దేశవ్యాప్తంగా జన గణనకు సన్నాహాలు!

వొచ్చే ఏడాది నుంచి ప్రారంభం..
2028లో లోక్ స‌భ‌ నియోజకవర్గాల పునర్విభజన

ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 28 : న్యూదిల్లీ : జన గణనకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2025లో జనగణనను ప్రారంభించాలని కేంద్రంలోని మోదీ సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2025లో మొదలై 2026 వరకూ జన గణన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు.. దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

2028 నాటికి లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించినట్లు పేర్కొన్నాయి. మన దేశంలో జన గణన ప్రక్రియ ప్రతీ పదేళ్లకొకసారి జరుగుతుంది. చివరిగా.. 2011లో దేశ జనాభాను లెక్కించారు. 2011లో జరిగిన జనాభా లెక్కలు ఇతర సర్వేల ద్వారా దేశంలో సుమారు 41% ఓబీసీలు, 19.59% షెడ్యూల్డ్ కులాలు, 8.63% షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు 30.8% ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇతరులుగా పేర్కొన్న 30% లో ఓసీల సంఖ్యను కూడా జత చేయడం జరిగింది.

వాయిదాల పర్వం..
ప్రతి పదేళ్లకోసారి ఆనవాయితీగా నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా వాయిదా పడుతూ వొస్తుంది . రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేసేందుకు ఈ జనగణనే కీలకం. కొవిడ్‌ సంక్షోభం 2021 సెన్సస్‌కు ప్రతిబంధకంగా మారింది. తర్వాత ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొద్దినెలల క్రితం మాట్లాడుతూ..‘‘తగిన సమయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాం. దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో నేను ప్రకటిస్తాను. ఈసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఈ సర్వే ఉంటుంది’’ అని వెల్లడించారు.

నిరుడు ఏప్రిల్‌లో చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా ఆవిర్భవించినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్ల కన్నా భారతీయ జనాభా రెండు కోట్లు అధికమన్నది ఒక అంచనాయే తప్ప.. కచ్చితమైన లెక్కలు లేవు. వేర్వేరు పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న నీతి ఆయోగ్‌ లెక్కలు వెల్లడించాయి. సరైన గణాంకాలు లేకుండా ఈ ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే జనగణన ఒక కొలిక్కి వొచ్చేదాకా నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణా ఆగాల్సిందే. ఇదిలాఉంటే.. కులగణన గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర డిమాండ్లు వొస్తున్నాయి. ఈ తరుణంలో తాజా వార్తలు వొచ్చాయి. అయితే ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారత్ లోనే..
గతేడాది ఏప్రిల్‌లో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్ల కన్నా భారతీయ జనాభా రెండు కోట్లు ఎక్కువనేది అంచనా మాత్రమే. దీనికి కచ్చితమైన గణాంకాలు, ఆధారాలు లేవు. వివిధ ప్రభుత్వ పథకాలకు 2011 నాటి గణాంకాలను ప్రామాణికంగా తీసుకుని లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page