నర్రా ” పొత్తి” నవలలో కవితాత్మక వచనం

పచ్చగా వుండాల్సిన చెట్టు
విషవలయాన్ని చుట్టుకుని మోడు వారినట్లు అగుపిస్తుంది
చెట్టు మోస్తున్న దేహానికి ఆకులన్నీ
వంగి ముడుచుకొని మొక్కుతున్నవి
ఎంత గాలొచ్చినా చెట్టు ఉశారుగ లేదు
స్తబ్ధంగా నిలబడ్డది
చెట్టును మోస్తున్న మట్టి
దుఃఖం దిగమింగుకుంటున్నది

( పుట – 108)

(పాఠకుల సౌలభ్యం కోసం వచనాన్నీ కొన్ని చోట్ల పాదాలుగా విభజించాను గమనించగలరు )

పై వాక్యాలు చదవగానే ఎవరైనా ఈ వాక్యాలు ఏదో వచన కవిత్వం నుంచి తీసుకున్నవి అనుకుంటారు. కానీ ఈ వాక్యాలు నర్రా ప్రవీణ్ రాసిన పొత్తి అనే నవల నుండి అని తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పై వాక్యాలలో ఏ విషయాన్ని వాచ్యార్థం లో ఉపయోగించలేదు రచయిత. పై కవితా వాక్యాలలో చెట్టును మానవరోపాణ చేస్తూ తెలంగాణ ఉద్యమ సాధన కోసం నవల లో రవి అనే పాత్రధారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వర్ణన. విష వలయాన్ని చుట్టుకొని చెట్టు మోడు వాడినట్లు అనడం ఆంధ్ర పాలకులు తెలంగాణ ను ఎలా పరోక్షంగా చుట్టు ముట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ను అడ్డుకుంటున్నారో తెలుపుతుంది. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక పాత్ర కే అపాదించలేము. తెలంగాణ కోసం ఉద్యమం చేసే ప్రతి పాత్ర సంఘర్షణ మనకు కనిపిస్తుంది. ఉద్యమ పరాకాష్టకు ఇది నిదర్శనం.

పొత్తి అనే పదం తెలంగాణలో వ్యావసాయికంగా ధాన్యపురాశి చుట్టూ గీసే రక్షణరేఖ. తెలంగాణ మాండలీకం “పొత్తి’ అనే పేరు పెట్టడం, నవలా ముఖ చిత్రం గా ఎత్తిన పిడికిళ్లు మరియు ఉస్మానియా విశ్వ విద్యాలయము ముఖ చిత్రం ఇవ్వడం ఇవ్వన్నీ పరోక్షంగా నవలా ఉద్దేశ్యాన్నీ తెలుపుతాయి. శీర్షిక, ముఖచిత్రాల ద్వారా ఎలా అయితే రచయిత తన ఉద్దేశ్యం తెలిపాడో అలాగే నవలలో చాలా చోట్ల కవితాత్మక వచనం తో రాబోయే సంఘటనలను సంకేతాత్మకం గా చెప్పడం ఈ నవలను అగ్రశ్రేణి కోవలోకి తీసుకెళ్ళుతుంది.

ఈ నవలలో కథానాయికా నాయకులు గంగాశంకర్లు వీరిని ఆధారంగా చేసుకొని తెలంగాణోద్యమం,  పల్లెపట్నం జీవనవిధానాన్ని రచయిత నర్రా వివరించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది.

తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ జన జీవనాన్ని కవితాత్మకంగా ,ప్రతీకాత్మకంగా  చిత్రీకరించడంలో ద్వారా నర్రా భవిష్యత్ నవలాకారులకు పాత మార్గాన్నే సరికొత్తగా చూపాడనే చెప్పవచ్చు. వచన రచనలో ప్రత్యేకించి నవల రచనలలో కవితాత్మక వచనం ఉండడం చాలా తక్కువ నవలల్లో చూస్తాం.రావిశాస్త్రి రత్తాలు – రాంబాబు, ఇంద్రచాపం, విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలు,  బుచ్చిబాబు చివరకు మిగిలేది, వడ్డెర చండీదాస్ హిమజ్వాల, చలం నవల రచనలలో కవితాత్మక వచనం చూస్తాను. ఈ మధ్య ఇలాంటి నవలలు రావడం అరుదు. చాలా రోజుల తర్వాత మంచి కవితాత్మక వచనాన్ని ప్రదర్శించిన నర్రా ప్రవీణ్ అభినందనీయుడు. పొత్తి నవలలో కొన్ని కవితాత్మక వచన అంశాలను ఈ వ్యాసం లో పరిశీలనగా చూద్దాం.

అయిదున్నర అడుగుల ఎత్తు
నిండు బతుకమ్మలాంటి మొకం
పూరిక్కల సొంటి పెదాలు
సెలయేటి సప్పుడసోంటి మాటలు
యీసమంత ఇసంలేని తనం
అన్నింటికీ మించి
మంచి వ్యక్తిత్వం ఆమె సొంతం

పై వర్ణన నవలలోని కథానాయికను గురించి వర్ణన. ఉపమానాలతో సాగిన ఈ వర్ణన లో కల్మషం లేని గంగ పాత్ర మన కళ్ల ముందు కదులుతుంది.

కోట్ల చేతులకు నిలువునా వందనం
చేస్తున్నట్లుగా కన్పించే ఓ స్థూపం
వేల గుండెల సప్పుడంతా ఆ స్థూపంల
బందీ అయ్యినట్లుంది
కోట్ల గొంతుకల కేకలు
ఆ స్థూపం వైపు చూస్తే వినిపిస్తున్నవి
నినాదపు పిడికిల్లు కిరీటంగా
అమర్చుకున్నది ఆ స్తూపం
స్థూపం తాకినప్పుడల్లా
త్యాగాల గుర్తులు గుండెకు
నేరుగా తాకి జ్వలిస్తున్నయి
నీలి మబ్బుల మధ్యన
పూసిన సింగిడి స్థూపపు సిగలో
నెలవంకలా అతుక్కుపొయ్యింది

ఉస్మానియా క్యాంపస్లో తెలంగాణ ఉద్యమాన్ని వర్ణించే దృశ్యమిది. అమరవీరులను ప్రతీకాత్మకంగా చెప్పారు స్థూపం తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరవీరులకు ప్రతీక.పిడికిలి ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానం చెప్పిన వారి ఆశలు ఆశయాలకు సంకేతం.నినాదాలు పిడికిళ్ళు గా మారి ఉద్యమ ఆవేశాన్ని ప్రజల్లో కలిగిస్తాయి అంటాడు రచయిత. ఈ ఉద్యమ తీవ్రతను జోరు వాన గా పోల్చుకుంటే వర్షం వెలసిన తరువాత వచ్చే ఇంద్ర ధనస్సు స్థూపం సిగలో నెలవంకలా ఉందని రచయిత భావన. ఎక్కడ వాచము చెప్పకపోయినా ఈ వాక్యాలు చదువుతుంటే  పాఠకుడి కీ మదిలో నెలవంక మొదలుతుంది. నెలవంక భవిష్యత్తులో పూర్ణచంద్రుడు మారుతాడని రచయిత ఉద్దేశం అంటే తెలంగాణ ఉద్యమం సంపూర్ణ అవుతుందనీ, స్వరాష్ట్రం సిద్దిస్తుందనీ రచయిత వ్యక్తపరిచాడు.

గబ్బిలాలన్నీ యూనివర్సిటీ
భవనాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతున్నవి
చిమ్మ చీకటి కలలను కమ్మేస్తుండగానే
పావురాలు గూళ్ళు చేరే ప్రయత్నంలో పడ్డయి

( పుట – 42 )

తెలంగాణ ఉద్యమ సమయం లో ఉద్యమాన్ని భగ్నం చేయడానికి పోలీసులు విద్యార్థుల పై లాఠీఛార్జ్ ఇలాంటివి ప్రయోగించారు. ఉద్యమం చేసే వారిని చెల్లాచెదురు చేయ చేసినప్పుడు రచయిత ఈ సందర్భంగా చేసిన వర్ణన ఇది. గబ్బిలాలను ఆంధ్ర వలసవాదులుగా, పావురాలను ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రతీకలుగా చెప్పారు.ఇంత ఉద్యమం చేసిన చలనం లేని ఆంధ్ర ప్రాంతం వారి నిసిగ్గు మనకు అర్ధమవుతుంది. గబ్బిలం అనే జీవి పాడుబడిన భవనాల్లో నివసిస్తుంది. ఆంధ్ర వలస వాదులు వలన యూనివర్సటీ పాడిందని వ్యంగ్యముగా రచయిత చెప్పారు. రాష్ట్ర కాంక్ష గల అనే కల నెరవేరుతుందో లేదో అనే ఆందోళనతో విద్యార్థులు తిరుగుముఖం పట్టింది అని రచయిత నాటి ఉద్యమ స్థితిని ఉద్యమ తీవ్రత ను వర్ణించారు.

చీకటి వెలుతురుతో
పోటీపడి ఓడిపొయ్యింది
అప్పుడే నిద్ర మబ్బిచ్చు
కుట్టున్న చెట్లు
కొమ్మలరెక్కలతో
వొళ్ళిర్చుకుంటున్నవి

( పుట – 61 )

పై వర్ణన ఉద్యమం కోసం చనిపోవాలనుకున్న పాత్ర సూరి రాసిన లేఖలోనిది. దీనిలో ‘ చీకటి వెలుతురు తో పోటీపడి ఓడిపోయింది ‘  అనడంలో రచయిత సూరీ ఆత్మహత్యను సంకేతంగా చెప్పాడు ” అప్పుడే నిద్ర మబిచ్చు కుట్టుకున్న చెట్లు కొమ్మ రెక్కలతో వొళ్ళిర్చుకుంటున్నవి ”   అనడంలో రచయిత ఒక ఉద్యమ స్తబ్దత నుంచి విద్యార్థులు, నాయకులు బయట పడుతున్నటువంటి, చలనం కలిగినటువంటి స్థితిని చెప్పాడు.

గడియారంలో ముల్లుల్లా
తిరుగుతున్న వేల చేతులు
వేగంగా పరిగెత్తే కాళ్ళు
గుమిగూడిన జనం
ఫోన్లలో తలపెట్టుకొని
నడుస్తున్న మనుషులు
పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద బస్సులు
అద్దాల మేడలు రంగు రంగుల పూల చెట్లు
చెరువు పొంటి తిరుగాడుతున్న
మిణుగురు పురుగుల్లా
భవనాలు లైట్లను అద్దుకొని వున్నవి

( పుట – 58)

కథానాయిక గంగా తొలిసారి పట్నం ను చూసినప్పుడు కలిగిన అనుభూతి ఇక్కడ వర్ణించబడింది. గడియారం ముల్లు లా తిరుగుతున్న వేల చేతులు అనడంలో రచయిత  24 గంటలు రద్దీగా ఉండే పట్న వాతావరణాన్ని సూచిస్తుంది. బస్సులు, మనుషులు, మేడలు, చెట్లు ఎలా ఎక్కడ అన్నీ సహజ సిద్ధంగా చెప్పాడు రచయిత. ఒక సామాన్య గ్రామీణ యువతి తొలిసారిగా నగరాన్ని సందర్శించినప్పుడు ఎలాంటి అనుభూతి ఉంటుందో ఈ వాక్యాలలో చూస్తాం.

క్యాంపస్ల మొగ్గలు మెల్లగా విచ్చుకుంటున్నయ్
ఎండుకొమ్మలకు లేత చిగుర్లు మొలుస్తున్నయ్
పచ్చని గడ్డి మీదున్న నీటి తుంపరలు
మొదల్లకు చేరి ఇంకిపోతూ పచ్చతనాన్ని పండిస్తున్నయ్
పల్లె నుండి పట్నం చేరిన ఆశయాల మట్టిపొదపు ముద్రలే
దారి పొడవునా కనిపిస్తున్నయి

( పుట – 61)

కథా నాయిక గంగ క్యాంపస్లో సీటు కోసం పరీక్ష రాయడం,  గంగకు సీటు వస్తుందని నమ్మకం కలిగినప్పుడు రచయిత చేసినటువంటి వర్ణన.  నిజానికి దీన్ని లో రచయిత ఎక్కడ కూడా గంగ ప్రస్తావన తేలేదు. కానీ భవిష్యత్ ఆశలను దీనిలో సంకేతంగా పేర్కొన్నారు.

హాస్టల్లోని రూమ్లన్నీ
కొత్త కొత్త పావురాలతో నిండిపోయినయ్
గూటి నుండి పట్టుకొచ్చిన
గంపెడు జ్ఞాపకాలు యాదికొచ్చి
ఆ పావురాల పానాలు జివ్వుమంటున్నయ్
కళ్ళనిండా ఊహలుపంపిన ఊసులజాడలు

( పుట – 102 )

పై వాక్యాలలో ఉస్మానియా లోని విద్యార్థినులను పావురాలనే ప్రతీకలుగా చెప్పాడు రచయిత. కొత్తగా హాస్టల్ కు వచ్చిన విద్యార్థుల మానసిక స్థితి వర్ణించబడింది.

*నవలలో మరికొన్ని కవితాత్మక వచనాలు*

ఎర్ర రేగడి నేలల్ల రైతుల కలలు నిత్యం శోభిల్లుతున్నవి. సాలు సాలూ పూరు సొగసునద్దుకున్నట్లనిపిస్తుంది. మళ్ళు చూస్తే కుప్పలు తెప్పలుగా పోసిన ఒడ్లగింజలు పళ్ళెంల కొచ్చి కడుపు నింపుతున్నట్లనిపిస్తుంది. ఆ వూరు చెరువు నిండు గర్భవతి తలపిస్తుంది. దీపంలా వెలుగుతుంది.       ( పుట – 36 )

పచ్చగలువు తీసిన పొలానికి వీరయ్య మందు సల్లుతుండు. ఆకు మీద మిడుతలు కాళ్ళ అడుగుల నప్పుడుకు ఎగురుతున్నయ్. పురుగు వేర్లను | తొలుస్తుంది. పచ్చని చీరను కట్టుకున్న పరిమళ్ళు ఆకాశం వైపు రెప్పాల్చకుండ చూస్తున్నయ్. దిష్టికుండను తగిలిచ్చిన లెదుర్లకు భయపడి కొంగలటు మొఖాన వస్తనేలేవు.
( పుట – 48 )

కండువ భుజంపై సరిచేసుకుంటూ ఒంగి యేలిముద్రలేస్తున్న రైతులను చూస్తుంటే పొట్టకొచ్చిన వరికంకులు అర్రెంచి నేలపై సంతకాలు చేస్తున్నట్లుంది.

కండ్ల కొలకుల్లో దాగిన చెరువు చుక్క ఎప్పుతో తాతల కాలంల ఆదిన

సంతకానికి ఇప్పుడు తడినిస్తుంది. తట్రాయి కాలికి తగిలి బాధించిన సందర్భం సంతకానంతరం యాదికొస్తుంది.

( పుట – 96 )

“కన్న వూరును ఆ వూరి సంస్కృతినీ మర్చిపోతే మనం మనుషులమెట్లా అయితం. వూరంటే మనల్ని ముందుకు నడిపే చైతన్యం, ఆకాశమంత అండ. వూరు లేనిదే మనము లేము. మన పుట్టుకల జాడలు ఆ వూర్లు. వూరి మల్టీ పొత్తిల్లపై మొలచిన జీవితాలు మనవి. వూరు కన్న కలలకు ప్రతిరూపాలం మనం. ఈ దేహపు గూడంతా మన వూరి ఆత్మను నింపుకున్న… పల్లె నుండి పట్నం దాకా ఎదిగినమంటే మన సంస్కృతిని మరవడం కాదు. మన సంస్కృతిని నలుదిశలా చాటడమే. పట్నం బొయ్యినా పరాయిదేశం బొయ్యినా మన అడుగులు మన పల్లె నుండి మొదలైన మట్టి పాదపుముద్రలే…

వూరు మనకిచ్చింది పిడికెడంత సంస్కృతి, గుప్పెడంత ఆత్మవిశ్వాసం

( పుట – 104 )

ఎగుడు దిగుడు డొంకలు జీవితపు పాఠాలు నేర్చుతున్నవి. వూరి పొలిమేర దాటిన బతుకులు మనుషుల విలువలు నేర్చుకుంటున్నయ్. దాటొచ్చిన ఒక్కో మైలూ గాయాల భావాలనే మిగుల్చుతున్నయ్. వెనకకు తిరిగి చూస్తే వూరే మళ్ళీ శరణంటూ దీవిస్తుంది. కన్న పేగు కదా మరి!

( పుట – 115 )

మబ్బు తెరలు చీల్చుకుంటూ భానుడు భగ భగ లేసిండు. ఎత్తిన పిడికిళ్ళ ఆశయం నెరవేరింది. కోట్ల గొంతుకల నినాదం ఫలించింది. రాలిన త్యాగాల గుర్తులు పువ్వులై వికసించినయ్. మట్టి ముసిముసిగా నవ్వుతుంది. అలల అంచులు గెలుపు తీరాన్ని తాకినయ్. భారత్ సిగలో తెలంగాణ సింగిడై లేసింది. ఆకాశం నిండా తెలంగాణ జెండా రెపరెపలాడుతోంది.

( పుట – 129 )

ఇలా నర్రా ప్రవీణ్ తన నవలలో సందర్బనుసారంగా కవితాత్మకతో నడిపాడు. నవలకు ప్రతీకాత్మకత ను చేకూర్చడానికి కవిత్వాన్ని ఆసరాగా తీసుకుని రచయిత సందర్భానుసారంగా వివిధ నేపథ్యమును, కథా చిత్రణను కవిత్వ రూపంలో అభివ్యక్తీకరించారు.

నవల ప్రారంభం,  సన్నివేశ చిత్రణ, కథా కథన నైపుణ్యం,  ప్రతీకాత్మక సన్నివేశాలూ ఇవ్వన్నీ పొత్తి నవలను కావ్య స్థాయికి చేర్చాయి.

నర్రా నవలా శిల్పంలోని ప్రధానాంశం కవితాత్మక వర్ణనలే. నర్రా ప్రవీణ్ లో మంచి కవి దాగున్నాడు. అతని భావుకత నే అతనిని భవిష్యత్తులో మంచి కవి నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు…

 – ఐ.చిదానందం
సెల్: 8801444335

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page