ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

కాంగ్రెస్‌ ‌చీటింగ్‌పై అందరూ కేసులు పెట్టాలి
రైతుబంధు, రుణమాఫీ కోసం నిలదీయాలి
ఆదిలాబాద్‌ ‌సభలో పార్టీ శ్రేణులకు కెటిఆర్‌ ‌పిలుపు

ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌24: రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు వెళ్ల‌డానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని.. ఒకట్రెండు ఏండ్లు జైలులో ఉండేందుకు రెడీ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్ అన్నారు. తప్పకుండా కాంగ్రెస్‌ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. అసలు చీటింగ్‌ ‌కేసులు ఎవరి మీద పెట్టాలి.. తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిపై కేసులు పెట్టాలి. రైతుబంధు ఎగ్గొట్టి, రుణమాఫీ చేయనందుకు రైతులు కేసులు పెట్టాలి. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి.. ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందుకు యువత కేసులు పెట్టాలి. ఇలా అన్ని వర్గాలు పోలీస్‌ స్టేషన్ల ముందు లైన్లు కట్టి చీటింగ్‌ ‌కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్‌ ‌నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో మిగలడు అని కేటీఆర్‌ ‌తెలిపారు.  ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతన్నల ధర్నాలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌ ‌నుంచి ఉదయం ఏడున్నరకు వెళ్లాం..  మేడ్చల్‌ ‌వద్దనే 45 నిమిషాలు పట్టింది. ఇక డిచ్‌పల్లి వద్ద కొందరు మహిళలు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధర్నా చేస్తున్నారు.

ఏం కష్టమొచ్చింది అని దిగాను. వాళ్లు పోలీసోళ్ల భార్యలు. వన్‌ ‌పోలీసింగ్‌ ‌కావాలని డిచ్‌పల్లి బెటాలియన్‌ ‌వద్ద ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తున్న మమ్మల్ని రక్తం కారేలా గుంజుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖరికి కాంగ్రెస్‌ ‌పాలనలో పోలీసుల భార్యలు ధర్నాలు చేసే పరిస్థితి వొచ్చింద‌ని కేటీఆర్ కేటీఆర్‌ ‌మండిపడ్డారు. పోలీసుల‌నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇలాంటి కిరాతక పనులు బీఆర్‌ఎస్‌ ‌పాలనలో చేయలేదు. మంత్రినో, కంత్రినో ఫోన్‌ ‌చేస్తే ఆగం కాకండి.. న్యాయం, ధర్మం ప్రకారం నడుచుకోండి. పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో సహా ఇస్తాం. రేవంత్‌ ‌రెడ్డి రాజు, చక్రవర్తి కాదు. చంద్రబాబు, రాజశేఖర్‌ ‌రెడ్డి లాంటి నాయకులతోనే కొట్లాడినం.. ఇత‌నెంత చిట్టి నాయుడు.. గింతంత మనిషి.. వాని చూసి ఆగం కావొద్దని అన్నారు. మా టైమ్‌ ‌వొచ్చాక మిత్తితో సహా ఇస్తామని కేటీఆర్‌ ‌హెచ్చరించారు.

ఆదిలాబాద్‌లో ఖానాపూర్‌ ‌చెరువు వద్ద 2 వేల ఇండ్లు కూలగొట్టేందుకు అధికారులు వెళ్లారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోనే ఆ ఇండ్లకు పర్మిషన్లు, పట్టాలు ఇచ్చారు. బాధితుడు బొడిగెం గంగన్న నాలుగు తిట్లు తిట్టిండు. ఇల్లు కూలగొడితే ఎవరైనా  ఊకుంటాడా..? ఆయన తిట్టిండని ఆయన దమీ కేసు పెట్టారు.. జైల్లో పెడుతారట.. వంద రోజుల్లో అన్నీ చేస్తానని తప్పించుకున్న కాంగ్రెస్ నేత‌ల‌మీద కేసులు పెట్టాలా? పేదల మీద కేసులు పెట్టాలా..?   రైతులపై కేసులు పెడుతాం అంటే ఊరుకోబోమ‌ని కేటీఆర్  హెచ్చ‌రించారు.

తెలంగాణలో మోసపోయామని చెప్పండి
తెలంగాణలో మోసపోయామని, మహారాష్ట్రలో చెప్పి కాంగ్రెస్‌ను ఓడించాలని సరిహద్దు గ్రామాల ప్రజలకు కెటిఆర్‌ ‌పిలుపునిచ్చారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఈ నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ‌మోస‌గాళ్ల‌కు వోటేయొద్దని మహారాష్ట్రలో ఉన్న బంధువులకు, దోస్తులకు గట్టిగా చెప్పండి అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సూచించారు. ఆదిలాబాద్‌ ‌జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page