Praja Palana | తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..

  • బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం
  • తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి.
  • ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Praja Palana Dinotsavam | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన, ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్‌ 17న ఇదే హైదరాబాద్‌ గడ్డపై ఆవిష్కృతమైందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ అంటే త్యాగం… ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య అని. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని ఆ నాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఘన నివాళి అర్పిస్తున్న‌ట్లు తెలిపారు.  మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు అని  ఈ శుభదినాన్ని ఎలా నిర్వచించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కొందరు విలీన దినోత్సవమని, కొందరు విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అందుకే… ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ… ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష… వారి ఆలోచన. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. మనం జాగ్రత్తగా గమనిస్తే… తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. పిడికిలి పోరాటానికి చిహ్నం.. తెలంగాణలో అన్ని జాతులు, అన్ని కులాలు, మతాలు కలిసికట్టుగా  ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం క్షమించరాని విషయమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదని,  ఐక్యంగా, సమైక్యంగా  ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలికి ఉన్నంత శక్తి ఉంద‌ని, ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. పెత్తందార్లపై, నియంతలపై ఈ పిడికిలి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి. గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్‌ 17. నేను పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాను. తెలంగాణను నియంత పాలన నుండి విముక్తి చేస్తానని చెప్పాను. గజ్వేల్‌ గడ్డ మీద 2021 సెప్టెంబర్‌ 17 నాడు ‘‘దళిత – గిరిజన ఆత్మగౌరవ దండోరా’’ మోగించినం. 2023 డిసెంబర్‌ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి… ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి. అమరుల ఆశయాలు ఉండాలి… యువత ఆకాంక్షలు ఉండాలి. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.

‘పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. తెలంగాణ సంస్కృతి అంటే మా ఇంటి సంస్కృతి, తెలంగాణ అస్థిత్వం అంటే మా కుటుంబ అస్థిత్వం అని గత పాలకులు భావించారు. తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉందని భ్రమించారు. మన సంస్కృతిని, మన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే ఉద్ధేశం వారికి లేదు. నిజాంనే మట్టికరిపించిన చరిత్ర తెలంగాణకు ఉన్నదన్న విషయం విస్మరించారు. మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా… అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాను. అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం. తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం TS ను TG గా మార్చాం. ఇది కేవలం అక్షరాల మార్పు కాదు… ప్రజల ఆకాంక్షల తీర్పు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇటీవలే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్‌ 9 నాడు మన తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్‌ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం.’ ఇలా… ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగుతున్నామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page