు. కౌన్సిలింగ్ పేరుతో బెదిరింపులకూ బుజ్జగింపులకూ పాల్పడ్డారు. ఏవైనా సమస్యలు ఉంటే ‘దర్బార్’ లో ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. (దర్బార్ అనే మాటలోనే రాచరిక, భూస్వామ్య ఆధిపత్య ధోరణి స్పష్టమవుతున్నది!)
తాము కూడా పేద, మధ్యతరగతి రైతు కూలీ కార్మికుల బిడ్డలమేనని, తమ దౌర్జన్యమూ తుపాకులూ తమలాగనే సమస్యలతో అల్లాడుతూ ఆందోళన చేస్తున్న వారి మీదికి ఎక్కుపెట్టగూడదని పోలీసులు అర్థం చేసుకున్ననాడు మాత్రమే వారి పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుంది. వారి డిమాండ్ల న్యాయబద్ధత ప్రజలకు అర్థమవుతుంది. ఆ డిమాండ్లను సమర్థించడం మొత్తంగా ప్రజాస్వామిక స్ఫూర్తిలో భాగమని ప్రజలకు అర్థమవుతుంది. పాలకులూ ఉన్నతాధికారులూ తమకిచ్చే తప్పుడు ఆదేశాలను తాము నిరభ్యంతరంగా పాటించనక్కరలేదనీ, అవి రాజ్యాంగబద్ధమేనా, న్యాయ బద్ధమేనా అని ఆలోచించాలనీ ఇటువంటి ఆందోళన సందర్భంలోనైనా పోలీసులు అర్థం చేసుకోవాలి.
అధికారుల మొండి వైఖరి, ప్రభుత్వపు స్పందనా రాహిత్యం సహజంగానే అసంతృప్తి జ్వాలాలకు ఆజ్యం పోశాయి. నిరసనలను రాష్ట్ర రాజధానికి చేర్చాలని కానిస్టేబుళ్లు నిర్ణయం తీసుకోగా ప్రభుత్వం మొత్తంగా హైదరాబాదును దిగ్బంధనం చేసి, నెల రోజులపాటు సెక్షన్ 163 అమలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ లపై నిషేధం, నలుగురికి మించి గుమికూడగూడదనే ఆంక్షలు, ధర్నాచౌక్ లో టీజీ ఎస్పీ కానిస్టేబుళ్ల అరెస్టు, కేసులు వంటి తీవ్రమైన అణచివేత చర్యలకే పూనుకుంది. ముఖ్యమంత్రి నివాసంలో, సెక్రటేరియట్ లో విధుల్లో ఉన్న టీజీ ఎస్పీ సిబ్బందిని తొలగించి, వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్ జవాన్లను నియమించింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి, నిరసనకారులతో చర్చలు జరిపి, వారి సమస్యలు తెలుసుకొని, పరిష్కరించడానికి ప్రయత్నించడం వంటి నాగరిక, ప్రజాస్వామిక, సానుకూల వైఖరిని ఎంతమాత్రం ప్రదర్శించలేదు.
ఇంకా ముందుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ సచివాలయంలో సెక్యూరిటీ విధులు, ఆక్సెస్ కంట్రోల్ విధులు నిర్వర్తిస్తున్నవారికి ఒక మెమో జారీ చేసింది. తీవ్రంగా అభ్యంతరకరమైన, అప్రజాస్వామికమైన ఆ మెమోలో పోలీసు కానిస్టేబుళ్ల మీద సోషల్ మీడియాలో పాల్గొనగూడదని, ఎక్కడా ఎవరితో ఏమీ మాట్లాడగూడదని, రాయగూడదని, పోస్టులు పెట్టగూడదని, షేర్ చేయగూడదని, కామెంట్లు చేయగూడదని అనేక బెదిరింపులు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకాలమూ ప్రజల మీద అమలయిన పోలీసు రాజ్యం, అణచివేత రాజ్యం, నిఘా రాజ్యం ఇప్పుడు పోలీసులలోనే ఒక ముఖ్యమైన విభాగం మీదికి తన కోరలు సాచింది.
ప్రజల దృష్టిలో పోలీసులంటే తమ మీద దౌర్జన్యం, జులుం చలాయించేవాళ్లు, ఊ అంటే, ఆ అంటే తమ మీదికి లాఠీలు ఎత్తేవాళ్లు, దురుసుగా ప్రవర్తించేవాళ్లు, హింసా దుర్మార్గాల ప్రభుత్వానికి, పాలకవర్గాలకు ప్రతీక. పోలీసు శాఖలోని ఆ అవలక్షణాలు పాలకులు వాళ్లకు మప్పారని, అవి రాజకీయ నాయకులవీ, ఉన్నతాధికారులవి మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల వర్గప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు కాపాడే క్రమంలో పేద పోలీసులు, ఆర్డర్లీలు, వెట్టిచాకిరీకి గురవుతున్న పోలీసులు, తాము ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చారో మరిచిపోతారు. తమ తల్లిదండ్రుల వంటి వారి మీద, తమ తోబుట్టువుల మీద, తమ పిల్లల వంటి వారి మీద కూడా తిట్లూ, అవమానాలూ, లాఠీలూ, టియర్ గ్యాస్ లూ, తుపాకి కాల్పులు సాగిస్తారు – ఇదీ పోలీసు అంటే ప్రజల అవగాహన. అందుకే కన్యాశుల్కం లో గిరీశం నేషనల్ కాంగ్రెస్ గురించీ, స్వరాజ్యం గురించీ గంటన్నర ఉపన్యాసం దంచితే చివరికి జట్కావాలా, ‘ఆ స్వరాజ్యమేదో వస్తే హెడ్ కానిస్టేబుల్ బదిలీ అవుతాడా’ అని అడుగుతాడు. ప్రజలకు తెలిసిన ప్రభుత్వం పోలీసే. ప్రజలకు తెలిసిన పాలన పోలీసు దౌర్జన్యమే.
ఈ స్థితిలో పోలీసులు తమకు ఎంత న్యాయమైన సమస్యలున్నాయని రోడ్డెక్కినా ప్రజల నుంచి సానుభూతి ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఆ సంగతి బాగా తెలుసు గనుకనే పాలకులు పోలీసు డిమాండ్లనూ, సమ్మెలనూ అవి ఎంత న్యాయమైనవైనా పట్టించుకోకుండా ఉంటారు. గతంలో ఎన్నో చరిత్రాత్మకమైన పోలీసు సమ్మెలు ఆ కారణం వల్లనే విజయం సాధించలేకపోయాయి.
తాము కూడా పేద, మధ్యతరగతి రైతు కూలీ కార్మికుల బిడ్డలమేనని, తమ దౌర్జన్యమూ తుపాకులూ తమలాగనే సమస్యలతో అల్లాడుతూ ఆందోళన చేస్తున్న వారి మీదికి ఎక్కుపెట్టగూడదని పోలీసులు అర్థం చేసుకున్ననాడు మాత్రమే వారి పట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుంది. వారి డిమాండ్ల న్యాయబద్ధత ప్రజలకు అర్థమవుతుంది. ఆ డిమాండ్లను సమర్థించడం మొత్తంగా ప్రజాస్వామిక స్ఫూర్తిలో భాగమని ప్రజలకు అర్థమవుతుంది. పాలకులూ ఉన్నతాధికారులూ తమకిచ్చే తప్పుడు ఆదేశాలను తాము నిరభ్యంతరంగా పాటించనక్కరలేదనీ, అవి రాజ్యాంగబద్ధమేనా, న్యాయబద్ధమేనా అని ఆలోచించాలనీ ఇటువంటి ఆందోళన సందర్భంలోనైనా పోలీసులు అర్థం చేసుకోవాలి. తమకు అందిన ఆదేశం న్యాయబద్ధమా కాదా చూసి, న్యాయబద్ధమైతేనే పాటిస్తామని అనడం క్రమశిక్షణా రాహిత్యం ఎంత మాత్రమూ కాదు. బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగులకూ, పోలీసులకూ కూడా గాంధీజీ ఇచ్చిన పిలుపు తప్పుడు ఆదేశాలను ధిక్కరించమనీ, ఉల్లంఘించమనీ అని చరిత్ర చెపుతున్నది.