దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయాం

రతన్‌ టాటా మృతికి రాష్ట్రపతి , ప్రధాని, విపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళి అర్పిస్తూ గురువారాన్ని సంతాప దినంగా ప్రకటించింది. అలాగే రతన్‌ టాటా మృతికి సంతాపం తెలుపుతూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ గురువారం సంతాప దినం ప్రకటించారు. రతన్‌ టాటా మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌ ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందన్నారు. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని ఎక్స్‌ వేదికగా ఆమె కొనియాడారు. రతన్‌ టాటా మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రతన్‌ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపార వేత్త అని మోదీ కొనియాడారు. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వం అందించారని, మెరుగైన సమాజం కోసం ఆయన కృషి చేశారన్నారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్‌ టాటా శాశ్వత ముద్ర వేశారని ఎఐసిసి అగ్రనేత రాహుల్‌ ప్రశంసించారు. పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాదిని భారత్‌ కోల్పోయిందని బాధను వ్యక్తం చేశారు. రతన్‌ టాటా నిష్కమ్రణ పారిశ్రామికరంగానికి, దేశానికి తీరనిలోటు అని అన్నారు. నిబద్దత, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి రతన్‌ టాటా అని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page