టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

  • స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో రోడ్‌ ‌షో
  • లక్ష్మీ విలాస్‌ ‌ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీ

గాంధీనగర్‌, అక్టోబర్‌ 28 : ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్‌ ‌షో నిర్వహించారు. సోమవారం ఇరుదేశాధి నేతలు చారిత్రాత్మకమైన లక్ష్మీ విలాస్‌ ‌ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. కాగా టాటా అడ్వాన్స్‌డ్‌ ‌సిస్టమ్స్‌కు చెందిన ఈ ఫెసిలిటీని సైనిక విమానాల తయారీ కోసం ఉపయోగిస్తారు. మన దేశంలో మొట్టమొదటి ప్రైవేటురంగ ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌ ఇదే కావడం గమనార్హం. ఒప్పందంలో భాగంగా ఈ ఫెసిలిటీలో మొత్తం 40 విమానాలను తయారు చేస్తారు.

ఏవియేషన్‌ ‌దిగ్గజ కంపెనీ ‘ఎయిర్‌బస్‌’ ‌నేరుగా 16 విమానాలను భారత్‌కు అందించనుంది. టాటా-ఎయిర్‌బస్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ఫెసిలిటీ ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. సైనిక విమానాల తయారీ కోసం భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రైవేట్‌ ‌రంగ ప్లాంట్‌ ఇదేనని తెలిపింది. ‘‘టాటా అడ్వాన్స్‌డ్‌ ‌సిస్టమ్స్ ‌లిమిటెడ్‌ ‌భారత్‌లో 40 విమానాలను తయారు చేసే బాధ్యతలు తీసుకుంటుంది. ఈ ఫెసిలిటీ దేశంలోనే తొలి ప్రైవేట్‌ ‌సెక్టార్‌ ‌ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌గా నిలిచింది. తయారీ నుంచి అమరిక వరకు సమస్థ వ్యవస్థ ఇక్కడే ఉంటుంది.

విమానాలను టెస్టింగ్‌ ‌చేయడం నుంచి డెలివరీకి అవసరమైన అర్హత ప్రమాణాలను కూడా ఇక్కడే నిర్వహిస్తారు’’ అని పేర్కొంది. కాగా టాటా కంపెనీలతోపాటు భారత్‌ ఎలక్ట్రానిక్స్ ‌లిమిటెడ్‌, ‌భారత్‌ ‌డైనమిక్స్ ‌లిమిటెడ్‌ ‌వంటి ప్రముఖ ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రైవేట్‌ ‌రంగానికి చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు కూడా తమ సహకారాన్ని అందించనున్నాయి. కాగా వడోదరలో ఏర్పాటు చేసిన ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌కు అక్టోబర్‌ 2022‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడంతో సోమ‌వారం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page