సీఎం రేవంత్ చొరవతో నిమ్స్ లో చికిత్స
నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాలతో గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్ లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా మెరుగుపడవొచ్చనే ఆశతో కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈనెల 1న ఖతార్ నుంచి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించింది. పేషెంట్ ను ఆదివారం సాయంత్రం ప్రైవేట్ హాస్పిటల్ నుంచి నిమ్స్ కు తీసుకొచ్చారు.
తమకు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య ఖర్చులు భరించే స్థోమత లేదని, నిమ్స్ లో అడ్మిషన్ ఇప్పించి, ఉచిత వైద్యం అందించాలని సాయన్న భార్య ప్రేమల, కుమారులు వికాస్, వినీత్ లు సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు విడుదల చేసిన వీడియో విజ్ఞప్తికి, అంతకు ముందు పంపిన వినతి పత్రానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి ఎస్.వెంకట్రావు, సెక్షన్ ఆఫీసర్ ఇ.చిట్టిబాబు చొరవ తీసుకుని నిమ్స్ లో అడ్మిషన్ కు అనుమతి మంజూరు చేయించారు.
గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో గల్ఫ్ తదితర దేశాల్లో పనిచేసే ప్రవాసీ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుంచి తొలగించినందున వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదని కాంగ్రెస్ ఎ న్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అన్నారు. అచేతన స్థితిలో ఖతార్ నుంచి స్వదేశానికి వొచ్చిన పేద వలస కార్మికుడు సాయన్నను అక్కున చేర్చుకొని నిమ్స్ లో చికిత్స అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.