అంచనాకు అందని విధ్వంసం..

  • అడవినీ వదలని వరుణుడు
  • కనీవినీ ఎరుగని రీతిలో నేల కూలిన భారీ వృక్షాలు
  • సమగ్ర విచారణకు ఉపక్రమించిన అటవీ శాఖ
  • టోర్నడో కారణం కావొచ్చని అనుమానం

ఇటీవల కురిసిన భారీ వర్షాల నుండి ఇంకా ప్రజలు కోలుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన నష్టం ఒక ఎత్తయితే ఖమ్మంలో జరిగిన నష్టం అంచనాకు అందనంతగా ఉంది. ఇంత భారీ నష్టాన్ని కలలో కూడా ఊహించని ఖమ్మం ప్రాంత ప్రజలు ఇంకా షాక్‌ నుండి కోలుకోలేకపోతున్నారు. ఇండ్లలోని వస్తువులన్నీ ధ్వంసం అవడం ఒకటైతే, బురదమయమైన ఇంటిని శుభ్రపర్చుకోవడం శక్తికి మించిన పనిగా తయారైంది. ఒక్కో ఇంటిని శుభ్రపర్చుకోవడానికి నీటిని సమకూర్చుకోవడం కూడా పెద్ద సమస్యగానే ఉంది. ఇక గూడు చెదిరిన వారి సంగతి చెప్పనలవి కాదు. కట్టుబట్టలతో సహా అన్నీ బజారున పడేసి వాటివంక దీనంగా చూడడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. ఇదిలా ఉంటే వరణుడి తాకిడికి అడవి కూడా అతలాకుతలమయింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ములుగు-ఏటూరునాగారం ప్రాంతంలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఎవరూ ఊహించని విధ్వంసం చోటుచేసుకుంది. ఇది ఎలా జరిగిందన్న విషయాన్ని ఎవరూ వివరించే పరిస్థితి లేదు. గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఏనాడు కనీవినీ ఎరుగని రీతిలో అడవిలోని వృక్ష సంపద అంతా నేలపాలైంది.

ఒకటా రెండా దాదాపు డెబ్బై నుండి ఎనభై వేల చెట్లు పడిపోవడం చూస్తుంటే ఎవరో కావాలని ఈ అరాచకానికి పాల్పడ్డారా అన్న అనుమానం కలుగకపోదు. దేశంలో అనేక రకాల తుఫాన్లను చూశాం. తిత్లీ, హుద్‌హుద్‌, అంఫస్‌, మాండూస్‌, మాఫ, ఆస్నా ఇలా అనేక తుఫాన్లలో జరిగిన బీభత్సానికి భిన్నంగా ఏటూరునాగారంలో సుమారు అయిదు వందల ఎకరాల మేర ఈ విధ్వంసం జరిగింది. ఇందులో సుమారు వంద ఏళ్ళకుపై పడిన వృక్షాలతోపాటు అనేక మూలికలకు సంబంధించిన వృక్ష సంపదంతా నాశనమైంది. కొన్ని చెట్లు మొదలంటా పెరికి వేసినట్లు పడిపోగా, మరికొన్ని కాండం మధ్యలో విరిగి పడి ఉన్నాయి. అంటే కనీసం 120 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలి వీచితేనే ఇంత ఉపద్రవం సంభవించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఇదే కారణమని అటు వాతావరణ నిపుణులుగాని, ఇటు ఫారెస్టు అధికారులు గాని అంచనా వేయలేకపోతున్నారు.

ఇంత ఆశ్చర్యకర సంఘటన సరిగ్గా అయిదు రోజుల కింద అంటే ఆగస్టు 31 సాయంత్రం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జరగటం మరింత ఆశ్చర్యానికి కారణమైంది. వరుసగా నాలుగు రోజులపాటు కుండపోతగా వర్షం పడుతుండడంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. అదే దారిలో రాష్ట్ర మంత్రి సీతక్క రెండు రోజుల క్రితం వొచ్చినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్న అడవి ఇంత కల్లోలంగా మారడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. గతంలో ఎన్నడూ ఎరుగని ఈ విధ్వంసానికి కారణాన్ని అధ్యయనం చేయాల్సిందిగా అమె అధికారులను ఆదేశించారు కూడా. జిల్లా ఫారెస్టు అధికారి రాహుల్‌ జావేద్‌ అధ్వర్యంలో ఏర్పడిన ఒక బృందం ఇప్పుడు దీనిపైన సమగ్ర విచారణకు ఉపక్రమించింది. ఉపగ్రహ డేటా, భారత వాతావరణశాఖ(ఐఎండి). నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సి)తో కలిసి దీనిపైన పరిశీలన జరుపుతున్నారు. అయితే ప్రాథమికంగా దీనికి టోర్నడో సుడిగాలి కారణమై ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. టోర్నడో సుడిగాలి అన్నది సాధారణంగా అమెరికాలో తరుచూ సంభవిస్తూ ఉం టుంది.

ఇసుక సుడిగుండాలతో ఆకాశంలోకి సుళ్ళు తిరుగుతూ ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తుంది టోర్నడో. ఇది అమెరికాలో సంభవించినప్పుడు కార్లను కూడా అవలీలగా గాలిలోకి లేపి విసిరేసిన సంఘటనలున్నాయి. మన పక్క రాష్ట్రం ఆంధ్రలో కూడా ఒకటిరెండు సార్లు ఇది సంభవించినట్లు చెబుతున్నారు. 2018, 2020ల్లో రెండుసార్లు కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే కూనవరంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో వొచ్చిందంటారు. సుమారు పదిహేను నిమిషాల నుండి అరగంట వరకు ఇసుక తుఫాన్‌గా మారిందని చెబుతారు. సాధారణంగా తుఫాన్‌ ప్రభావం అంటే గాలితో కూడిన తీవ్ర వర్ష ప్రభావాన్ని చూశాం. దానివల్ల భారీగా వర్షపాతం నమోదు అవడాన్ని చూశాం. కాని ఒకే దిక్కుగా పయనించి వందల ఎకరాల్లోని మహా మహా వృక్షాలను పడవేయడమన్నదాన్ని మొదటిసారిగా చూస్తున్నాం.

సుమారు 500 ఎకరాల్లో 15 కిలోమీటర్ల రేడియస్‌లో అసలు ఇక్కడ అడవి ఉండేదా అనిపించే విధంగా చేసిన మానవాతీత శక్తి టోర్నడోదే అయి ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రస్తుతానికి అధికార యంత్రాంగం నిర్ధారించుకుంటున్నది. వాస్తవానికి టోర్నడో చెట్లతో నిండిన అటవి ప్రాంతంలో వొచ్చే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్న మాట. అయినా ఎలా సంభవించిందన్న దానిపైన శోధన చేపడుతున్నారిప్పుడు. ప్రస్తుతం డ్రోన్ల సహాయంతో విధ్వంసమైన ప్రాంతాన్ని అంచనా వేస్తున్నప్పటికీ ఇందుకు ఏర్పడిన బలమైన కారణాన్ని పరిశోధించాలంటున్న మంత్రి సీతక్క. తిరిగి అటవీ సంపదను వృద్ధి చేసే విషయంలో కేంద్రం కూడా సహకారాన్ని అందించాలని విజ్ఞప్తిచేస్తున్నది. ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇదొక విచిత్రకర పరిణామం. ఎంతో అహ్లాదకరంగా కనిపించే ఏటూరునాగారం అడవుల్లో ఇంత ఘోర విపత్తు జరుగుతుందని ఏనాడు ఎవరూ కనీసంగా నైనా ఊహించి ఉండరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page