- కుర్చీ కోసం విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదు..
- నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో పని చేయలేదు..
- ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి.
- ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి….
నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో పని చేయలేదు… తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.. దానిని వారు పెట్టుబడిగా మార్చుకున్నారు. మాది రైజింగ్ తెలంగాణ, రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు పంచడమే తెలంగాణ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేశా… ఈ దఫా 400 సీట్లు అన్న వారు… 240 సీట్లు సాధించారు… కాంగ్రెస్ 40 నుంచి వందకు చేరింది.. నెంబర్లు చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది. ఇది బీజేపీ ఓటమి కాదు.. మోదీ ఓటమి. ప్రతి దానికి మోదీ ముద్ర వేశారు.. మోదీ గ్యారంటీ అన్నారు… మోదీ గ్యారంటీకి సంబంధించిన వారంటీ పూర్తయిందని నేను ఎన్నికలకు ముందే చెప్పాను. ఇప్పుడు నాయుడు, నితీశ్ కొందరి సహకారంతో ప్రభుత్వం నడుస్తోంది.. ఇది మోదీ ఓటమే…
* సర్కార్ ఏర్పాటు చేయడమే కాదు.. పదేళ్లలో మోదీ ఈ దేశ ప్రజలను ఎలా మోసం చేశారో చెప్పగలిగాం. అన్నదాతలకు వ్యతిరేకంగా పని చేశారు.. రాజ్యాంగం రద్దుకు మోదీ ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది మేం చెప్పగలిగాం.. బీజేపీ రహస్య జెండాను బయటపెట్టాం.. బీజేపీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల ముందు చెప్పే అజెండా వేరు..
యాంకర్ : కాంగ్రెస్ గత అయిదు నెలల్లో ఏం నేర్చుకుంది…?
రేవంత్ రెడ్డి: నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా… కాంగ్రెస్ ఫార్మాట్ మార్చుకోవాలి… కాంగ్రెస్ నాయకులు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… ఇప్పుడు 20-20 ఫార్మాట్ నడుస్తోంది. మేం ఫార్మాట్ ఆడాలి. లేదా ఫార్మాట్ మార్చుకోవాలి.. బీజేపీ ఉంచడమో.. ఖతం చేయడమో తీరులో ఉంటుంది. మాకు మానవీయ స్పర్శ ఉంటుంది. మేం అలా చేయం.. అవసరాలు.. వ్యాపార రీతిలో బీజేపీ రాజకీయాలు ఉంటాయి.. కాంగ్రెస్ తాతతండ్రులను గుర్తుపెట్టుకుంటుంది.. వారి సంక్షేమానికి కృషి చేస్తుంది..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై…
రేవంత్ రెడ్డి: ప్రతి నేత కుర్చీపై ఆలోచిస్తారు.. కుర్చీ కోసం విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదు.. ఎన్నికలు గెలుపుఓటముల ప్రాధాన్యం కాదు.. విభజన రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఎన్నికల గురించే మోదీ ఆలోచిస్తారు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష ఉండదు… ఎంత మంచి ఔషధానికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.. ఇప్పుడు విభజన కార్యక్రమాలకు గడువు ముగిసింది.
ఆ కుటుంబం అన్ని త్యాగాలు చేసినా ఓటర్లు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గడం లేదు..?
రేవంత్ రెడ్డి: తరాల అంతరం..(జనరేషన్ గ్యాప్).. గతంలో అమ్మమ్మనానమ్మలు వంట చేసేంత వరకు రెండు మూడు గంటలు వెయిట్ చేసేవాళ్లం.. లేదా మంచి హోటల్‌కు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు స్విగ్గీలో అర్డర్ ఇస్తే రెండు నిమిషాల్లో ఆర్డర్ వస్తోంది.. మనం అమ్మ, అమ్మమ్మ, నానమ్మలపై ఆధారపడడం లేదు.. స్విగ్గీపై ఆధారపడుతున్నాం.. ఇప్పడు రాజకీయాల్లోనూ స్విగ్గీ రాజకీయాలు ఎక్కువయ్యాయి… సరళీకరణ (లిబరలైజేషన్) తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు, అనుసంధానత తగ్గిపోయింది. సరళీకరణ తర్వాత మాకు ఎంత త్వరగా ఉద్యోగం వస్తుంది.. ఎంత త్వరగా సంపాదిస్తాం అని ఆలోచిస్తున్నారు. మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు మేమే వాల్ రైటింగ్ చేసేవాళ్లం..జెండాలు కట్టేవాళ్లం.. ప్రదర్శనలకు (ర్యాలీ) వెళ్లేవాళ్లం… మా జేబులోని డబ్బులు ఖర్చుపెట్టుకొని పని చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది.. ముఖ్యమంత్రిగా, మాజీ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న నేను ఎక్కువగా చెప్పకూడదు.. మీరే చెప్పండి.. మీరే అర్ధం చేసుకోండి.. ఎందుకు అదంతా మారింది. దానికి బాధ్యత బీజేపీ.. బీజేపీ తప్పిదాలు..
భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా వారు లబ్ధిపొందుతున్నారు… ఎన్నికల ముందు పుల్వామా, అయోధ్య రామమందిరం.. ఇలా ఏదో ఒక భావోద్వేగం రెచ్చగొడుతున్నారు.. బీజేపీకి జాతీయ ప్రయోజనాల కన్నా భావోద్వేగ రాజకీయాలు చేయడం తెలుసు…
రాజకీయాలు భావోద్వేగాలతో ముడిపడినవి.. వాటిని ఎలా అధిగమిస్తారు..?
రేవంత్ రెడ్డి: మీరు మూడో తరం పాత్రికేయుడు.. రామ్‌నాథ్ గోయెంకా… ఆనంద్ గోయెంకా.. తర్వాత మీరు.. మీరే చెప్పండి.. మీకు విస్తృతమైన అనుభవం ఉంది. అటువంటి వాటిని ఎలా అధిగమించవచ్చో చెప్పండి.. మీ కుటుంబం దేశానికి సేవ, త్యాగాలు చేసింది.. మీరే మాకు, దేశానికి సూచించండి..
అవకాశాల్లో ప్రతి ఒక్కరూ సమానమే.. ప్రతి ఒక్కరూ సంక్షేమం, అభివృద్ధిని ప్రభుత్వం నుంచి ఆశిస్తారు.. మమ్మల్ని విస్మరించే వాళ్లు మాకు అవసరం లేదంటారు.. రాజకీయాల్లో రెండు భాగాలున్నాయి. రామ్‌నాధ్ గోయెంకా నుంచి అనంత్ గోయెంకా వరకు ఒక వరస ఉంది.. రాహుల్ గాంధీ విషయంలోనూ అదే తీరు.. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ.. ఇది మా కుటుంబం బాధ్యత అనుకుంటారు… వాళ్లు లాభనష్టాలు చూసుకోరు… మరో భాగానికి వస్తే మా నాన్న రైతు. నేను రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రెండు వర్గాల ప్రజల ఆలోచన విధానాలు వేర్వురుగా ఉంటాయి.. ఒకరిది బాధ్యతాయుత రాజకీయాలు.. మరొకరిది రాజకీయాల్లో రావాలనే ఆకాంక్ష.. కొత్త తరం వారికి త్వరగా కుర్చీలో కూర్చోవాలనే తాపత్రయం.. ఈ క్రమంలో లెక్కలు మారుతున్నాయి..
కాంగ్రెస్ కు జాతీయ దృక్ఫథం ఉంది.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. రాహుల్ గాంధీ ప్రభుత్వ వ్యవహారాల్లో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు… 2014 నుంచి 2024 వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా రాహుల్ గాంధీ మైదానాన్ని వీడలేదు…కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు.. ఈ దేశ ప్రజల కోసం ఏ నేతైనా అంత దూరం పాదయాత్ర చేశారు… మణిపూర్‌లో అల్లర్లు జరిగితే మణిపూర్ నుంచి ముంబయి వరకు పాదయాత్ర చేశారు.. దేశంలో పవర్
పాలిటిక్స్‌కు గాంధీ కుటుంబం దూరంగా ఉంటుంది.. అల్లర్ల సమయంలో విద్వేష వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచేందుకు మేం ప్రయత్నిస్తున్నానని రాహుల్ గాంధీ తెలిపారు… దానిపైనా వారు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.. వాట్సాప్ యూనివర్సిటీ రోజులు ముగిశాయి.. మాట్లాడితే కుటుంబ రాజకీయాలు అంటున్నారు.. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరైనా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అయ్యారా..? మీరే చెప్పండి.. ఆ కుటుంబం అంత త్యాగాలు ఎవరు చేశారో చెప్పండి.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారు.. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పదేళ్లకుపైగా జైలు జీవితం గడిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రధానమంత్రి పదవి స్వీకరించే అవకాశం వచ్చినా వదులుకున్నారు… మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలకు ఉన్నత స్థానాల్లో అవకాశం ఇచ్చారు… పి.వి.నరసింహారావును ప్రధానమంత్రిని పని చేశారు. రాహుల్ గాంధీ అనర్హత వేటు వేశాక ఆయన తుగ్లక్ రోడ్డు నుంచి ఇల్లు ఖాళీ చేయిస్తే వెళ్లడానికి ఆయనకు ఇల్లు లేదు.. దేశంలో మూలమూలన ఉన్న ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి.. కానీ అదే ఇందిరమ్మ మనవడికి ఉండడానికి ఒక్క గది లేదు. పైగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.. ఆ రాష్ట్రం ఏటీఎం.. ఈ రాష్ట్ర ఏటీఎం అని ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోదీ అంటున్నారు.. ఎవరో కార్యకర్త, చిన్నాచితకా నేత అంటే వదిలేయవచ్చు.. గాంధీ కుటుంబానికి తెలంగాణ ఏటీఎం మోదీ అంటున్నారు. అది సరైంది కాదు..
గాంధీ కుటుంబానికి పైసలు అవసరమైతే.. ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమిటి..? సొంత ఇల్లు.. సొంత వాహనాలే లేనప్పుడు వాళ్లకు పైసలు ఎందుకు..?
రేవంత్ రెడ్డి: మీ తాత ఎమర్జెన్సీకి, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పోరాడారు.. ఆయనకు ఒక పాయింట్ ఉంది.. కానీ దేశంపైనా అటువంటి అంకితభావం క్రమేణా తగ్గిపోతోంది..దేశంలో ప్రతి ఒక్కరికి ఆ అంకితభావం పెరిగేలా చూడాలి. అందుకే రీఓరియెంటేషన్ చేయాల్సిన అసవసరం ఉంది.. మన సిలబస్ మార్చాలి.. కంప్యూటర్ గురించి చదువు.. చదువు.. ఉద్యోగం వస్తుంది అంటున్నారు..ఎల్‌కేజీ నుంచి ఆ ఒత్తిడి ఉంటోంది. నా మనవడు 18 నెల ల వాడిని స్కూల్‌లో వేయాల్సి రావడం నాకు అశ్చర్యం.. ఈ విధానం మారాలి.. తల్లిదండ్రులు అంతగా దృష్టిపెడుతున్నారు… దానిని మార్చాలి.. స్వాతంత్య్రం రావడానికి కారకులు, మంచి చేసే వారిపై చర్చ సాగాలి. పార్లమెంట్‌లో చర్చకు వారు ముందుకు రావడం లేదు… ఈ దేశంలో 140 కోట్ల ప్రజలు కూడలిలో ఉన్నారు.. ఈ దేశంలో సిద్ధాంతపరమైన రాజకీయాలా..? స్విగ్గీ రాజకీయాలా..? కూటమి ప్రభుత్వాలా..? ప్రభుత్వం ఏర్పడితే చాలా.. ఎటు వెళ్లాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు.. అయితే రీఓరియెంటేషన్ అవసరం.. తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నిస్తే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కవు…
తెలంగాణ మోడల్… గుజరాత్ మోడల్‌పై..?
రేవంత్ రెడ్డి: తెలంగాణ రైజింగ్… ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడం తెలంగాణ మోడల్… సుపరిపాలన తెలంగాణ మోడల్.. దాని అర్ధం… సంక్షేమం.. అభివృద్ధి.. కేవలం సంక్షేమం చేపడితే అభివృద్ధి ఉండదు.. కేవలం అభివృద్ధిపై దృష్టి పెడితే పేదలకు ఏం దక్కదు.. ఈ రెండింటిని సమతుల్యం చేయాలి.. అదే సుపరిపాలన.. దానిని దృష్టిలో పెట్టుకుంటున్నాం.. సోనియా గాంధీ 2023, సెప్టెంబరు 17న ఆరు గ్యారంటీలు ఇచ్చారు…దానికి అదనంగా నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మరో గ్యారంటీ ఇచ్చాను. పదేళ్ల కేసీఆర్ హయాంలో పదిసార్లు సచివాలయానికి రాలేదు.. నేను పది నెలల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళుతున్నా.. ప్రతిపక్షంలో ఉండి శాసనసభకు రావడం లేదు. పదేళ్ల కాలంలో ఎవరైనా ఇబ్బందులు ఉండి ధర్నా చేయాలనుకుంటే అలా చేయడానికి వీలు లేకుండా ధర్నా చౌక్‌ను మూసి వేశారు. పోలీసులను కాపాలా పెట్టారు… నేను ధర్నా చౌక్ ఓపెన్ చేశాను.. ఇప్పుడు హరీశ్ రావు, కేటీఆర్ ఆ ధర్నా చౌక్‌కు వస్తున్నారు. వాళ్లు వారానికి రెండు సార్లు వచ్చి కూర్చొంటున్నారు. వాళ్లకు ధర్నా చౌక్‌లో నేను స్థలం ఇచ్చాను. మేం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామో చూడండి.. తెలంగాణ అప్రోచ్‌నే కాంగ్రెస్ అప్రోచ్.. తెలంగాణ రైజింగ్ కాంగ్రెస్ అప్రోచ్… 2004 నుంచి 2014 వరకు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి.. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు.. ఆయన గుజరాత్ మోడల్ కు ప్రచారం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకం కలిగించలేదు.. ఆయనకు అవసరమైన అనుమతులు, బడ్జెట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు… ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను ఖతం చేసేందుకు ఆయన స్థాయిలో ప్రయత్నిస్తున్నారు… ఆయనది గుజరాత్ మోడల్.. ఇది తెలంగాణ మోడల్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా పెట్టుబడిదారు ప్రయత్నిస్తే గుజరాత్ వెళ్లమని ప్రధానమంత్రి కార్యాలయం చెబుతోంది.. సెమీ కండక్టర్‌ను చూడండి.. ఇన్‌సెంటివ్స్ ఎవరికి ఇచ్చారు..ఆయనది గుజరాత్ మోడల్.. ఆయన ప్రధానమంత్రి. కానీ ఆయన గుజరాత్‌కు ప్రధానమంత్రిలా భావిస్తున్నారు.. గుజరాత్‌కు ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు.. అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని ప్రధానమంత్రి మోదీ చెబుతున్నారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లేకుండా ఎలా అది సాధ్యం.. మహారాష్ట్ర నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం.. ఆర్థిక రాజధాని. రాజకీయంగా రెండో ప్లేస్‌లో ఉండవచ్చు… మహారాష్ట్ర నుంచి 17 భారీ పెట్టుబడులు గుజరాత్‌కు తరలించారు… ఈ విధానం సరైంది కాదు.. ప్రధానమంత్రి జడ్జిలా ఉండాలి.. ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోకూడదు. నేను ఫుట్‌బాల్ క్రీడాకారుడిని.. రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదు.. ఆయన గుజరాత్ తరఫున ఆడుతున్నారు.. ఇది దేశానికి మంచిది కాదు.. పెట్టుబడులకు వాతావరణం అనుకూలించాలి.. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఫార్మాకు అనుకూలం.. ఐటీ, ఫార్మా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు హైదరాబాద్ వైపు చూస్తారు. కానీ వారిని అహ్మదాబాద్ వెళ్లాలని ఒత్తిడి చేస్తే ఎలా..? ఇటువంటి సంకుచిత దృష్టి దేశానికి మంచిది కాదు… మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులకు మోదీ ఇద్దతు ఇస్తే ప్రతి రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ తయారు చేయగలం… మేం ఆరు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించగలం..అప్పుడు మోదీ పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలగనవచ్చు.. కానీ ఆయన గుజరాత్ గురించి మాత్రమే ఆలోచించడం సరికాదు..
ఉత్తర-దక్షిణాది అంతరాలపై..?
రేవంత్ రెడ్డి: మీ ప్రశ్నలోనే వివక్ష ఉంది.. మీరు దక్షిణాది వారైనప్పటికీ ఉత్తరాదిని మొదట చెప్పారు.. ఉత్తరాది ప్రాధాన్యం అనేలా చెబుతున్నారు.. (యాంకర్: సరిచేసుకుంటాను)..(నవ్వులు..) వాళ్లు మిమ్మల్ని అలా ప్రభావితం చేస్తున్నారు.. అలా ఒత్తిడి రాజకీయాలు చేస్తున్నారు…
మేం (దక్షిణాది రాష్ట్రాలు) దేశానికి ఎంతో కంట్రిబ్యూట్ చేస్తున్నాం…నేను, రెండుమూడు ఉదాహరణలు చెబుతున్నా.. మా రాష్ట్రం నుంచి ఒక రూపాయి దేశానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 40 పైసలు వెనక్కి పొందుతున్నాం.. బిహార్ రూపాయి ఇస్తే వెనక్కి రూ.7.06 పొందుతున్నారు.. ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి ఇచ్చి రూ.2.73 పొందుతున్నారు..జనాభా ఆధారంగా వారు నిధులు పంచుతున్నారు. కొంచెం వెనక్కి వెళితే జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చింది. ప్రతి దక్షిణాది రాష్ట్రం కుటుంబ నియంత్రణ విధానాన్ని పాటించింది. మంచి పౌరులుగా మేం వాటిని అమలు చేశాం.. దానికి మమ్మల్ని శిక్షిస్తున్నారు..అందుకే నీతీఆయోగ్ తెలంగాణకు వస్తే జనాభాకు 50 శాతం.. ప్రగతిని చూసి 50 శాతం నిధులు ఇవ్వాలని చెప్పాను. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో 50 శాతం రిజర్వేషన్లు.. 50 శాతం మెరిట్‌ను చూడమంటుంది. దానినే అనుసరించాలి.. జనాభా ఆధారంగానే ఇస్తే ఎలా..?
ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన.. సీట్ల పెంపుపై చర్చ సాగుతోంది.. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. 2025 జనాభా లెక్కల ప్రకారం వాళ్లు 800కుపైగా సీట్లు పెంచాలనుకుంటే..ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దక్షిణాది ఓట్లు అవసరం లేదు… ఇప్పడు దక్షిణాదిలో 123 సీట్లున్నాయి… ఇంకా తగ్గుతాయి.. అప్పుడు మా పాత్ర (దక్షిణాది రాష్ట్రాల) చాలా తక్కువగా ఉంటుంది. లేదా విస్మరించదగిన స్థితిలో ఉంటుంది.. మేం ఆర్థిక వ్యవస్థకు ఇంతగా కంట్రిబ్యూట్ చేస్తుంటే… ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తుంటే.. మమ్మల్ని శిక్షిస్తే ఎలా..? మేం నోరెత్తకుండా ఎలా ఉంటాం. మా హక్కులను రక్షించుకునేందుకు సహజంగానే దక్షిణాది-ఉత్తరాది వాదన వస్తుంది.
ఈ సమస్య పరిష్కారం ఎలా..?
రేవంత్ రెడ్డి: ఈ విషయంలో మార్గదర్శకాలపై భారత ప్రభుత్వం చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. పునర్విభజనకు 1971 జనాభా లెక్కలు మూలం.. తర్వాత జనాభా నియంత్రణ వచ్చింది.. ఇప్పుడు స్టాలిన్.. ఎన్డీఏ మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు జనాభా పెంపుపై మాట్లాడుతున్నారు..
యాంకర్: ఎక్కువ మంది పిల్లలను కనాలని వాళ్లు నేరుగా చెబుతున్నారు.?
రేవంత్ రెడ్డి: జాతీయ పార్టీలో ఉన్న నాకు కొన్ని పరిమితులున్నాయి. పార్టీ ఈ అంశాలపై మార్గదర్శకాలు ఇస్తుంది. కార్యకర్తగా వాటికి నేను కట్టుబడి ఉంటాను. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ప్రధానమంత్రి… కేంద్ర ప్రభుత్వం వీటిపై స్పష్టత ఇవ్వాలి.. లేకుంటే దేశంలో భారీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది..
దక్షిణాదిలో మేం విద్యాపరంగా, ఆర్థికపరంగా కచ్చితమైన విధానాలు పాటించాం.. పునర్విభజనపై మొదలు చర్చ మొదలుపెట్టాలి.. నియోజకవర్గాలపై కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దేశం మూలమూల తిరిగి అభిప్రాయాలు స్వీకరించాలి.. మార్గదర్శకాలపై ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి..
దక్షిణాది రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లడమే కాదు..వెనక్కి రావడానికి ఆసక్తి ఉన్నారు. కానీ ఇక్కడ జాగా లేదు… భారత ప్రభుత్వం జాగా ఇస్తే వస్తారు.. సిలికాన్ వ్యాలీ తెలుగు వాళ్లపై ఆధారపడి ఉంది.. వాళ్లు ఇక్కడికి రావడానికి ఆసక్తిగా ఉన్నారు.. కానీ జాగా ఎక్కడ ఉంది..
యాంకర్: ట్రంప్ వెనక్కి పోమని ఒత్తిడి చేస్తున్నారుగా…?
రేవంత్ రెడ్డి: అక్కడ ఎలక్ట్రోరల్ సిస్టమ్‌లో తెలుగు ప్రజలు ఉన్నారు.. మేం ఆ ఎన్నికను ప్రభావితం చేస్తున్నాం.. అక్కడ నుంచి పంపిస్తే ఆయనను కుర్చీ నుంచి పంపిస్తారు.. మేం వారి ఎన్నికను, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాం.. తెలుగువాళ్లు అక్కడ శక్తిమంతులు. మేం యూదుల మాదిరే ఉన్నాం.. మమ్మల్ని విస్మరించలేరు…
ఎక్కువ మంది పిల్లలపై మీ సూచన…?
రేవంత్ రెడ్డి: అమ్మలను అభినందించాలి.. పిల్లల సంరక్షణను ఆమె చూస్తోంది. మాతృమూర్తులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. జనాభా అనేది జాతీయ సమస్య.. జపాన్ పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తున్నారు. మన దేశంలోనూ జీవితకాలం పెరిగింది. ఇప్పుడు వయో వృద్ధుల సమస్య పెరిగింది..ఇంకా పెరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించుకోవాలి..ఇది చాలా పెద్ద విషయం.. మనం చర్చ ప్రాథమిక దశలో ఉన్నాం…
యాంకర్: ఉత్తరప్రదేశ్ నుంచి యువత దక్షిణాది రాష్ట్రాలకు వస్తున్నారు.. దక్షిణాదిలో వృద్దులు పెరుగుతున్నారు..?
రేవంత్ రెడ్డి: దక్షిణాది ముఖ్యంగా కేరళ నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు వెళుతున్నారు.. తెలుగు ప్రజలు అమెరికా వెళుతున్నారు.. మనవాళ్లు ఇతర దేశాలకు వెళుతుంటే.. మన దేశంలోని ఒక రాష్ట్రం వారు ఇంకో రాష్ట్రానికి వస్తున్నారు.. దేశంలో గతంలో సర్టిఫికెట్ లభిస్తే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది. నైపుణ్యం ఉండడం లేదు.. ఇప్పుడు నైపుణ్యం అవసరం. నైపుణ్యాభివృద్ధి పై ఒక విధానం కావాలి.. ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధిపై దృష్టిపెట్టాలి.. నేను నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాను. నేను పొరుగు రాష్ట్రాలతో పోటీ పడడం లేదు.. ఇతర దేశాలతో పోటీ పడుతున్నా… హైదరాబాద్… బెంగళూర్, ముంబయి, చెన్నైతో పోటీ పడితే మజా రాదు… ప్రపంచమే ఇప్పుడు కుగ్రామం.. ప్రపంచంతో పోటీ పడాలి.. ఎప్పుడు ఎన్నికలపై రాజకీయాలు అవసరం లేదు.. మన దృక్పథంలో మార్పు అవసరం. . ఇప్పుడు వాతావరణ మార్పులు చాలా వేగంగా ఉంటున్నాయి. ఉదాహారణకు… రోజుకు రెండు సెంటిమీటర్ల వర్షపాతం లెక్కన హైదరాబాద్‌లో మౌలిక వసతులు ఏర్పడ్డాయి.. గత నెలలో మూడు గంటల్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చింది. ఖమ్మం జిల్లాలో మూడు గంటల్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుంది..ఆ సమస్యను మనం ఎలా ఎదుర్కొంటాం. వరద లేని నగరాలు కావాలి…దుబాయ్, స్పెయిన్, బెంగళూర్‌లో ఏం జరిగింది.. ఢిల్లీలో కాలుష్యం సంగతి ఏమిటి..? మీరు పిలిస్తే నేను భయపడ్డా.. (నవ్వులు) మళ్లీ పిలిస్తే వచ్చా… కాబట్టి వాతావరణ మార్పులు… నైపుణ్యాభివృద్ధిపై ఇప్పుడు చర్చ జరగాలి.. ఆలోచించాలి.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభదశలోనే విద్యా, వ్యవసాయ రంగాలపై చొరవ చూపారు. విప్లవం తెచ్చారు.. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి.. వాతావరణ మార్పులపై చర్చ అవసరం…
యాంకర్: కానీ ఓటర్లు ఎందుకు వీటిని పట్టించుకోవడం లేదు…?
రేవంత్ రెడ్డి: నాయకులకు వీటిపై సరైన పర్‌సెప్షన్ లేదు… ప్రతి అంశంపై ఉండాలి.. స్వాతంత్య్రం కోసం గాంధీ, సుభాష్ చంద్రబోస్ పోరాడారు.. ప్రజలను ప్రేరేపించారు..
యాంకర్: వాళ్లకు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసు… దాని ఆధారంగా చేశారు.. ఇప్పుడు లేరు…?
రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీనే మొదట ఆ ఉద్యమాలు రూపొందించింది.. కాంగ్రెస్ వేదికగానే ఆ నాయకులు వచ్చారు.. ఆ వేదికగానే పోరాడారు.. ఇప్పుడు నాయకులు ప్రస్తుత అంశాలపై చొరవ చూపాలి.. దేశంలో రాజీవ్ గాంధీ కంప్యూటర్… టెలికం విప్లవాలు తీసుకువచ్చారు.. ఇప్పుడు ప్రపంచం మన చేతిలో ఉందంటే అందుకు రాజీవ్ గాంధీ కారణం.. రాజీవ్ గాంధీ 18 ఏళ్ల యువకులకు ఓటు హక్కు ఇచ్చారు. ఎమ్మెల్యే పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయస్సు ఎందుకు..? వీటిపై పార్లమెంట్‌లో చర్చ లేదు. నేను అయిదేళ్లు ఎంపీగా ఉన్నా… చర్చకు అవకాశమే ఇవ్వలేదు… నాయకులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలి.. ఆలోచన విధానం మార్చుకోవాలి..
శాసనసభ ఎన్నికలపై….
రేవంత్ రెడ్డి: హరియాణాలో ఎందుకు ఓడిపోయామో తెలియదు. అక్కడ ఓటమిపై నేను అధ్యయనం చేయలేదు.. తెలంగాణలో మేం కష్టపడి పని చేశాం.. మేం తెలంగాణలో సోనియా గాంధీ పేరుపై ఓట్లు అడిగాం.. మీ కలను నెరవేర్చుతానని ఆమె మాట ఇచ్చారు.. తెలంగాణ 60 ఏళ్ల కలను ఆమె నెరవేర్చారు.. నేను సైనికుడిని మాత్రమే.. మేం ఆమె మాటను వినియోగించుకున్నాం.. హరియాణాలో జాట్-నాన్ జాట్ అంశం వచ్చి ఉండవచ్చు.. హరియాణాలో రాహుల్ గాంధీ పేరుపై ఓటు అడిగి ఉంటే వేరేలా ఉండేది.. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు… మణిపూర్ నుంచి ముంబయి వరకు పాదయాత్ర చేశారు.. ఇక్కడ గెలిస్తే రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెబితే వేరేలా ఉండేది. స్థానికత అంశంపై ఎన్నికల్లో పోరాడితే అక్కడ ఇష్టాఇష్టాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి.. బీజేపీ వాళ్లు సర్పంచి, సొసైటీ ఎన్నికల్లోనూ మోదీ పేరుతో ఓటు అడుగుతున్నారు.. సర్పంచికి… మోదీకి ఏం సంబంధం.. స్థానిక సమస్యలు అధిగమించేందుకు ఒక బ్రాండ్ అవసరం. ఈ దేశంలో రెండే కుటుంబాలు ఉన్నాయి.. ఒకటి సంఘ్ కుటుంబం. మోదీ కుటుంబం.. మరొకటి మహాత్మా గాంధీ కుటుంబం.. ఈ పర్‌సెప్షన్ తీసుకురావాలి…అప్పుడే ప్రజలు ఆలోచించుకుంటారు..
యాంకర్: ఇదే సరైంది కాదేమో..?
రేవంత్ రెడ్డి: తెలంగాణలో నేను పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో మాకు 1.50 శాతం ఓట్లు వచ్చాయి.. 3,200 ఓట్లు వచ్చాయి. ఆ సీటును బీజేపీ గెల్చింది. నాలుగు ఉప ఎన్నికల్లో మాకు డిపాజిట్ రాలేదు. మాకు అత్యధికంగా 15 వేల ఓట్లు వచ్చాయి.. నాలుగు ఉప ఎన్నికలు జరిగితే రెండు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెల్చింది. మాకు డిపాజిట్లు రాలేదు. అక్కడ మా ప్రయాణం ప్రారంభమైంది.. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 40 శాతం సీట్లు.. 119లో 65 సీట్లు వచ్చాయి.. సంక్షేమమే ఎన్నికల్లో పెద్ద పాత్ర పోషించదు.. దాని పాత్ర పరిమితం. బ్రాండ్ సృష్టించగల్గితే.. భరోసా సృష్టిస్తే ఫలితాలు వస్తాయి. .
యాంకర్: కాంగ్రెస్ ఎందుకు గాంధీ బ్రాండ్ ను ప్లే చేయడం లేదు..?
రేవంత్ రెడ్డి: నాకు తెలియదు.
యాంకర్: మహారాష్ట్రలోనూ ఆ బ్రాండ్ ప్లే చేయడం లేదుగా…?
రేవంత్ రెడ్డి: మహారాష్ట్రలో మరో అంశం ఉంది.. గుజరాత్ వర్సెస్ మరాఠా.. తోబుట్టుల పోరు.. (సిబ్లింగ్స్ ఫైట్).. మహారాష్ట్ర చరిత్ర గురించి ఇన్నాళ్లుగా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్, ఫూలే అంబేడ్కర్ గురించి చదువుకున్నాం.. తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే, శరద్ పవార్ గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్, ఫడ్నవీస్ లను చూస్తున్నాం.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాం.. ఇప్పుడు ఎక్కడైనా వెన్నుపోటు పోడిస్తే వారిని ఏక్‌నాథ్ శిండే అంటున్నారు… శిందే తయారయ్యాడనే అంశం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది..సిబ్లింగ్ రైవలరీతో మహారాష్ట్రను ఖతమ్ చేస్తున్నారు.. మా పెట్టుబడులు తీసుకెళుతున్నారు.. రాజకీయాల్లో మా నేతలను ఖతం చేస్తున్నారనే అంశం పైకి వస్తే కథ ముగుస్తుంది.
యాంకర్: కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఎక్కువ.. మహారాష్ట్రలోనూ అంతర్గత పోరు ఉంది..?
రేవంత్ రెడ్డి: ఈ అంశం మహారాష్ట్ర నేతలను అడగాలి.. తెలంగాణ విషయానికి ఒక వర్గం పేరు చెబితే ఇంకొరు ఎందుకు ఓటు వేయాలి అనుకుంటారు.. ఇంకొకరు పేరు చెబితే మరో వర్గం ఓటు ఎందుకు వేయాలని అనుకుంటుంది… అందుకే రాహుల్ గాంధీ పేరుతో మహారాష్ట్రలో రాజకీయాలు చేయాలి. నేను మహారాష్ట్ర వెళుతున్నా. తర్వాత నా పరిశీలనలు చెబుతా..