ఏర్పాట్లపై కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : రేపు 17న జరుగనున్న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలనా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం జీఏడి కార్యదర్శి రఘునందర్ రావుతో కలిసి సీఎస్ జిల్లా కలెక్టర్లతో ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..ప్రధాన వేడుకలు నిర్వహించే పబ్లిక్ గార్డెన్స్, అమర వీరుల స్థూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నందున ఏలాంటి లోటు పాట్లూ లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఈ సందర్భంగా సూచించారు. వేడుకలకు ప్రజాప్రతినిధులు, అన్ని కార్పొరేషన్‌ల చైర్మన్‌లకు ఆహ్వనం అందేలా కలెక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. ఉదయం 10 గంటలకు జెండా వందనం జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పలువురు ప్రముఖులు హైదరాబాద్‌లో జరిగే ప్రధాన వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్‌లు వారి వారి జిల్లాలలో ఉన్న ప్రముఖులు ఎక్కడ హాజరవుతారో అనే సమాచారం తెలుసుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.