పండే భూముల్లో ఫార్మాసిటీ ఎందుకు ..?

ఫార్మాసిటీ భూముల్లో రియల్‌ దందా
మాజీమంత్రి హరీష్‌ రావు ఆరోపణ
రేవంత్‌ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ సవిూపంలో ఫార్మాసిటీ కోసం 15 వేల ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్‌ సేకరించారని గుర్తుచేశారు. ఫార్మాసిటీకి అన్ని అనుమతులు వొచ్చిన చోట ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు.. దీని కోసం రేవంత్‌ ప్రభుత్వం పచ్చని పొలాలు లాక్కుంటుందని ఆరోపణలు చేశారు. ’రేవంత్‌ రెడ్డి నువ్వు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ వా.. లేక ముఖ్యమంత్రివా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు విూడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడు, నాలుగు వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి.. మిగిలిన 10 వేల ఎకరాలను ప్లాట్లు చేసి అమ్మే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
బంగారం లాంటి పంట పండే భూముల్లో ఫార్మాసిటీ ఎందుకని నిలదీశారు. మూసీ సుందరీకణ పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ’ గరీబీ హఠావో అంటే రేవంత్‌ కిసాన్‌ హఠావో’ అంటున్నారని విమర్శలు చేశారు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని అడిగారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో అసైన్డ్‌ భూములను పట్టా భూములు చేస్తానని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముందు సీఎం రేవంత్‌రెడ్డి హావిూ ఇచ్చారని గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీ ఇప్పటికైనా స్పందించు.. రేవంత్‌కు మొట్టికాయలు వేసి హావిూలు అమలు చేయించాలని కోరారు. బతుకమ్మ పండుగ వొచ్చినా రైతుబంధు రాలేదని ఎద్దేవా చేశారు.రుణమాఫీ పేరుతో దేవుళ్లనూ రేవంత్‌ మోసం చేశారని ఫైర్ అయ్యారు.
న్యాల్‌కల్‌ మండలంలో తలపెట్టిన ఫార్మాసిటీ భూ సేకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోమని.. అవసరమైతే గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్తామని హెచ్చరించారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. రైతుల జోలికి వొస్తే రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెబుతామని వార్నింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ శివారులో ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుంటే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని కోరారు. మూసీని మంచిగా చేస్తానని ఫార్మాసిటీ పేరుతో మంజీరా నదిని కలుషితం చేస్తావా అని ప్రశ్నించారు. భూసేకరణను అడ్డుకుంటామని…. తానే వొచ్చి బుల్డోజర్లకు ఎదురు నిలబడతానని అన్నారు. రేవంత్‌ది నకిలీ ఇందిరమ్మ పాలన అని విమర్శించారు. సీఎం కుర్చీ కోసం రేవంత్‌ రెడ్డి అన్ని పార్టీలు మారారని విమర్శించారు. పోరంబోకు, రాళ్లురప్పల భూముల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని.. వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేయొద్దని సీఎం రేవంత్‌రెడ్డిని హరీష్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page