రాబీస్‌ నియంత్రణ సాధ్యమేనా?

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు అరవై వేలమందికి పైగా రాబిస్‌ మరణాలు నమోదవుతున్నాయి. అంటార్కిటికా మినహా అన్ని ఖండాలలో ఈ వ్యాధి ఉంది. రాబిస్‌ వ్యాధికి సంబంధించిన మరణాలు ప్రపంచ జిడిపిపై ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ప్రపంచవ్యయం 860 కోట్ల యుయస్‌ డాలర్లగా ఉంది. ఇక మనదేశం రేబిస్‌ మరణాలకు నిలయంగా మారింది. ఏడాదికి 18000 నుండి 20000 రేబిస్‌ మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి ప్రపంచ రేబిస్‌ మరణాలలో 36 శాతానికి సమానం. మన దేశంలో రాబిస్‌ కేసులు మరణాలలో 30 నుండి 60 శాతం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలోనే నమోదవుతున్నాయి. జాతీయ వైద్య పాలసీ (ఎన్‌ హెచ్‌ పి) ప్రకారం 2005 నుండి 2020 మధ్య మొత్తం 2863 రాబిస్‌ కేసులు నమోదయ్యాయని తెలిపింది.

నాలుగింట మూడు వంతుల కేసులు ఐదు రాష్ట్రాలలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో 43శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో 10శాతం, మహారాష్ట్రలో 8శాతం, కర్ణాటకలో 7శాతం, ఢల్లీిలో 6శాతం నమోదయ్యాయి. జాతీయ రాబిస్‌ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ ఆర్‌ సి పి) నివేదిక అనుసరించి 2012 నుండి 2022 మధ్య కాలంలో రాబిస్‌ కేసులు 6644 గా ఉన్నాయి. అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ దీవులను మినహాయించి, దేశవ్యాప్తంగా రేబిస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ హెచ్చు తగ్గులు అధిగమించడానికి మొబైల్‌ అప్లికేషన్‌లను ఉపయోగించి నిజసమయ డేటాను సేకరించడానికి ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫారమ్‌ మనదేశంలో ప్రారంభమైంది.

కారణాలు:
రాబిస్‌ అనేది మానవులతో సహా ఏదైనా క్షీరదాన్ని ప్రభావితం చేసి వైరల్‌ జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్‌ వ్యాధి. ఈ వ్యాధి సోకిన జంతువుల లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి వెన్నుపాము నుండి మెదడుకు సోకి మరణానికి కారణమవుతుంది. దాదాపు 96 శాతం మరణాలు కుక్కకాటుకు సంబంధించినవే. రాబిస్‌ వ్యాధి ఉన్న కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులకు వస్తుంది. ఈజబ్బుతో బాధపడుతున్న ఏ జంతువైనా మనుషులకు కరిస్తే రేబీస్‌ వైరస్‌ బాహ్య నాడీమండలము ద్వారా కేంద్రనాడీమండలం చేరి వ్యాధి లక్షణాలు కలుగజేయును.

గబ్బిలం నుండి వ్యాపించే రేబిస్‌ ఇంతవరకు మనదేశంలో నివేదించబడలేదు. ఏ క్షీరదమైనా ఈ వ్యాధికి గురికావచ్చును. కొన్ని సమయాలలో గాలిలో ఈ వైరస్‌ ఎగిరి వ్యాపించే అవకాశమూ ఉంది. వైరస్‌ పొదగడానికి 9 రోజులనుండి 90 రోజులు పడుతుంది. మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశముంది. రాబిస్‌ వాస్తవంగా వంద శాతం ప్రాణాంతకం. జంతువులలోనైనా, మనుషులలోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడం తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.

వ్యాప్తి లక్షణాలు:
రేబిస్‌ నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధి. మెదడులో ‘ఎన్‌-సెఫలైటిస్‌’ అనే ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలను కలుగజేస్తుంది. ఈ జబ్బుకు రెండు రూపాలు ఉన్నాయి. ఉత్తేజకరమైన ప్రవర్తన, భ్రాంతులు, సమన్వయం లేకపోవడం, హైడ్రోఫోబియా (నీటి భయం), ఏరోఫోబియా (స్వచ్ఛమైన గాలి భయం) ఉంటుంది. కార్డియో-రెస్పిరేటరీ అరెస్ట్‌ కారణంగా కొన్ని రోజుల తర్వాత మరణం సంభవిస్తుంది. ఇంకొకటి గాయపడిన ప్రదేశం నుండి కండరాలు క్రమంగా పక్షవాతానికి గురవుతాయి. కోమా నెమ్మదిగా అభివృద్ధిచెంది మరణం సంభవిస్తుంది.

నివారణ:

ఈ వ్యాధి నివారణకువిస్తృత నిఘా, నిర్వహణ వ్యూహాలతో పాటు బహుళ రంగాల సహకారం అవసరం. ఈ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం 2030 నాటికి రేబిస్‌ వ్యాధిని తొలగించడానికి జాతీయ కార్యక్రమాన్ని (ఎన్‌ఆర్సిపి) రూపొందించింది. 2005 నుండి 2020 సం. మధ్యలో రాబిస్‌ కేసులు ఒక కోటి జనాభాకు 2.36 నుండి 0.41 వరకు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఎన్‌ఆర్సిపి మనుషులకు, కుక్కలకు టీకాలు వేయించడం, ప్రజలలో అవగాహన కల్పించడం కుక్కల జనాభా నిర్వహణ, అంతర్‌ విభాగ సమన్వయం వంటి వ్యూహాలను అనుసరిస్తోంది. మనదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ త్రైపాక్షిక కూటమి, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ సహకారంతో ‘వన్‌ హెల్త్‌’ విధానాన్ని ఉపయోగించి రేబిస్‌ మరణాలను అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది.

ఇవి కేసులు లేదా మరణాల సంఘటనల తగ్గుదలకు దోహదం చేసినప్పటికీ కార్యాచరణ సవాళ్లు, నిధుల కొరత, ప్రజలలో సామాజిక స్పృహ లేకపోవడం లాంటివి పెద్ద అవరోధాలుగా నిలుస్తున్నాయి. గబ్బిలాలు, కోతులు వంటి ఇతర వాహకాల పాత్రను అర్థం చేసుకోవడం, పరిష్కరించడం కూడా కీలకం. కొన్ని ప్రాంతాలలో, ఈ జాతులు రాబిస్‌ వైరస్‌ రిజర్వాయర్‌లుగా కూడా పనిచేస్తాయి. వన్‌ హెల్త్‌ కెపాసిటీ పద్ధతులను అవలంబించడం వలన భారతదేశం యొక్క రాబిస్‌ నియంత్రణ ప్రయత్నాలను గణనీయంగా మెరుగుపరచవచ్చు. దేశంలో రేబిస్‌ సమస్యను పరిష్కరించడానికి జాతీయ వైద్య మిషన్‌ సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌గా 03.10.2013న జరిగిన స్టాండిరగ్‌ ఫైనాన్స్‌ కమిటీ సమావేశం ద్వారా జాతీయ రేబిస్‌ నియంత్రణ కార్యక్రమం ఆమోదించబడిరది.

2030 నాటికి మానవ రాబిస్‌ నిర్మూలనకు మార్గం సుగమం చేయవచ్చు. సమర్థవంతమైన ప్రణాళిక ద్వారా వీధి కుక్కలను నియంత్రించాలి. మానవులలో రాబిస్‌ మరణాలు తక్షణ తగిన వైద్య సంరక్షణ ద్వారా 100% నివారించబడతాయి. కుక్కలకు టీకాలు వేయడం అనేది ప్రజలలో రాబిస్‌ను నివారించడానికి అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యూహం. కుక్కలు ఇతర జంతువులకు టీకాలు వేయడం రేబిస్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఏదైనా జంతువు కాటు వేసినవెంటనే అప్రమత్తమై వైద్య సహాయం తీసుకోవడం లాంటి చర్యల ద్వారా రేబిస్‌ను నివారించగలిగి సురక్షితమైన దేశాన్ని సృష్టించగలము.
-జనక మోహన రావు దుంగ
8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page