విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతినిధి ఆవుల నాగరాజు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, తాగునీరు అందక ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల మరమ్మతులు, తాగునీటి కులాయిల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలు పరిష్కరించడకుండా సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. మండల కేంద్రాలలోని జూనియర్ కళాశాలలో సైన్స్ ప్రయోగశాలు అందుబాటులో లేవని, జూనియర్ కళాశాలల్లో ఖాలీగా ఉన్న 1,392 లెక్చరర్ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు. తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో 1,977 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ నియామకం చేపట్టడం లేదన్నారు. ప్రొఫెసర్లు లేక యూనివర్సిటీలలో విద్యాబోధన, పరిశోధనలు నిలిచిపోయాయన్నారు.

ప్రభుత్వ యూనివర్సిటీను బలోపేతం చేయకుండా స్కిల్ వర్సిటీ పేరుతో ఆదాని, మెగా కృష్ణారెడ్డి లాంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు విద్యారంగంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అన్నారు. పెండింగ్‌ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయి నిధులను విడుదల చేయడంలేదన్నారు. ఎన్నికలకు ముందు మానిపేస్టోలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు శ్రీచైతన్య, నారాయణ, వెలాసిటీ, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అనురాగ్, మహేంద్ర వంటి కార్పొరేట్, ప్రైవేటు విద్యసంస్థల వ్యాపారానికి వత్తాసు పలుకుతున్నారన్నారు. తక్షణంగా ఫీజు నియంత్రణ కమిటీ వేయాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల్లో నెలకొన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్.రాజశేఖర్, హరీష్, ఆనంద్, విశాల, కుమార్, హేమంత్, సాయికుమార్, లక్ష్మికాంత్ పాల్గొన్నారు.

కాగా ఈ స‌మావేశంలో సంఘం నేత‌లు ప‌లు డిమాండ్లు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు. ఉపాధ్యాయల కేటాయింపులలో డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో పెరిగిన మెస్ చార్జీలను తక్షణం అమలుచేస్తూ నాణ్యమైన భోజనం, మంచినీరు అందించి, ఫుడ్ పాయిజన్ ఘటనలు నివారించాల‌న్నారు. సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు పక్కా భ‌వ‌నాలు నిర్మించి, హాస్టళ్ళలో వార్డెన్ వంట మనుషులు, కాపలాదారు పోస్టులు భర్తీ చేయాల‌ని కోరారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆ కళాశాలల్లో ప్రయోగ శాలలను నిర్మించాల‌ని, ఐటిఐ, వొకేషనల్ కళాశాలల బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ వర్సిటీలలో తక్షణమే 1977 ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలి. యూనివర్శిటీలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్ల నిర్మాణం చేపట్టి, పీజీ విద్యార్థులకు నెలకు రూ.5 వేలు, పీహెచ్డీ విద్యార్థులకు రూ.10 వేలు స్కాలర్షిప్ మంజూరు చేయాలి. విశ్వ విద్యాలయాలలో పెంచిన ట్యూషన్ ఫీజులు వెనక్కి తీసుకోవడంతోపాటు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలి. ప్రవేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీ అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని చేసి, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాల‌ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page